Covid Third wave may started Somewhere In Country - Sakshi
Sakshi News home page

క్లిష్ట దశలో ఉన్నాం.. థర్డ్‌ వేవ్‌ మొదలై ఉండొచ్చు

Published Sun, Aug 1 2021 3:32 AM | Last Updated on Mon, Aug 2 2021 3:08 PM

Corona Third Wave May Started Somewhere In Country: Dr Srinath Reddy - Sakshi

ప్రమాదం పొంచి ఉంది.. 
మళ్లీ మునుపటిలా రోజువారీ జీవనం గడపాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఇంకా ప్రమాదం పొంచి ఉన్నందున మధ్యేమార్గంగా మెలగాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది చివరిదాకా అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు, భౌతికదూరం, ఇతర జాగ్రత్తలు తప్పనిసరి. 

పండుగలు, పబ్బాల్లో జాగ్రత్త.. 
గత ఏడాది కరోనా తొలిదశ చివరలో ఆగస్టు–అక్టోబర్‌ మధ్య వరుసగా పండుగలు వచ్చినా.. మాస్కులు, ఇతర జాగ్రత్తలు పాటించడం వల్ల వైరస్‌ నియంత్రణలోనే ఉంది. తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండో వేవ్‌కు దారితీసింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా రోజులుగా ఇండ్లకే పరిమితమైన జనం.. ఇటీవల బయట తిరగడం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కేసుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారికి సంబంధించి ప్రస్తుతం సున్నితమైన, క్లిష్టదశలో ఉన్నామని ప్రముఖ వైద్యుడు, పబ్లిక్‌హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు కె.శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు ఒకేలా లేవని.. దేశంలో కొన్నిచోట్ల ఇప్పటికే కరోనా మూడో వేవ్‌ మొదలై ఉండొచ్చని చెప్పారు. కరోనా మహమ్మారి నియంత్రణకు వ్యాక్సినేషన్‌ కీలకమని.. దేశంలో 70, 80 శాతం మందికి టీకాలు వేసే వరకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మాస్కులు, భౌతికదూరం వంటి జాగ్రత్తలతోపాటు ఇండ్లు, ఆఫీసులు, ఇతర చోట్ల గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చూసుకోవడం కూడా కీలకమన్నది గుర్తుంచుకోవాలని చెప్పారు. దేశంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను కోవిడ్‌ మహమ్మారి గుర్తు చేసిందన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కె.శ్రీనాథ్‌రెడ్డి ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలు వెల్లడించారు. ఆ వివరాలివీ.. 
 
సాక్షి: దేశంలో థర్డ్‌ వేవ్‌ మొదలైందా? పరిస్థితి ఎలా ఉంది? 
డాక్టర్‌ శ్రీనాథ్‌: దేశంలోని అన్నిచోట్లా ఇంకా కరోనా రెండో వేవ్‌ ముగియలేదు. ముగిసిన చోట కొద్దిరోజులు తెరిపి ఇచ్చి.. మళ్లీ కేసులు పెరిగితే థర్డ్‌ వేవ్‌ అనుకోవచ్చు. కేరళ, ఈశాన్య రాష్ట్రాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా రెండో వేవ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో రెండో వేవ్‌ ఆలస్యంగా మొదలైంది. కేసులు పూర్తిగా తగ్గాయని భావించిన బెంగళూరు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, బెంగాల్, గుజరాత్‌ తదితర చోట్ల మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అంటే ఆయా ప్రాంతాల్లో మూడో వేవ్‌ మొదలైందని అనుకోవచ్చు. 

మూడో వేవ్‌ తీవ్రత ఎలా ఉంటుంది? కొత్త స్ట్రెయిన్లు, వేరియెంట్లు వస్తే ఎలా? 
శ్రీనాథ్‌: మొత్తం దేశవ్యాప్తంగా ఒకే విధంగా మూడో వేవ్‌ వస్తుందనేది సరైన అవగాహన కాదు. ఒకేసారి దాడి చేయకుండా దశలుగా వస్తోంది. కొన్నిసార్లు తక్కువ, ఎక్కువ ప్రభావమున్న దశలు ఉంటున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో రెండో వేవ్‌ సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. ఇక మూడో వేవ్‌ కొన్నిచోట్ల ముందుగానే మొదలైందని, చాలాచోట్ల ఇంకా ప్రారంభం కాలేదని భావించాల్సి ఉంటుంది. ఇదొక సంక్లిష్టమైన దశగా భావించొచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియెంట్‌ ప్రబలంగా వ్యాపిస్తోంది. అనేక దేశాల్లో ముఖ్యమైన వేరియెంట్‌గా ఉంది. వ్యాక్సినేషన్‌ పెంచి దానిని నియంత్రించేందుకు ప్రయత్నించే కొద్దీ మనుగడ కోసం వైరస్‌ మరిన్ని మార్పులు చేసుకునేందుకు (మ్యూటేట్‌ అయ్యేందుకు) ప్రయత్నిస్తుంది. అందువల్ల వృద్ధులు, తీవ్రంగా జబ్బు చేసిన వారిలో మ్యుటేషన్‌ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త మ్యుటేషన్లు, వేరియంట్లు ఎంత ప్రభావం చూపుతాయి, వ్యాప్తి ఏమేర పెరుగుతుంది అన్నది చూడాలి. డెల్టా వేరియంట్‌ నుంచి మరింత ప్రమాదకరమైన మ్యూటేషన్లు రాకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. 

ప్రస్తుత పరిస్థితులను ఎలా అంచనా వేయాలి? ఏం చేయాలి? 
శ్రీనాథ్‌: మొత్తంగా ఎంతమందికి ఇమ్యూనిటీ వచ్చింది? ఎంతవరకు వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం? గుంపులుగా తిరగడం, మాస్క్‌ ధరించకపోవడం వంటి జాగ్రత్తలను ప్రజలు ఎంతవరకు ఆచరిస్తున్నారు? ఏ వేరియెంట్, ఎంతగా వ్యాప్తి చెందుతోంది..? వంటి అంశాలపై అంచనాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఈ పరిస్థితులు ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఉన్నందున అన్నింటినీ ఒక గాటన కట్టి.. మూడో వేవ్, వ్యాప్తి, ఇతర అంచనాలు వేయలేం. ఏ రాష్ట్రాల్లో కేసులు అదుపులో ఉన్నాయి, ఎక్కడ పెరుగుతున్నాయనేదీ పరిశీలించాల్సి ఉంటుంది. మళ్లీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వెళ్తుంటే.. కరోనా మూడోవేవ్‌ వచ్చినట్టుగానే భావించాలి. 

కరోనా రెండో వేవ్‌ నుంచి ఏమైనా నేర్చుకున్నామంటారా? 
శ్రీనాథ్‌: రెండో వేవ్‌ తీవ్ర ప్రభావం చూపించడంతో ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా కొంతవరకు పాఠాలు నేర్చుకున్నారు. వైద్యారోగ్యసేవలు పెంచేదిశగా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. హాస్పిటల్‌ సర్వీసెస్, ఎక్విప్‌మెంట్, ఆక్సిజన్‌ సరఫరా పెంచేందుకు అన్నిచోట్లా సన్నాహాలు చేస్తున్నారు. కానీ ప్రాథమిక వైద్యసేవల విషయంలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఆ వ్యవస్థ ఇంకా పటిష్టం కాలేదు. హోంకేర్, కమ్యూనిటీ కేర్‌ విషయంలో అవసరమైన ప్రయత్నాలు చేయడం లేదు. 

దేశంలో వ్యాక్సినేషన్‌ పరిస్థితి ఏమిటి? 
శ్రీనాథ్‌: ఈ ఏడాది మొదట్లో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వేగం పెంచాల్సిన సమయంలోనే ప్రభుత్వ స్థాయిలో తప్పటగుడులతో చిక్కులు ఎదురయ్యాయి. ఈ ఏడాది జనవరిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోవిడ్‌ సమస్య ఇక ముగిసినట్టేనని భావించాయి. అందువల్ల అత్యవసరంగా వ్యాక్సిన్ల ఉత్పత్తి, దిగుమతి అవసరం లేదని.. దేశంలో ఉత్పత్తయ్యే వ్యాక్సిన్లను ఉపయోగిస్తూ వెళితే చాలని అభిప్రాయపడ్డాయి. మొదట 45ఏళ్లు పైబడిన వారికి వాడదామని, ఆలోగా మన దగ్గరి ఉత్పత్తులు పెరుగుతాయని అనుకున్నాయి. కానీ ఈ అంచనాలను తలకిందులు చేస్తూ రెండో వేవ్‌ పంజా విసిరడంతో మళ్లీ కొత్త చర్యలు మొదలుపెట్టారు. తొలుత ప్రైవేట్‌ రంగాన్ని వ్యాక్సినేషన్‌లో భాగస్వాములను చేయకపోవడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌ నిల్వలు చేరుకునేలా చూడాలి. ప్రజలకు వ్యాక్సిన్లపై విశ్వాసం కలిగించి, తీసుకునేలా చూడాలి. వ్యాక్సినేషన్‌ పూర్తయితే మళ్లీ సాధారణ జీవితం గడిపేందుకు వీలవుతుందని నచ్చజెప్పాలి.  

సాక్షి: దేశంలో థర్డ్‌ వేవ్‌ మొదలైందా? పరిస్థితి ఎలా ఉంది? 
డాక్టర్‌ శ్రీనాథ్‌: దేశంలోని అన్నిచోట్లా ఇంకా కరోనా రెండో వేవ్‌ ముగియలేదు. ముగిసిన చోట కొద్దిరోజులు తెరిపి ఇచ్చి.. మళ్లీ కేసులు పెరిగితే థర్డ్‌ వేవ్‌ అనుకోవచ్చు. కేరళ, ఈశాన్య రాష్ట్రాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా రెండో వేవ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో రెండో వేవ్‌ ఆలస్యంగా మొదలైంది. కేసులు పూర్తిగా తగ్గాయని భావించిన బెంగళూరు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, బెంగాల్, గుజరాత్‌ తదితర చోట్ల మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అంటే ఆయా ప్రాంతాల్లో మూడో వేవ్‌ మొదలైందని అనుకోవచ్చు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement