సచివాలయాలు భేష్‌ | IIPA Team Praises On Village Secretariats And Rythu Bharosa Centres | Sakshi
Sakshi News home page

సచివాలయాలు భేష్‌

Published Fri, Nov 18 2022 3:47 AM | Last Updated on Fri, Nov 18 2022 3:47 AM

IIPA Team Praises On Village Secretariats And Rythu Bharosa Centres - Sakshi

విశాఖ జిల్లా టి.నగరపాలెం సచివాలయ సిబ్బందితో కేంద్ర బృందం

తగరపువలస (భీమిలి): రాష్ట్రంలో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్ల పనితీరు బాగుందని న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్టేషన్‌ (ఐఐపీఏ) బృందం కితాబిచ్చింది. అడ్వాన్స్‌డ్‌ ప్రొఫెషనల్‌ ప్రోగ్రాం ఇన్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఏపీపీపీఏ) 48వ విజిట్‌లో భాగంగా 38 మంది సభ్యులున్న ఈ బృందం గురువారం విశాఖ జిల్లా భీమిలి మండలంలో పర్యటించింది. రెండురోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు వీరు రెండు బృందాలుగా విడిపోయి టి.నగరపాలెం, దాకమర్రి పంచాయతీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలు, అధికారులతో మాట్లాడారు.

ఏడు కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, మిషన్‌ అంత్యోదయ, పీఎంఏవై, ఎస్‌బీఎం, ఎన్‌ఆర్‌ఐఐఎం, ఎస్‌ఎస్‌ఏ అమలు తీరుపై లబ్ధిదారులతో విడివిడిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఆరా తీశారు. స్థానిక పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల ఆరోగ్యం గురించి వారితో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. పుస్తకాలు, యూనిఫాం పరిశీలించారు. గణితంలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు.  

ఫ్యామిలీ ఫిజీషియన్‌ మంచి ఆలోచన 
గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల కార్యదర్శులను పిలిచి వారి బాధ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్ల పనితీరు బాగుందన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ మంచి ఆలోచనని చెప్పారు. రెండు వారాలకు ఒకసారి ఫ్యామిలీ ఫిజీషియన్‌ సందర్శించడం బాగుందన్నారు.

సామాజిక పింఛన్లు డీఎం అండ్‌ హెచ్‌వో పెన్షన్ల పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేశారు. పీఎంవై హౌసింగ్‌ పథకాన్ని లబ్ధిదారులు వినియోగించుకుంటున్నారని తెలిపారు. కోవిడ్‌ సమయంలో పంచాయతీల వారీగా మృతులు, వ్యాక్సినేషన్, తీసుకున్న జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీల్లో అమలవుతున్న ఆహారం, పౌష్టికాహార కిట్ల గురించి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ ఇంకా మెరుగుపడాలని పేర్కొన్నారు. 

బృందంలో అధికారులు, త్రివిధదళాల ఉద్యోగులు
బృందంలో కేంద్రంలోని వివిధ శాఖల అధికారులు, త్రివిధదళాల ఉద్యోగులు ఉన్నారు. ఆర్డీవో ఎస్‌.భాస్కరరెడ్డి, భీమిలి ఎంపీపీ దంతులూరి వెంకటశివసూర్యనారాయణరాజు, తహసీల్దార్‌ కోరాడ వేణుగోపాల్, ఎంపీడీవో ఎం.వెంకటరమణ, డీఆర్‌డీఏ పీడీ శోభారాణి, సర్పంచ్‌లు పొట్నూరు ఛాయాగౌతమి, చెల్లూరు పైడప్పడు, ఎంపీటీసీ సభ్యులు పల్లా నీలిమ, చెల్లూరు నగేష్, పీహెచ్‌సీ వైద్యుడు ఎ.బి.మల్లికార్జునరావు, కార్యదర్శులు రఘునాథరావు, శంకర్‌ జగన్నాథ్, లోకేశ్వరి, తెలుగు అనువాదకుడు టి.ఎస్‌.వి.ప్రసాదరావు ఈ బృందానికి, ప్రజలకు సంధానకర్తలుగా వ్యవహరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement