సాక్షి, అమరావతి: ‘కరోనా వైరస్ పూర్తిగా అంతరించిపోతుంది.. భవిష్యత్‌లో ఇక ఎప్పటికీ మనకు రాదు అని ఆలోచించడం తప్పు. అలా ఆలోచిస్తే భ్రమలో ఉన్నట్లే’నని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితులు, ఉధృతి ఎలా ఉంది తదితర అంశాలను ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
మూడో దశ తగ్గుముఖం
కరోనా వైరస్ మూడో దశ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. తీవ్రమైన వ్యాధి లక్షణాలు కలిగి, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఆధారంగా వైరస్ ఉధృతిని పరిగణిస్తాం. ప్రస్తుతం వైరస్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య, పాజిటివ్ కేసుల నమోదు తగ్గుతున్నాయి. రెండో దశతో పోలిస్తే మూడో దశలో నష్టం చాలా తక్కువగా ఉంది.
ఎండమిక్‌గా భావించలేం
వైరస్ స్థిరంగా ఉండి బలహీనంగా మారితే ఎండమిక్ అవుతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ స్థిరంగాలేదు. కొత్తకొత్త వేరియంట్లు వస్తున్నాయి. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌లో వైరస్ బలహీనపడింది. ఒకవేళ కొత్త వేరియంట్‌లు వస్తే.. వాటిల్లోనూ వైరస్ బలహీనంగా ఉంటే ఎండమిక్‌గా భావించవచ్చు.
పోస్ట్ కోవిడ్ సమస్యలు తక్కువే
ఒమిక్రాన్ వేరియంట్‌కు శరీరంలోకి తీవ్రంగా చొచ్చుకుపోయే తత్వంలేదు. దీంతో ఊపిరితిత్తులు, రక్తంలోకి వైరస్ ప్రవేశించలేదు. దీంతో ఈ వేరియంట్ సోకిన వారిలో పోస్ట్ కోవిడ్ సమస్యలు చాలా తక్కువ. అయినా, ఒమిక్రాన్ సోకిన వారిలో పోస్ట్ కోవిడ్ సమస్యలపై అధ్యయనాలు చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, ఐసీఎంఆర్‌లు అధ్యయనం చేస్తున్నాయి. అదే విధంగా పెద్ద నగరాల్లో పలు ప్రైవేట్ ఆసుపత్రులు అధ్యయనాలు కొనసాగిస్తున్నాయి.
హెర్డ్ ఇమ్యూనిటీ లేదు
హెర్డ్ ఇమ్యూనిటీ ఇంకా రాలేదు. వ్యాక్సిన్ వేసుకున్న వారు, గతంలో వైరస్ సోకిన వారూ ఒమిక్రాన్ బారిన పడ్డారు. దీన్నిబట్టి చూస్తే హెర్డ్ ఇమ్యూనిటీ ఇంకా రాలేదని చెప్పొచ్చు. వ్యాక్సిన్ వేసుకోవడం, గతంలో ఇన్ఫెక్షన్ బారిన పడటంవల్ల వచ్చిన ఇమ్యూనిటీతో తీవ్రమైన వ్యాధి బారిన పడకుండా మాత్రమే రక్షణ కలుగుతోంది. శ్వాసకోశ (రెస్పిరేటరీ) వైరస్‌ల తరహాలోనే కరోనా వైరస్ సోకకుండా ఇమ్యూనిటీ అనేది సాధ్యంకాదు. నేటికీ ఫ్లూ బారిన పడకుండా విదేశాల్లోని ప్రజలకు వ్యాక్సిన్లు పంపిణీ చేస్తుంటారు. ఇదే తరహాలో వైరస్ నుంచి రక్షణ పొందడానికి తక్కువ రోగనిరోధక శక్తి ఉండే వృద్ధులు, కోమార్బిడిటీస్‌తో బాధపడే వారు ఇమ్యూనిటీ తగ్గకుండా వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది.
ఏపీ చర్యలు భేష్
కరోనా వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. ముందస్తు సన్నద్ధత సత్ఫలితాలిస్తోంది. టీనేజర్లకు 100 శాతం వ్యాక్సినేషన్‌ను వేగంగా పూర్తిచేశారు. అలాగే, పెద్దలకు వ్యాక్సిన్ పంపిణీలోను, ప్రభావవంతంగా వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవడంలోనూ ప్రభుత్వం సఫలీకృతం అయింది. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సాంకేతిక కమిటీ పనితీరు ప్రశంసనీయం.
Comments
Please login to add a commentAdd a comment