కరోనా విజృంభణకు చెక్ పెట్టాలంటే.. సంక్రాంతి నుంచి ఉగాది దాకా జాగ్రత్తగా ఉండాల్సిందేనని ప్రముఖ వైద్యుడు, పబ్లిక్‌హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు కె.శ్రీనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. స్వీయ నియంత్రణ చాలా ముఖ్యమని.. మాస్కులు, భౌతికదూరం వంటి కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ప్రస్తుతం ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో పాజిటివ్ కేసులు తగ్గుతున్నా.. ఈ నెలాఖరు దాకా ఇదే పరిస్థితి కొనసాగితేనే కరోనా తగ్గుముఖం పట్టినట్టు భావించాలని చెప్పారు. కొద్దిపాటి ఆంక్షలు విధిస్తే సరిపోతుందని, లాక్‌డౌన్ అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో శ్రీనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..
– సాక్షి, హైదరాబాద్
సాక్షి: ప్రస్తుత కరోనా పరిస్థితి ఎలా ఉందంటారు?
డాక్టర్ శ్రీనాథ్: కేవలం పాజిటివ్ కేసుల సంఖ్య కాకుండా.. సీరియస్ అయ్యే వారి ఆధారంగా అంచనా వేయాలి. ప్రస్తుతం మొత్తం కేసుల్లో 5–10 శాతం మధ్యలోనే ఆస్పత్రుల్లో చేరుతున్నట్టు తేలింది. ఇప్పుడు తీవ్ర పరిస్థితులు లేకపోయినా.. కరోనాను తక్కువగా అంచనా వేయొద్దు. ఎక్కువ మంది డాక్టర్లు, వైద్య సిబ్బందికి వైరస్ సోకి ఐసోలేషన్‌కు వెళ్లాల్సి వస్తోంది.
దీనితో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడుతోంది. రాబోయే రోజుల్లో చాలా మందికి పాజిటివ్ రావొచ్చు. ఒమిక్రాన్ వేరియంట్ ముక్కు, గొంతులోనే ఎక్కువగా పెరుగుతోంది. ఊపిరితిత్తుల్లోకి వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువ. అందువల్ల తీవ్ర వ్యాధిగా మారకపోవచ్చు. కానీ వృద్ధులు, తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారిపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
మూడో వేవ్ ఎప్పటికల్లా పీక్‌కు వెళ్లొచ్చు?
►అందరూ నిబంధనలు పాటిస్తే జనవరి చివరి వరకల్లా కేసులు తగ్గిపోవచ్చు. అజాగ్రత్తగా ఉంటే ఫిబ్రవరి దాకా పెరగవచ్చు. ప్రస్తుతం పెద్ద నగరాల్లో కేసులు తగ్గుముఖం పట్టే సూచనలున్నాయి. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులపై స్పష్టత రాలేదు. సంక్రాంతి, ఇతర సెలవులంటూ ఇష్టారీతిన ప్రయాణాలు చేస్తే అక్కడా కేసులు పెరుగుతాయి. అత్యవసరమైతేనే ప్రయాణం చేయాలి. పండుగలు, పబ్బాలను ఇళ్లలో, కుటుంబ సభ్యుల మధ్యే జరుపుకోవడం మంచిది.
యూఎస్, ఇతర దేశాల వంటి పరిస్థితి వస్తుందా?
►నిజానికి అమెరికాలో డెల్టా వ్యాప్తే ఇంకా ముగియలేదు, పైగా ఒమిక్రాన్ విజృంభణతో కేసులు పెరుగుతున్నాయి. అదీగాక అక్కడ 60శాతం మంది ఒక్క డోసే తీసుకున్నారు. అక్కడ ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో చాలా వరకు వ్యాక్సిన్ తీసుకోని వారే. అందువల్ల అమెరికా పరిస్థితి వేరు. ఇక పశ్చిమ దేశాల ప్రభావం మన దేశంపై ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. తొలివేవ్ సమయంలో ఆల్ఫా వేరియెంట్ మనకు ఆలస్యంగా వచ్చింది. రెండో వేవ్‌లో డెల్టా వేరియంట్ ముందు మన దగ్గర వచ్చాకే.. యూఎస్, ఇతర దేశాల్లో ప్రభావం చూపింది.
ప్రస్తుతం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి?
►సరైన మాస్కులు పెట్టుకుంటే కరోనా ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. రెండు, మూడు పొరల క్లాత్ మాస్కులు వాడాలి. క్లాత్ మాస్కు, సర్జికల్ మాస్కు కలిపి పెట్టుకుంటే మంచిది. పేదలు, అల్పాదాయ వర్గాలు మాస్కులపై డబ్బులు ఖర్చుపెట్టలేక.. సాధారణ మాస్కులతోనే ఉంటే వైరస్ బారినపడతారు, వ్యాప్తి పెరుగుతుంది. అందువల్ల వారికి ప్రభుత్వాలే ఉచితంగా సర్జికల్, ఇతర మాస్కులు అందజేయాలి.
ఒమిక్రానే చివరి వేరియెంట్ అనుకోవచ్చా?
►ఒమిక్రానే కరోనా చివరి వేరియెంట్ అనుకుంటే.. అత్యధిక మందికి సోకి ఇమ్యూనిటీ రావొచ్చు. రెండు, మూడు నెలల్లోగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు కుదుటపడొచ్చు. కానీ మరోవేరియెంట్ వచ్చే ప్రమాదం లేదని చెప్పలేం. అందువల్ల కనీసం ఏప్రిల్‌దాకా జాగ్రత్తలు పాటించాలి.
Comments
Please login to add a commentAdd a comment