ప్రజారోగ్యంపై అరకొర ఖర్చు
* శ్రీలంకతో పోలిస్తే మన ఖర్చు సగమే
* ప్రాథమిక ఆరోగ్యంలో వెనకబడ్డ తెలుగు రాష్ట్రాలు
* తప్పనిసరైతే తప్ప సిజేరియన్ చేయకూడదు
* ‘సాక్షి’తో ప్రపంచ గుండెజబ్బుల నిపుణుల సమాఖ్య అధ్యక్షులు డా. శ్రీనాథ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు అరకొర ఖర్చు చేస్తున్నాయి. పక్కనే ఉన్న శ్రీ లంక ప్రజారోగ్యంపై చేసిన ఖర్చులో భారతదేశం సగం కూడా ఖర్చు చేయట్లేదు. ఇక ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ ఇప్పటికీ బలహీనంగానే ఉంది. మాతా, శిశు మరణాల నియంత్రణలో కూడా వెనకబడి ఉన్నాం. గుండెజబ్బులు, కేన్సర్, మధుమేహం లాంటి ప్రాణాంతక జబ్బులు పల్లెలను చుట్టుముట్టాయి. వీటి వల్ల గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువశాతం ఆరోగ్యానికే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలాంటి పరిణామాలపై ప్రపంచ గుండెజబ్బుల నిపుణుల సమాఖ్య అధ్యక్షుడు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు డా. కె.శ్రీనాథరెడ్డి శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే..
లంకలోనే నయం..
మనదేశంలో కంటే శ్రీ లంకలోనే ప్రజారోగ్యానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఆ దేశంలో ఒక్కో వ్యక్తిపై రూ.5,300కి పైగా ఖర్చు చేస్తుంటే.. భారత్‌లో సుమారు రూ.2,600 కేటాయిస్తున్నారు. ఇక చైనాలో రూ.9,900, థాయ్‌లాండ్‌లో దాదాపు రూ.15 వేలు ఖర్చు చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే మన బడ్జెట్‌లో రెండు రెట్లు ప్రజారోగ్యానికి పెంచాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ భారతదేశంలో చాలా బలహీనంగా ఉంది.
వైద్యఖర్చుల్లో 30 శాతం ప్రభుత్వం భరిస్తోంటే, ప్రజలు 70 శాతం తమ జేబుల్లోంచి ఖర్చు చేయాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య సదుపాయాలు, పరీక్షల వ్యవస్థలు లేవు. దీనివల్ల చాలా రకాల వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించే అవకాశం కోల్పోతున్నాం. దీనివల్ల భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇక కేరళ, తమిళనాడు కంటే తెలుగు రాష్ట్రాలు ప్రాథమిక ఆరోగ్యంలో చాలా వెనకబడి ఉన్నాయి. మాతా శిశు మరణాల నియంత్రణలోనూ వెనకబడి ఉన్నాం.
రోగ నిర్ధారణకు డాక్టర్లే అవసరం లేదు
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి జబ్బుల నిర్ధారణ చేసే అవకాశం ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో అది చేయలేకపోతున్నాం. దీనికి డాక్టర్లే అవసరం లేదు. దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, ఏఎన్‌ఎంలే చిన్న పాటి రక్తపరీక్షలు చేసి వ్యాధుల నిర్ధారణ చేస్తున్నారు. ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడం విచారకరం. తెలుగు రాష్ట్రాల్లో ఏటా సుమారు 16 లక్షల ప్రసవాలు జరుగుతూంటే అందులే ఎక్కువ శాతం శస్త్రచికిత్స (సిజేరియన్) ద్వారానే ప్రసవాలు చేస్తున్నారు. ఇలాంటి బిడ్డలకు ఇమ్యూనిటీ(వ్యాధినిరోధక శక్తి) ఉండదు. తప్పనిసరైతే తప్ప సిజేరియన్ చేయకూడదు.
ఆదాయం మీద కాకుండా తల్లులు, పిల్లల ఆరోగ్యంపై డాక్టర్లు ఆలోచించాల్సి ఉంది. ఇక రాష్ట్రంలో కేన్సర్, గుండెజబ్బులు, మధుమేహం లాంటి జబ్బులు భారీగా పెరిగాయి. ఈ జబ్బులు మధ్య వయస్కులనే మృత్యువాతకు గురిచేస్తున్నాయి. ఇలాంటి జబ్బులను గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక దశలోనే గుర్తించే వ్యవస్థ మనకు లేదు. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార కేన్సర్ (సర్వైకల్), బ్రెస్ట్ (రొమ్ము) కేన్సర్ ద్వారా చాలామంది మహిళలు చిన్నవయసులోనే మృత్యువాత పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రామీణ మహిళలే.
రక్తపరీక్షలే ప్రధానం..
వ్యాధి నిర్ధారణ లేదా నివారణకు సంబంధించిన ప్రధాన అంశం రక్తపరీక్షలు. కానీ తెలుగురాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలో రక్తపరీక్షల వ్యవస్థ బలహీనంగా ఉంది. చిన్న రక్తపరీక్షలకు కూడా పెద్దాసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఈ వ్యవస్థను ఇప్పటికీ ఎందుకు బలోపేతం చేసుకోలేకపోతున్నామో అర్థం కావడం లేదు. పీహెచ్‌ఎఫ్‌ఐ (పబ్లిక్‌హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా) రూపొందించిన స్వాస్థ్య స్లేట్ (రక్తపరీక్షలు చేసే పరికరం) అవసరమే. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో 6 జిల్లాల్లో 4 వేల పరికరాలు అందించాం. దీనికి నార్వే ప్రభుత్వం సాయం చేసింది. అక్కడ ఇది విజయవంతమైంది.
33 రకాల వైద్య పరీక్షలు 5 నిమిషాల్లో చేయవచ్చు. ఇది రెండేళ్ల క్రితమే గ్రామీణ ప్రాంతాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చాం. కానీ హైదరాబాద్‌లో ఇ-సేవ కేంద్రాల్లో పెట్టారు. అక్కడ సరిగా అమలు కాలేదు. ప్రస్తుతం చాలా దేశాలు ఈ పరికరాలను అడుగుతున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఆరోగ్య సలహాల నిపుణుల బృందంలో నాపేరు చేర్చింది. ఈ విషయంలో నేనొక్కడినే సలహాలు ఇవ్వలేను. మిగతా నిపుణులతోనూ చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రధానంగా ప్రాథమిక ఆరోగ్యం మెరుగుకోసమే నా సూచనలు, సలహాలు ఉంటాయి.