Public Health Foundation of India
-
పూర్తిస్థాయి టీకాలొచ్చే వరకు కాస్త జాగ్రత్త
సాక్షి, అమరావతి: కరోనా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే టీకాలు అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి సూచిస్తున్నారు. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సహా పలుచోట్ల కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో వ్యాధి తీవ్రత వంటి అంశాలపై ‘సాక్షి’తో శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ఒమిక్రాన్ పరివారంలోనిదే ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులన్నీ ఒమిక్రాన్ వేరియంట్ పరివారానికి చెందిన వైరస్ రకమే. గతంలో వైరస్ సోకడం, టీకా వేసుకోవడంతో వచ్చిన రోగ నిరోధక శక్తి ఉన్న వారిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపించడం లేదు. దగ్గు, జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలే ఎక్కువ మందిలో ఉంటున్నాయి. తీవ్రమైన జబ్బు చేసి ఆస్పత్రుల్లో చేరడం, మరణించడం వంటి పరిస్థితులు చాలా అరుదుగానే ఉంటున్నాయి. వైరస్ బలహీన పడటంతో ముక్కు, గొంతులోనే ఉండిపోతోంది. ఊపిరితిత్తులపై దాడి చేయడం లేదు. కొంతమందిలో ముక్కు, గొంతు నుంచి వైరస్ కడుపులో చేరుతోంది. దీంతో వాంతులు, కడుపు తిప్పడం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. తీవ్రమయ్యే అవకాశాలు లేకపోలేదు ఒమిక్రాన్ పరివారం వల్ల ఇప్పటివరకూ తీవ్రమైన జబ్బు కలుగుతున్న దాఖలాలు లేకపోయినా వేగంగా వ్యాపించే గుణం మాత్రం కొనసాగుతోంది. ఈ వైరస్ తన స్వరూపాన్ని మార్చుకుని ప్రభావవంతంగా దాడి చేయడానికి ఆస్కారం లేకపోలేదు. గత అనుభవాలు, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే మరోమారు దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి పెరిగే ఆస్కారం ఉంది. మనకేమీ కాదులే అనే ధీమాకు పోకుండా, ఆందోళన చెందకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. మాస్క్ ధరించడం, సమూహాలకు దూరంగా ఉండటం, ఇతర జాగ్రత్తలు పాటించాలి. మాస్క్ ధరించడం వల్ల ఒక్క కరోనా నుంచే కాకుండా ఇన్ఫ్లుయెంజా, టీబీ, ఇతర రెస్పిరేటరీ వైరస్ల నుంచి కూడా రక్షణ కలుగుతుంది. వైరస్ స్థిమితంగా ఉండకుండా ఎప్పటికప్పుడు స్వరూపాన్ని మార్చుకుంటోంది. రెండు, మూడు నెలలకోసారి కొత్త వేరియంట్ రూపంలో వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. ఈ క్రమంలో స్వీయ రక్షణపై ప్రజలంతా దృష్టి సారించాలి. ప్రతి ఒక్కరు ప్రికాషన్ డోసు టీకా వేయించుకోవాలి. రోగ నిరోధక శక్తి పెంచుకోవడంపై శ్రద్ధ పెట్టాలి. బ్రాడ్‌బాండ్ టీకాపై ప్రయోగాలు విభిన్న కరోనా వేరియంట్ల నుంచి రక్షణ కల్పించే బ్రాడ్‌బాండ్ టీకా తయారీకి సంబంధించి ప్రయోగాలు జరుగుతున్నాయి. యూరప్, యూఎస్ఏ దేశాల్లో ట్రయల్స్ నడుస్తున్నాయి. మన దేశంలో ఇంకా ప్రయోగాలు మొదలు పెట్టలేదు. బ్రాడ్‌బాండ్ టీకాలు అందుబాటులో రావడానికి సమయం పట్టొచ్చు. -
భయం వద్దు.. భద్రత వీడొద్దు
సాక్షి, అమరావతి: ‘ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగని నిర్లక్ష్యంగా ఉండకూడదు. విదేశాలతో పోలిస్తే భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి వేగం తక్కువగా ఉంది. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. కానీ, ప్రజలు అప్రమత్తంగా ఉండటం మాత్రం ముఖ్యం. వైరస్ బారిన పడకుండా ఎవరికి వారు భద్రత చర్యలు తీసుకోవాలి. అలసత్వం వద్దు’ అని ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి చెప్పారు. భారత దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ తీవ్రత ఏ విధంగా ఉంటుంది? ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలను ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సాక్షి: ఒమిక్రాన్ వ్యాప్తి ఏ విధంగా ఉంది? డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి: విదేశాలతో పోలిస్తే భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి వేగం తక్కువగా ఉంది. విదేశాల్లో వాతావరణ పరిస్థితులు, రోగ నిరోధక శక్తి వైరస్ వ్యాప్తిపై ప్రభావం చూపుతాయి. భారత్‌తో పోలిస్తే విదేశాల్లో ప్రజల సగటు వయసు ఎక్కువ. మన దేశంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య జనాభాలో 6 శాతమే. అదే ఇటలీలో 27 శాతం, అమెరికాలో 16 శాతం. ఇలా చాలా దేశాల్లో మనకన్నా ఎక్కువగా ఉంది. దీనికి తోడు రక్తపోటు, మధుమేహం తరహా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) ప్రభావితులు విదేశాల్లో ఎక్కువగా ఉంటారు. అందువల్లే అక్కడ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. భారతదేశంలో వాతావరణం, రోగ నిరోధక శక్తి, ఇతరత్రా అంశాల కారణంగా ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉండదు. సాక్షి: కరోనా నుంచి టీ లింఫోసైట్స్ రక్షణ కల్పించినట్టు గతంలో వెల్లడైంది. ఒమిక్రాన్ నుంచి టీ లింఫోసైట్స్ రక్షణ కల్పిస్తాయా? శ్రీనాథ్‌రెడ్డి: యాంటీబాడీలు తగ్గినప్పటికీ టీ లింఫోసైట్స్ ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. యాంటీబాడీలు మూడు నుంచి ఆరు నెలల్లో తగ్గుతున్నాయి. కొందరిలో 9 నెలలు ఉంటున్నాయి. టీకాలు వేసుకున్న వారితో పోలిస్తే గతంలో కరోనా వచ్చి తగ్గిన వారిలో టీ లింఫోసైట్స్ చురుగ్గా పనిచేస్తాయి. ఇవి శరీరంలో పోలీస్‌లా వ్యవహరిస్తాయి. వైరస్లు, బాక్టీరియాలు దాడి చేసినప్పుడు వాటిని నియంత్రిస్తాయి. సాక్షి: యాంటీబాడీలు త్వరగా తగ్గిపోవడానికి ఆస్కారం ఉందా? శ్రీనాథ్‌రెడ్డి: క్యాన్సర్, ఇతర వ్యాధులకు మందులు వాడే వారు, పౌష్టికాహారం తీసుకోని వారిలో యాంటీబాడీలు త్వరగా తగ్గిపోతాయి. అందువల్లే ప్రభుత్వం 60 ఏళ్లు పైబడి, జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రికాషన్ డోసు టీకా పంపిణీ చేపట్టబోతోంది. వారందరూ ఈ టీకా వేయించుకుంటే వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు ప్రభుత్వం టీకా పంపిణీ చేయబోతోంది. అపోహలు వీడి అందరూ టీకా తీసుకోవాలి. సాక్షి: ఒమిక్రాన్‌తో ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడతాయా? శ్రీనాథ్‌రెడ్డి: ఢిల్లీ, మహారాష్ట్ర, సహా పలు రాష్ట్రాల్లో ఎక్కువగా ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి. అక్కడ ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. వైరస్ సోకిన వారిలో ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించడంలేదు. పెద్దగా ఆసుపత్రులపై ఒత్తిడి లేదు. విదేశాల్లో డెల్టా, ఒమిక్రాన్ కలిసిన కేసులు నమోదవుతుండటంతో అక్కడ ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. సాక్షి: ఒమిక్రాన్ నేపథ్యంలో ఎటువంటి మాస్క్‌లు ధరించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శ్రీనాథ్ రెడ్డి: ఆస్కారం ఉన్న వాళ్లు ఎన్ 95 మాస్క్‌లు వాడితే మంచిది. లేని పక్షంలో డబుల్ లేయర్ మాస్క్‌లు సురక్షితం. గుడ్డ, సర్జికల్ మాస్క్‌లు ఏవైనా సరే డబుల్ లేయర్ ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే సంక్రాంతి నాటికి కేసుల సంఖ్య పెరుగుతుంది. -
ఒమిక్రాన్‌పై ఆందోళనొద్దు.. మరిపిల్లల సంగతేంటీ ?
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ వేరియెంట్ గురించి మరీ ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(పీహెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి అన్నారు. ఒమిక్రాన్, బూస్టర్ డోస్‌లు వంటి అంశాలపై ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆ వివరాలు.. ‘ఒమిక్రాన్’ఆందోళనకరమేనా? జవాబు: దక్షిణాఫ్రికాలోని ఒమిక్రాన్ వేరియెంట్‌కు 32 మ్యుటేషన్లు వచ్చాయి. వాటి గురించిన ఆందోళన ఇక్కడ అవసరంలేదు. వైరస్‌లనేవి మ్యుటేట్ అవుతాయి. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు వంటివారిలో వైరస్ వివిధ రకాలుగా మ్యుటేట్ అయ్యేందుకు తగిన సమయం దొరుకుతుంది. అందువల్ల అది పెద్దసంఖ్యలో పునరుత్పత్తి చెందుతుంది. బోట్స్వానా తదితర దక్షిణాఫ్రికా దేశాల్లో హెచ్ఐవీ–ఎయిడ్స్ కేసులు కూడా తగిన సంఖ్యలో ఉన్నందున వైరస్ బాగా మ్యుటేట్ అయ్యేందుకు అనుకూల పరిస్థితులున్నాయి. ♦బూస్టర్‌డోస్‌లపై ఏమంటారు? జవాబు: బూస్టర్ డోస్‌లు వేసే విషయంలో మన ప్రాధామ్యాలు ఏమిటనేది ముందు నిర్ణయించుకోవాలి. అందుబాటులో ఉన్న టీకాలు, సరఫరా, వ్యాక్సిన్లు వేసే బృందాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ♦భారత్‌లో మొదటగా బూస్టర్ డోస్‌లు ఎవరికివ్వాలి? జవాబు: ఈ ఏడాది జనవరి–ఏప్రిల్ల మధ్య దేశంలో ముందుగా టీకాలు తీసుకున్న హెల్త్ వర్కర్లు, వృద్ధులు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, తీవ్ర అనారోగ్య పీడితులను గుర్తించి వారికి తొలుత బూస్టర్ డోస్‌లు వేయాలి. భారత్ జనాభాలోని కొన్నివర్గాల వారికి బూస్టర్ డోస్‌లు వేసేందుకు ముందు సంసిద్ధం కావాలి. ♦మరిపిల్లల సంగతేంటీ ? జవాబు: ప్రపంచవ్యాప్తంగా చూస్తే పిల్లలపై వైరస్ తీవ్ర ప్రభావం చూపడం లేదనేది స్పష్టమైంది. అందువల్ల ఇప్పుడు పిల్లలకు డోస్‌లు అవసరం లేదు. ♦మరి పిల్లలకు రక్షణ ఎలా? జవాబు: పెద్దలతోపాటు పిల్లలను సైతం కరోనా సోకడంతో (తీవ్ర జబ్బుగా మారకపోయినా) పాటు వైరస్ వాహకులుగా మారుతున్నారు. ఆ ప్రమాదాన్ని నివారించేందుకు పిల్లలు మాస్క్‌లు ధరించేలా చూడాలి. పెద్దలందరికీ టీకాలు వేయడం ద్వారా పిల్లలకు వైరస్ సోకకుండా జాగ్రత్త పడాలి. ♦వ్యాక్సిన్ల ప్రభావం ఎప్పుడు తగ్గుతుంది? జవాబు: కొన్ని నెలల తర్వాత టీకాల ప్రభావం కొంత తగ్గిపోతుందని వివిధ అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఐనప్పటికీ ఆ తర్వాత కూడా వ్యాక్సిన్ల వల్ల రక్షణ అనేది 50 శాతం దాకా ఉండొచ్చని అంచనా వేసున్నారు. ఏది ఏమైనా ముందుగా ఇన్ఫెక్షన్ సోకకుండా అన్ని జాగ్రత్తలు, నియంత్రణ చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యం, -
క్లిష్ట దశలో ఉన్నాం.. థర్డ్ వేవ్ మొదలై ఉండొచ్చు
ప్రమాదం పొంచి ఉంది.. మళ్లీ మునుపటిలా రోజువారీ జీవనం గడపాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఇంకా ప్రమాదం పొంచి ఉన్నందున మధ్యేమార్గంగా మెలగాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది చివరిదాకా అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు, భౌతికదూరం, ఇతర జాగ్రత్తలు తప్పనిసరి. పండుగలు, పబ్బాల్లో జాగ్రత్త.. గత ఏడాది కరోనా తొలిదశ చివరలో ఆగస్టు–అక్టోబర్ మధ్య వరుసగా పండుగలు వచ్చినా.. మాస్కులు, ఇతర జాగ్రత్తలు పాటించడం వల్ల వైరస్ నియంత్రణలోనే ఉంది. తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండో వేవ్‌కు దారితీసింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా రోజులుగా ఇండ్లకే పరిమితమైన జనం.. ఇటీవల బయట తిరగడం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కేసుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారికి సంబంధించి ప్రస్తుతం సున్నితమైన, క్లిష్టదశలో ఉన్నామని ప్రముఖ వైద్యుడు, పబ్లిక్‌హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కె.శ్రీనాథ్‌రెడ్డి తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు ఒకేలా లేవని.. దేశంలో కొన్నిచోట్ల ఇప్పటికే కరోనా మూడో వేవ్ మొదలై ఉండొచ్చని చెప్పారు. కరోనా మహమ్మారి నియంత్రణకు వ్యాక్సినేషన్ కీలకమని.. దేశంలో 70, 80 శాతం మందికి టీకాలు వేసే వరకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్కులు, భౌతికదూరం వంటి జాగ్రత్తలతోపాటు ఇండ్లు, ఆఫీసులు, ఇతర చోట్ల గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చూసుకోవడం కూడా కీలకమన్నది గుర్తుంచుకోవాలని చెప్పారు. దేశంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను కోవిడ్ మహమ్మారి గుర్తు చేసిందన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కె.శ్రీనాథ్‌రెడ్డి ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలు వెల్లడించారు. ఆ వివరాలివీ.. సాక్షి: దేశంలో థర్డ్ వేవ్ మొదలైందా? పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్ శ్రీనాథ్: దేశంలోని అన్నిచోట్లా ఇంకా కరోనా రెండో వేవ్ ముగియలేదు. ముగిసిన చోట కొద్దిరోజులు తెరిపి ఇచ్చి.. మళ్లీ కేసులు పెరిగితే థర్డ్ వేవ్ అనుకోవచ్చు. కేరళ, ఈశాన్య రాష్ట్రాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా రెండో వేవ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో రెండో వేవ్ ఆలస్యంగా మొదలైంది. కేసులు పూర్తిగా తగ్గాయని భావించిన బెంగళూరు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, బెంగాల్, గుజరాత్ తదితర చోట్ల మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అంటే ఆయా ప్రాంతాల్లో మూడో వేవ్ మొదలైందని అనుకోవచ్చు. మూడో వేవ్ తీవ్రత ఎలా ఉంటుంది? కొత్త స్ట్రెయిన్లు, వేరియెంట్లు వస్తే ఎలా? శ్రీనాథ్: మొత్తం దేశవ్యాప్తంగా ఒకే విధంగా మూడో వేవ్ వస్తుందనేది సరైన అవగాహన కాదు. ఒకేసారి దాడి చేయకుండా దశలుగా వస్తోంది. కొన్నిసార్లు తక్కువ, ఎక్కువ ప్రభావమున్న దశలు ఉంటున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో రెండో వేవ్ సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. ఇక మూడో వేవ్ కొన్నిచోట్ల ముందుగానే మొదలైందని, చాలాచోట్ల ఇంకా ప్రారంభం కాలేదని భావించాల్సి ఉంటుంది. ఇదొక సంక్లిష్టమైన దశగా భావించొచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియెంట్ ప్రబలంగా వ్యాపిస్తోంది. అనేక దేశాల్లో ముఖ్యమైన వేరియెంట్‌గా ఉంది. వ్యాక్సినేషన్ పెంచి దానిని నియంత్రించేందుకు ప్రయత్నించే కొద్దీ మనుగడ కోసం వైరస్ మరిన్ని మార్పులు చేసుకునేందుకు (మ్యూటేట్ అయ్యేందుకు) ప్రయత్నిస్తుంది. అందువల్ల వృద్ధులు, తీవ్రంగా జబ్బు చేసిన వారిలో మ్యుటేషన్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త మ్యుటేషన్లు, వేరియంట్లు ఎంత ప్రభావం చూపుతాయి, వ్యాప్తి ఏమేర పెరుగుతుంది అన్నది చూడాలి. డెల్టా వేరియంట్ నుంచి మరింత ప్రమాదకరమైన మ్యూటేషన్లు రాకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితులను ఎలా అంచనా వేయాలి? ఏం చేయాలి? శ్రీనాథ్: మొత్తంగా ఎంతమందికి ఇమ్యూనిటీ వచ్చింది? ఎంతవరకు వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం? గుంపులుగా తిరగడం, మాస్క్ ధరించకపోవడం వంటి జాగ్రత్తలను ప్రజలు ఎంతవరకు ఆచరిస్తున్నారు? ఏ వేరియెంట్, ఎంతగా వ్యాప్తి చెందుతోంది..? వంటి అంశాలపై అంచనాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఈ పరిస్థితులు ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఉన్నందున అన్నింటినీ ఒక గాటన కట్టి.. మూడో వేవ్, వ్యాప్తి, ఇతర అంచనాలు వేయలేం. ఏ రాష్ట్రాల్లో కేసులు అదుపులో ఉన్నాయి, ఎక్కడ పెరుగుతున్నాయనేదీ పరిశీలించాల్సి ఉంటుంది. మళ్లీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వెళ్తుంటే.. కరోనా మూడోవేవ్ వచ్చినట్టుగానే భావించాలి. కరోనా రెండో వేవ్ నుంచి ఏమైనా నేర్చుకున్నామంటారా? శ్రీనాథ్: రెండో వేవ్ తీవ్ర ప్రభావం చూపించడంతో ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా కొంతవరకు పాఠాలు నేర్చుకున్నారు. వైద్యారోగ్యసేవలు పెంచేదిశగా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. హాస్పిటల్ సర్వీసెస్, ఎక్విప్మెంట్, ఆక్సిజన్ సరఫరా పెంచేందుకు అన్నిచోట్లా సన్నాహాలు చేస్తున్నారు. కానీ ప్రాథమిక వైద్యసేవల విషయంలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఆ వ్యవస్థ ఇంకా పటిష్టం కాలేదు. హోంకేర్, కమ్యూనిటీ కేర్ విషయంలో అవసరమైన ప్రయత్నాలు చేయడం లేదు. దేశంలో వ్యాక్సినేషన్ పరిస్థితి ఏమిటి? శ్రీనాథ్: ఈ ఏడాది మొదట్లో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగం పెంచాల్సిన సమయంలోనే ప్రభుత్వ స్థాయిలో తప్పటగుడులతో చిక్కులు ఎదురయ్యాయి. ఈ ఏడాది జనవరిలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోవిడ్ సమస్య ఇక ముగిసినట్టేనని భావించాయి. అందువల్ల అత్యవసరంగా వ్యాక్సిన్ల ఉత్పత్తి, దిగుమతి అవసరం లేదని.. దేశంలో ఉత్పత్తయ్యే వ్యాక్సిన్లను ఉపయోగిస్తూ వెళితే చాలని అభిప్రాయపడ్డాయి. మొదట 45ఏళ్లు పైబడిన వారికి వాడదామని, ఆలోగా మన దగ్గరి ఉత్పత్తులు పెరుగుతాయని అనుకున్నాయి. కానీ ఈ అంచనాలను తలకిందులు చేస్తూ రెండో వేవ్ పంజా విసిరడంతో మళ్లీ కొత్త చర్యలు మొదలుపెట్టారు. తొలుత ప్రైవేట్ రంగాన్ని వ్యాక్సినేషన్లో భాగస్వాములను చేయకపోవడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ నిల్వలు చేరుకునేలా చూడాలి. ప్రజలకు వ్యాక్సిన్లపై విశ్వాసం కలిగించి, తీసుకునేలా చూడాలి. వ్యాక్సినేషన్ పూర్తయితే మళ్లీ సాధారణ జీవితం గడిపేందుకు వీలవుతుందని నచ్చజెప్పాలి. సాక్షి: దేశంలో థర్డ్ వేవ్ మొదలైందా? పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్ శ్రీనాథ్: దేశంలోని అన్నిచోట్లా ఇంకా కరోనా రెండో వేవ్ ముగియలేదు. ముగిసిన చోట కొద్దిరోజులు తెరిపి ఇచ్చి.. మళ్లీ కేసులు పెరిగితే థర్డ్ వేవ్ అనుకోవచ్చు. కేరళ, ఈశాన్య రాష్ట్రాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా రెండో వేవ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో రెండో వేవ్ ఆలస్యంగా మొదలైంది. కేసులు పూర్తిగా తగ్గాయని భావించిన బెంగళూరు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, బెంగాల్, గుజరాత్ తదితర చోట్ల మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అంటే ఆయా ప్రాంతాల్లో మూడో వేవ్ మొదలైందని అనుకోవచ్చు. -
‘లాక్డౌన్ మంచిదే, తర్వాత ఏంటన్నదే ప్రశ్న’
సాక్షి, అమరావతి: ‘ఈ ఏడాది జనవరిలోనే బ్రిటన్‌కు చెందిన ప్రమాదకర వేరియంట్స్ భారతదేశంలోకి ప్రవేశించాయి. అప్పుడే వీటిని నిలువరించి ఉంటే ఇప్పుడింత ఉపద్రవం వచ్చేది కాదు. అవే ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తృత వ్యాప్తిలో ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందాయి. అప్పట్లోనే అంతర్జాతీయ రాకపోకలను నిలిపివేసి.. ఆయా రాష్ట్రాల్లో తగిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి అదుపులో ఉండేది. ఏమరుపాటు వల్ల చేయి దాటిపోయింది. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరో మార్గం లేదు’ అంటున్నారు ప్రముఖ హృద్రోగ నిపుణులు, ఢిల్లీలోని ఎయిమ్స్ కార్డియాలజీ మాజీ విభాగాధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి. దేశంలో కరోనా ఉధృతికి దారి తీసిన పరిస్థితులపై మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మేళాలు.. ఎన్నికలు.. జన సమూహాలే కారణం జనవరిలో బ్రిటన్ నుంచి వచ్చిన వేరియంట్స్ దేశంలో బాగా వ్యాప్తి చెందాయి. వీటిపై జాగ్రత్త పడకపోగా మేళాలు, రాష్ట్ర స్థాయి ఎన్నికలు, స్థానిక ఎన్నికల పేరిట సుదీర్ఘ ప్రక్రియ సాగింది. వాటిలో జన సమూహాలు ఎక్కువగా భాగస్వామ్యం కావడంతో వైరస్ వ్యాప్తికి తలుపులు బార్లా తెరిచినట్టయింది. మొదటి వేవ్ తర్వాత ప్రజల్లో నిర్లక్ష్యం 2020 నవంబర్ నాటికి మొదటి వేవ్ తగ్గింది. జనవరి నాటికి జనంలో కోవిడ్ అంటే భయం పోయింది. మాస్కులు ధరించలేదు. భౌతిక దూరం పాటించలేదు. ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహించాయి. ప్రమాదం పొంచి ఉందన్న వాస్తవాన్ని గ్రహించలేకపోయాయి. యువత ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యారు మొదటి వేవ్‌లో లాక్డౌన్ ఉండటం, స్కూళ్లు, కాలేజీలు మూసివేయడం వల్ల యువకులు ఎక్కువగా బయటకు వెళ్లలేదు. ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోమ్‌కు పరిమితమయ్యారు. అందుకే మొదటి వేవ్‌లో సంభవించిన మరణాల్లో యువత లేదు. ఇప్పుడు యువతే ఎక్కువగా వైరస్‌కు ఎక్స్పోజ్ అయ్యారు. పైగా వ్యాప్తి ఉధృతంగా సాగే వేరియంట్స్ యువతను బాగా దెబ్బ కొట్టాయి. ఇద్దరు గుమికూడితే వచ్చే వైరస్ తీవ్రత కంటే పాతిక మంది గుమికూడితే ఉండే తీవ్రత ఎక్కువ. అదే ఎక్కువ నష్టం చేకూర్చింది. లాక్డౌన్ తర్వాత ఏమిటన్నదే ప్రశ్న లాక్డౌన్ విధించడం మంచిదే. కానీ లాక్డౌన్ సడలించాక పరిస్థితి ఏమిటన్నదే మన ముందున్న ప్రశ్న. లాక్డౌన్ సడలింపు తర్వాత కూడా ప్రజలు అజాగ్రత్తగా ఉంటే లాక్డౌన్ విధించి ఫలితం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజలు విధిగా జాగ్రత్తల్ని పాటించాలి. టీకా వేస్ట్ అంటే కుదరదు చాలామంది టీకా రెండు డోసులు వేసుకున్నా వైరస్ సోకింది. అలాంటప్పుడు టీకా ఎందుకు అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. టీకా వైరస్‌ను రాకుండా అడ్డుకోలేదు. వచ్చినా నియంత్రించగలదని గుర్తుంచుకోవాలి. టీకా 100 శాతం ఫలితాలను ఇస్తోంది. థర్డ్ వేవ్ గురించి ఇప్పుడే ఆలోచన అనవసరం చాలామంది థర్డ్ వేవ్‌కూడా వస్తుందంటున్నారు. ముందు మనమంతా సెకండ్ వేవ్ నుంచి ఎలా బయటపడాలనే దానిపైనే ఆలోచన చేయాలి. టీకా సామర్థ్యాన్ని పెంచాలి. వైద్యానికి అవసరమయ్యే మౌలిక వసతులు పెంచుకోవాలి. అంతేకానీ.. దీనిని పక్కన పెట్టేసి థర్డ్ వేవ్ గురించి ఆలోచించడం అనవసరం. -
మీ ఆరోగ్యానికి బీమా ఎంత..?
గడిచిన కొన్ని దశాబ్దాలుగా జనం ఆదాయాలు పెరుగుతూ వస్తున్నాయి. అలాగే వారు పెట్టే ఖర్చు కూడా పెరుగుతోంది. అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికైనా ఇది గొప్ప విజయమే. అయితే జీవిత వేగం పెరుగుతున్న కొద్దీ ఒత్తిడి పెరుగుతోంది. పని గంటలూ పెరుగుతున్నాయి. దీంతో భారతీయుల్లో జీవన సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి. వివిధ దేశీయ, అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం... భారతీయులు ప్రతి నలుగురిలో ఒకరు డయాబెటిస్, గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులతో 70 ఏళ్లలోపు మరణిస్తున్నారు. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం దేశంలో 6.2 కోట్ల మంది డయాబెటిస్తో బాధపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు 20 లక్షలు అధికం. వార్షిక ద్రవ్యోల్బణం 7 నుంచి 8 శాతం ఉంటోందనుకున్నా... ైవె ద్య ద్రవ్యోల్బణం మాత్రం 18 నుంచి 20 శాతం ఉంటోంది. కానీ వైద్య ఖర్చుల్లో బీమా ద్వారా చెల్లిస్తున్నవి కేవలం 5 శాతం. ఈ పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో ఇపుడు ఆసుపత్రిలో చేరటమంటే దాదాపు దివాలా తీసినట్టే. అందుకని చక్కని వైద్య బీమాను తీసుకోవటం అత్యుత్తమం. అయితే ఇది ఎలాంటి వైద్యపరమైన సంక్షోభంలోనైనా మనల్ని ఆదుకునేలా ఉండాలి. ఆరోగ్య రిస్క్‌ను మేనేజ్ చేయటమెలా? ఆరోగ్య సమస్యలను, జీవన విధానాన్ని విశ్లేషించటం ద్వారా ఎవరైనా రాబోయే వ్యాధుల గురించి కూడా తెలుసుకునే అవకాశముంటుంది. మీరు తీసుకునే పాలసీ.. భవిష్యత్తులో రావటానికి అవకాశమున్న వ్యాధులకూ కవరేజీ ఇచ్చేటట్లుండాలి. వివిధ బీమా కంపెనీలు మీకు, మీ కుటుంబానికి వివిధ రకాలైన ప్రత్యేక పాలసీలు, మీ అవసరాలకు తగ్గ పాలసీలు అందిస్తున్నాయి. అయితే పాలసీకి దరఖాస్తు చేసే ముందు వైద్య ద్రవ్యోల్బణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకు మీరు 30 ఏళ్ల వయసులో మీ కోసం పాలసీ తీసుకుంటున్నారనుకుందాం. సాధారణంగా మీరు 20 ఏళ్లకో, ఆ తరవాతో క్లెయిమ్ చేసే అవకాశముంటుంది. అందుకని అప్పుడు ఆసుపత్రి ఖర్చులు ఎలా ఉంటాయనేది ముందే అంచనా వేసుకోండి. కనీసం 7 శాతం ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయటం మంచిది. పాలసీ తీసుకునే ముందు... దాన్లో ఏవేవి కవర్ అవుతాయి? మీరు కూడా ఏమైనా చెల్లించాల్సి ఉంటుందా? దేనికి వర్తించదు? వంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఇవన్నీ చూశాక పాలసీ తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలేమిటంటే... మీరు పనిచేస్తున్న కంపెనీ ఆరోగ్య బీమా ఇస్తోంది కదా అని ఆ ఒక్కదానిపైనే ఆధారపడొద్దు. మీరు ఉద్యోగంలో ఉన్నంత వరకే అది ఉంటుంది. కాబట్టి మీరు సొంతగా పాలసీ తీసుకోవటం అత్యవసరం. పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా అయినా ఇది తప్పనిసరి.టాప్ అప్ ప్లాన్‌ను ఎంచుకోండి. మీకు ఎక్కువ కవరేజీ అవసరమని భావించి... దానికోసం ఎక్కువ డబ్బు పెట్టాలని లేకపోతే టాప్ అప్ తీసుకోవటం మంచిది. అనుకోనిది జరిగి మీకు అప్పటిదాకా ఉన్న కవరేజీ అయిపోయిన పక్షంలో టాప్ అప్ అనేది మీకు అదనపు కవరేజీగా పనికొస్తుంది. ఉదాహరణకు మీరు రూ.3 లక్షల పాలసీ తీసుకున్నారు. దానికి డిడక్టబుల్ పరిమితి రూ.2 లక్షలే ఉంది. మీ ఆసుపత్రి ఖర్చులు రూ.4 లక్షలయ్యాయనుకోండి. అప్పుడు రూ.5 లక్షల టాప్ అప్ తీసుకోండి. రెగ్యులర్‌గా రూ.5 లక్షల పాలసీకి అయ్యేదానికంటే దీనికి చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది. మంచి ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర బీమా తీసుకోండి. పాలసీ ప్రక్రియ, చక్కని క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డు ఉన్న కంపెనీనే నమ్మండి. క్లెయిమ్ గురించి బీమా కంపెనీకి త్వరగా తెలియజేస్తే అంత మంచిది.మీకు అప్పటికే ఏవైనా వ్యాధులుంటే... వాటికి వెయిటింగ్ పీరియడ్ సదరు బీమా కంపెనీ దగ్గర ఎంత ఉందో తెలుసుకోండి. ఎందుకంటే ముందే ఉన్న వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ తరవాతే కవరేజీ వర్తిస్తుంది. సాధారణంగా అది 2 నుంచి 4 సంవత్సరాలుంటుంది. సబ్ లిమిట్స్ గురించి ముందే తెలుసుకోవాలి. అంటే మీ పాలసీకి గనక ఒక సబ్ లిమిట్ ఉంటే బీమా కంపెనీ అంతవరకే చెల్లిస్తుందన్న మాట. క్లెయిమ్‌లో మిగిలిన మొత్తాన్ని మీరే భరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆసుపత్రి గది అద్దె సబ్ లిమిట్ 1 శాతం ఉందనుకోండి. మీ పాలసీ కవరేజీ మొత్తం రూ.5 లక్షలుంటే... గది అద్దెగా రోజుకు రూ.5,000 మాత్రమే చెల్లిస్తారు. అంతకన్నా ఎక్కువయితే మాత్రం మీరే చెల్లించాల్సి ఉంటుంది. ఆరోగ్య బీమా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది. అయితే ఎంత బీమా ఉన్నా ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం రోజూ వ్యాయామం చెయ్యటం వంటివి తప్పనిసరి. వారానికి కనీసం 5 రోజులపాటు రోజుకు 30 నిమిషాల చొప్పున నడిచినా దీర్ఘకాలంలో ఎంతో లాభం. సీఈఓ, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ -
ప్రజారోగ్యంపై అరకొర ఖర్చు
* శ్రీలంకతో పోలిస్తే మన ఖర్చు సగమే * ప్రాథమిక ఆరోగ్యంలో వెనకబడ్డ తెలుగు రాష్ట్రాలు * తప్పనిసరైతే తప్ప సిజేరియన్ చేయకూడదు * ‘సాక్షి’తో ప్రపంచ గుండెజబ్బుల నిపుణుల సమాఖ్య అధ్యక్షులు డా. శ్రీనాథ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు అరకొర ఖర్చు చేస్తున్నాయి. పక్కనే ఉన్న శ్రీ లంక ప్రజారోగ్యంపై చేసిన ఖర్చులో భారతదేశం సగం కూడా ఖర్చు చేయట్లేదు. ఇక ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ ఇప్పటికీ బలహీనంగానే ఉంది. మాతా, శిశు మరణాల నియంత్రణలో కూడా వెనకబడి ఉన్నాం. గుండెజబ్బులు, కేన్సర్, మధుమేహం లాంటి ప్రాణాంతక జబ్బులు పల్లెలను చుట్టుముట్టాయి. వీటి వల్ల గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువశాతం ఆరోగ్యానికే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలాంటి పరిణామాలపై ప్రపంచ గుండెజబ్బుల నిపుణుల సమాఖ్య అధ్యక్షుడు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు డా. కె.శ్రీనాథరెడ్డి శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. లంకలోనే నయం.. మనదేశంలో కంటే శ్రీ లంకలోనే ప్రజారోగ్యానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఆ దేశంలో ఒక్కో వ్యక్తిపై రూ.5,300కి పైగా ఖర్చు చేస్తుంటే.. భారత్‌లో సుమారు రూ.2,600 కేటాయిస్తున్నారు. ఇక చైనాలో రూ.9,900, థాయ్‌లాండ్‌లో దాదాపు రూ.15 వేలు ఖర్చు చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే మన బడ్జెట్లో రెండు రెట్లు ప్రజారోగ్యానికి పెంచాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ భారతదేశంలో చాలా బలహీనంగా ఉంది. వైద్యఖర్చుల్లో 30 శాతం ప్రభుత్వం భరిస్తోంటే, ప్రజలు 70 శాతం తమ జేబుల్లోంచి ఖర్చు చేయాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య సదుపాయాలు, పరీక్షల వ్యవస్థలు లేవు. దీనివల్ల చాలా రకాల వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించే అవకాశం కోల్పోతున్నాం. దీనివల్ల భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇక కేరళ, తమిళనాడు కంటే తెలుగు రాష్ట్రాలు ప్రాథమిక ఆరోగ్యంలో చాలా వెనకబడి ఉన్నాయి. మాతా శిశు మరణాల నియంత్రణలోనూ వెనకబడి ఉన్నాం. రోగ నిర్ధారణకు డాక్టర్లే అవసరం లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి జబ్బుల నిర్ధారణ చేసే అవకాశం ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో అది చేయలేకపోతున్నాం. దీనికి డాక్టర్లే అవసరం లేదు. దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంలే చిన్న పాటి రక్తపరీక్షలు చేసి వ్యాధుల నిర్ధారణ చేస్తున్నారు. ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడం విచారకరం. తెలుగు రాష్ట్రాల్లో ఏటా సుమారు 16 లక్షల ప్రసవాలు జరుగుతూంటే అందులే ఎక్కువ శాతం శస్త్రచికిత్స (సిజేరియన్) ద్వారానే ప్రసవాలు చేస్తున్నారు. ఇలాంటి బిడ్డలకు ఇమ్యూనిటీ(వ్యాధినిరోధక శక్తి) ఉండదు. తప్పనిసరైతే తప్ప సిజేరియన్ చేయకూడదు. ఆదాయం మీద కాకుండా తల్లులు, పిల్లల ఆరోగ్యంపై డాక్టర్లు ఆలోచించాల్సి ఉంది. ఇక రాష్ట్రంలో కేన్సర్, గుండెజబ్బులు, మధుమేహం లాంటి జబ్బులు భారీగా పెరిగాయి. ఈ జబ్బులు మధ్య వయస్కులనే మృత్యువాతకు గురిచేస్తున్నాయి. ఇలాంటి జబ్బులను గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక దశలోనే గుర్తించే వ్యవస్థ మనకు లేదు. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార కేన్సర్ (సర్వైకల్), బ్రెస్ట్ (రొమ్ము) కేన్సర్ ద్వారా చాలామంది మహిళలు చిన్నవయసులోనే మృత్యువాత పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రామీణ మహిళలే. రక్తపరీక్షలే ప్రధానం.. వ్యాధి నిర్ధారణ లేదా నివారణకు సంబంధించిన ప్రధాన అంశం రక్తపరీక్షలు. కానీ తెలుగురాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలో రక్తపరీక్షల వ్యవస్థ బలహీనంగా ఉంది. చిన్న రక్తపరీక్షలకు కూడా పెద్దాసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఈ వ్యవస్థను ఇప్పటికీ ఎందుకు బలోపేతం చేసుకోలేకపోతున్నామో అర్థం కావడం లేదు. పీహెచ్ఎఫ్ఐ (పబ్లిక్‌హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా) రూపొందించిన స్వాస్థ్య స్లేట్ (రక్తపరీక్షలు చేసే పరికరం) అవసరమే. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లో 6 జిల్లాల్లో 4 వేల పరికరాలు అందించాం. దీనికి నార్వే ప్రభుత్వం సాయం చేసింది. అక్కడ ఇది విజయవంతమైంది. 33 రకాల వైద్య పరీక్షలు 5 నిమిషాల్లో చేయవచ్చు. ఇది రెండేళ్ల క్రితమే గ్రామీణ ప్రాంతాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చాం. కానీ హైదరాబాద్‌లో ఇ-సేవ కేంద్రాల్లో పెట్టారు. అక్కడ సరిగా అమలు కాలేదు. ప్రస్తుతం చాలా దేశాలు ఈ పరికరాలను అడుగుతున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఆరోగ్య సలహాల నిపుణుల బృందంలో నాపేరు చేర్చింది. ఈ విషయంలో నేనొక్కడినే సలహాలు ఇవ్వలేను. మిగతా నిపుణులతోనూ చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రధానంగా ప్రాథమిక ఆరోగ్యం మెరుగుకోసమే నా సూచనలు, సలహాలు ఉంటాయి.