సాక్షి, అమరావతి: ‘కరోనా కేసులు తగ్గినంత మాత్రాన వైరస్ పూర్తిగా పోయినట్లు కాదు. ఇప్పటికీ యూరప్ దేశాలను ఈ వైరస్ వణికిస్తోంది. పోయినట్లే పోయి వివిధ రూపాలను మార్చుకుని తిరిగి విస్తరిస్తోంది. దక్షిణ కొరియాలో అయితే పూర్తిగా వైరస్ పోయిందనుకున్నారు. కానీ, మళ్లీ కేసులు రావడంతో అక్కడ భయాందోళన మొదలైంది. ఇక బ్రిటన్, అమెరికా పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇక మనదేశంలోనూ చాలా జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు. కేసులు తగ్గడం మంచి పరిణామమే. కానీ, దీన్ని పూర్తిగా నిర్మూలించే వరకూ మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే’.. అంటున్నారు ప్రముఖ హృద్రోగ నిపుణులు, ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ మాజీ విభాగాధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డా.కె. శ్రీనాథ్‌రెడ్డి. ఆయన శనివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
వ్యాక్సిన్‌తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది
లక్షలోనో, కోటిలోనో ఒకరికి ఏదైనా దు్రష్పభావం కలిగినంత మాత్రాన వ్యాక్సిన్‌ను తప్పపట్టలేం. వ్యాక్సిన్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగితే వైరస్ ప్రభావం శరీరంపై అంత పెద్దస్థాయిలో చూపించలేదు.
వ్యాక్సినేషనే మనముందున్న లక్ష్యం
ఇప్పటికీ మనం ప్రమాదంలోనే ఉన్నాం. ఏ మాత్రం అలక్ష్యం చేసినా మూల్యం చెల్లించుకుంటాం. ఈ వైరస్‌ను నమ్మడానికిలేదు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ రూపంలో వస్తుందో అంతుచిక్కడంలేదు. ప్రస్తుతం అంతటా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. వీలైనంత వరకూ అందరికీ వ్యాక్సిన్ వేయడమే మనముందున్న ప్రస్తుత లక్ష్యం. అందుకే ప్రాధాన్యతల వారీగా వేస్తున్నారు. దీనివల్ల నష్టాన్ని భారీగా తగ్గించుకునే అవకాశముంది. కానీ, వ్యాక్సిన్ ఉత్పత్తిని బట్టి మన ప్రభుత్వం ఎవరికి ముందు వేయాలో వారికి వేస్తోంది. వ్యాక్సిన్ విధిగా వేయించుకోవడం మంచిది. అలాగే, యాభై ఏళ్లు దాటిన వారు, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బాగా ఉన్నారు. వీళ్లు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసమ్మర్థం ఉండే ప్రాంతాలకు వెళ్లకూడదు. వైరస్ సోకితే ఇలాంటి వాళ్లలో ప్రాణనష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. మరికొన్ని నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే.
జనసమూహాల్లోకి వెళ్లకూడదు
ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, అన్నింటికీ మించి జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండటం చేయాలి. కేసులు తగ్గాయి కదా అని విచ్చలవిడిగా ప్రజలు గుమికూడితే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీనివల్ల నష్టం కొనితెచ్చుకున్నట్లవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment