
సాక్షి, అమరావతి: అమెరికా, ఐరోపాలో మాదిరిగా శరవేగంగా కాకున్నా భారత్‌లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. లాక్‌డౌన్ అమలులోనే ఉన్నప్పటికి మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఢిల్లీ యాత్రికుల రాకతో రాష్ట్రంలోనూ ఈ మహమ్మారి కోరలు సాచింది. ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రజారోగ్య సలహాదారు, ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి డాక్టర్ కె.శ్రీనాథరెడ్డి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రానున్న మూడు వారాలు అత్యంత కీలకమని, ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉందని సూచించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
భౌతిక దూరమే శరణ్యం
కరోనాకు మందులు లేవు. కేవలం భౌతిక దూరం పాటించడమే మార్గం. పాజిటివ్‌గా తేలితే నిర్బంధంలో ఉంచడం మినహా చేసేదేమీ లేదు. వారినుంచి ఇతరులకు సోకకుండా కాపాడుకోవాలి.
అందుకు ఆధారాలు లేవు
కరోనా మ్యుటేషన్ (రూపాంతరం) చెంది భారత్‌లో బలహీనపడిందనేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు. ఒకవేళ బలహీనపడినా ఆధారాలు లేకుండా నిర్ధారించలేం. నిజంగా బలహీనపడితే దేశంలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? దేశంలో మొన్నటివరకూ కరోనా కేసులు వారం రోజులకు రెట్టి్టంపు అయ్యేవి. అది ఇప్పుడు 5 రోజులకు పడిపోయింది. డబ్లింగ్ అంటే నమోదైన కేసులు రెట్టింపు అయ్యే సమయం. యూరప్ దేశాల్లో ఇది రెండు రోజులకే అవుతోంది. మన దేశంలోనూ రెట్టింపు అవుతున్న వ్యవధి నెమ్మదిగా పడిపోతోంది. ఇది పడిపోకుండా చూడాలి. ఈ రేటు పడిపోవడం ప్రమాదకర సంకేతం.
జాగ్రత్తగా లేకుంటే ..
ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా వంటి సంపన్న దేశాలు కరోనా దెబ్బకు అల్లాడుతున్నాయి. డబ్బుతోపాటు వైద్యపరంగా మనకంటే ఎన్నో రెట్లు ముందున్న దేశాలే వైద్యులు, వెంటిలేటర్లు, ఆస్పత్రులు, పడకల కొరతతో విలవిలలాడుతున్నాయి. వాటి పరిస్థితి చూసైనా జాగ్రత్తగా ఉండకుంటే మూల్యం చెల్లించక తప్పదు. కరోనా లక్షణాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించి స్క్రీనింగ్ నిర్వహిస్తే కొంతవరకు నియంత్రించవచ్చు.
నిర్ధారణ సామర్థ్యం పెరగాలి
దేశంలో కరోనా పరీక్షల సామర్థ్యం పెరగాలి. వైరాలజీ ల్యాబ్‌లను ఒక్కరోజులో పెంచలేం గానీ పరిస్థితిని బట్టి ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు ఎక్కువ మందిని టెస్ట్ చేసి క్వారంటైన్‌లో ఉంచగలిగితే ఫలితాలు బాగుంటాయి. లాక్‌డౌన్ అమల్లో ఉన్నందు వల్లే వైరస్ నియంత్రణలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు సహకరించాలి.
ఐసీయూలను పెంచుకోవాలి
ప్రస్తుతం మనకున్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఏ మాత్రం సరిపోవు. వీటిని పెంచాలి. 50 ఏళ్ల పైబడిన వారికి వైరస్ సోకినప్పుడు ఐసీయూల అవసరం చాలా ఉంటుంది.
ప్రభుత్వాస్పత్రులు బలోపేతం కావాలి
రకరకాల వైరస్‌లు, బాక్టీరియాల పోకడను అంచనా వేసి ప్రభుత్వ ఆస్పత్రుల వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. పరిశోధనలు ఎక్కువగా జరగాలి. ప్రజారోగ్యంపై దృష్టి సారించాలి. రానున్న 3 వారాలు ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలి. మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు సమాజాన్ని రక్షించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment