సాక్షి, అమరావతి: ‘ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగని నిర్లక్ష్యంగా ఉండకూడదు. విదేశాలతో పోలిస్తే భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి వేగం తక్కువగా ఉంది. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. కానీ, ప్రజలు అప్రమత్తంగా ఉండటం మాత్రం ముఖ్యం. వైరస్ బారిన పడకుండా ఎవరికి వారు భద్రత చర్యలు తీసుకోవాలి. అలసత్వం వద్దు’ అని ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి చెప్పారు. భారత దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ తీవ్రత ఏ విధంగా ఉంటుంది? ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలను ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సాక్షి: ఒమిక్రాన్ వ్యాప్తి ఏ విధంగా ఉంది?
డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి: విదేశాలతో పోలిస్తే భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి వేగం తక్కువగా ఉంది. విదేశాల్లో వాతావరణ పరిస్థితులు, రోగ నిరోధక శక్తి వైరస్ వ్యాప్తిపై ప్రభావం చూపుతాయి. భారత్‌తో పోలిస్తే విదేశాల్లో ప్రజల సగటు వయసు ఎక్కువ. మన దేశంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య జనాభాలో 6 శాతమే. అదే ఇటలీలో 27 శాతం, అమెరికాలో 16 శాతం. ఇలా చాలా దేశాల్లో మనకన్నా ఎక్కువగా ఉంది. దీనికి తోడు రక్తపోటు, మధుమేహం తరహా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీ) ప్రభావితులు విదేశాల్లో ఎక్కువగా ఉంటారు. అందువల్లే అక్కడ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. భారతదేశంలో వాతావరణం, రోగ నిరోధక శక్తి, ఇతరత్రా అంశాల కారణంగా ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉండదు.
సాక్షి: కరోనా నుంచి టీ లింఫోసైట్స్ రక్షణ కల్పించినట్టు గతంలో వెల్లడైంది. ఒమిక్రాన్ నుంచి టీ లింఫోసైట్స్ రక్షణ కల్పిస్తాయా?
శ్రీనాథ్‌రెడ్డి: యాంటీబాడీలు తగ్గినప్పటికీ టీ లింఫోసైట్స్ ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. యాంటీబాడీలు మూడు నుంచి ఆరు నెలల్లో తగ్గుతున్నాయి. కొందరిలో 9 నెలలు ఉంటున్నాయి. టీకాలు వేసుకున్న వారితో పోలిస్తే గతంలో కరోనా వచ్చి తగ్గిన వారిలో టీ లింఫోసైట్స్ చురుగ్గా పనిచేస్తాయి. ఇవి శరీరంలో పోలీస్‌లా వ్యవహరిస్తాయి. వైరస్‌లు, బాక్టీరియాలు దాడి చేసినప్పుడు వాటిని నియంత్రిస్తాయి.
సాక్షి: యాంటీబాడీలు త్వరగా తగ్గిపోవడానికి ఆస్కారం ఉందా?
శ్రీనాథ్‌రెడ్డి: క్యాన్సర్, ఇతర వ్యాధులకు మందులు వాడే వారు, పౌష్టికాహారం తీసుకోని వారిలో యాంటీబాడీలు త్వరగా తగ్గిపోతాయి. అందువల్లే ప్రభుత్వం 60 ఏళ్లు పైబడి, జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రికాషన్ డోసు టీకా పంపిణీ చేపట్టబోతోంది. వారందరూ ఈ టీకా వేయించుకుంటే వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు ప్రభుత్వం టీకా పంపిణీ చేయబోతోంది. అపోహలు వీడి అందరూ టీకా తీసుకోవాలి.
సాక్షి: ఒమిక్రాన్‌తో ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడతాయా?
శ్రీనాథ్‌రెడ్డి: ఢిల్లీ, మహారాష్ట్ర, సహా పలు రాష్ట్రాల్లో ఎక్కువగా ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి. అక్కడ ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. వైరస్ సోకిన వారిలో ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించడంలేదు. పెద్దగా ఆసుపత్రులపై ఒత్తిడి లేదు. విదేశాల్లో డెల్టా, ఒమిక్రాన్ కలిసిన కేసులు నమోదవుతుండటంతో అక్కడ ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోంది.
సాక్షి: ఒమిక్రాన్ నేపథ్యంలో ఎటువంటి మాస్క్‌లు ధరించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
శ్రీనాథ్ రెడ్డి: ఆస్కారం ఉన్న వాళ్లు ఎన్ 95 మాస్క్‌లు వాడితే మంచిది. లేని పక్షంలో డబుల్ లేయర్ మాస్క్‌లు సురక్షితం. గుడ్డ, సర్జికల్ మాస్క్‌లు ఏవైనా సరే డబుల్ లేయర్ ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే సంక్రాంతి నాటికి కేసుల సంఖ్య పెరుగుతుంది.
భయం వద్దు.. భద్రత వీడొద్దు
Published Sat, Jan 1 2022 4:46 AM | Last Updated on Sat, Jan 1 2022 2:27 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment