IIPA
-
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఏపీ ముందంజ
సాక్షి, విశాఖపట్నం: మిగిలిన రాష్ట్రాలతో పోల్చిచూస్తే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) డైరెక్టర్ జనరల్ సురేంద్రనాథ్ త్రిపాఠి స్పష్టం చేశారు. అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఏపీపీపీఏ) 48వ విజిట్‌లో భాగంగా 38 మంది సభ్యుల ఐఐపీఏ బృందం రెండో రోజు విశాఖలో పర్యటించింది. ఇందులో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు, సంబంధిత శాఖల అధికారులతో సురేంద్రనాథ్ త్రిపాఠి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను అందరి కంటే ఎక్కువగా ఏపీ సద్వినియోగం చేసుకుంటున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ, గ్రామ, వార్డు వలంటీర్లు ద్వారా గ్రామస్థాయిలో పనితీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. రైతుభరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల సేవలు సరికొత్త సేవా విప్లవానికి నాంది పలికినట్లుగా ఉన్నాయన్నారు. స్వయం సహాయక బృందాలు, అంగన్వాడీ వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. డీబీటీ ద్వారా ప్రజలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చడం వల్ల.. ఏపీ ప్రజల జీవన స్థితిగతులు, ప్రమాణాలు మెరుగుపడేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయని తమ క్షేత్ర స్థాయి పర్యటనలో వెల్లడైందని డీజీ త్రిపాఠి వివరించారు. స్వచ్ఛత విషయంలో విశాఖ నగరం ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రోగ్రామ్ డైరెక్టర్ డా.వీఎన్ అలోక్, ఐఐపీఏ అడిషనల్ డైరెక్టర్ కుసుమ్లతతో పాటు త్రివిధ దళ ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: సకల వసతులు: రూ.3,364 కోట్లతో సంక్షేమ హాస్టళ్ల ఆధునీకరణ -
సచివాలయాలు భేష్
తగరపువలస (భీమిలి): రాష్ట్రంలో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల పనితీరు బాగుందని న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్టేషన్ (ఐఐపీఏ) బృందం కితాబిచ్చింది. అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఏపీపీపీఏ) 48వ విజిట్‌లో భాగంగా 38 మంది సభ్యులున్న ఈ బృందం గురువారం విశాఖ జిల్లా భీమిలి మండలంలో పర్యటించింది. రెండురోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు వీరు రెండు బృందాలుగా విడిపోయి టి.నగరపాలెం, దాకమర్రి పంచాయతీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలు, అధికారులతో మాట్లాడారు. ఏడు కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఎంజీఎన్ఆర్ఈజీఏ, ఎన్ఆర్ఎల్ఎం, మిషన్ అంత్యోదయ, పీఎంఏవై, ఎస్బీఎం, ఎన్‌ఆర్‌ఐఐఎం, ఎస్ఎస్ఏ అమలు తీరుపై లబ్ధిదారులతో విడివిడిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఆరా తీశారు. స్థానిక పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల ఆరోగ్యం గురించి వారితో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. పుస్తకాలు, యూనిఫాం పరిశీలించారు. గణితంలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. ఫ్యామిలీ ఫిజీషియన్ మంచి ఆలోచన గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల కార్యదర్శులను పిలిచి వారి బాధ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల పనితీరు బాగుందన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ మంచి ఆలోచనని చెప్పారు. రెండు వారాలకు ఒకసారి ఫ్యామిలీ ఫిజీషియన్ సందర్శించడం బాగుందన్నారు. సామాజిక పింఛన్లు డీఎం అండ్ హెచ్‌వో పెన్షన్ల పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేశారు. పీఎంవై హౌసింగ్ పథకాన్ని లబ్ధిదారులు వినియోగించుకుంటున్నారని తెలిపారు. కోవిడ్ సమయంలో పంచాయతీల వారీగా మృతులు, వ్యాక్సినేషన్, తీసుకున్న జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీల్లో అమలవుతున్న ఆహారం, పౌష్టికాహార కిట్ల గురించి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ ఇంకా మెరుగుపడాలని పేర్కొన్నారు. బృందంలో అధికారులు, త్రివిధదళాల ఉద్యోగులు బృందంలో కేంద్రంలోని వివిధ శాఖల అధికారులు, త్రివిధదళాల ఉద్యోగులు ఉన్నారు. ఆర్డీవో ఎస్.భాస్కరరెడ్డి, భీమిలి ఎంపీపీ దంతులూరి వెంకటశివసూర్యనారాయణరాజు, తహసీల్దార్ కోరాడ వేణుగోపాల్, ఎంపీడీవో ఎం.వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ శోభారాణి, సర్పంచ్‌లు పొట్నూరు ఛాయాగౌతమి, చెల్లూరు పైడప్పడు, ఎంపీటీసీ సభ్యులు పల్లా నీలిమ, చెల్లూరు నగేష్, పీహెచ్సీ వైద్యుడు ఎ.బి.మల్లికార్జునరావు, కార్యదర్శులు రఘునాథరావు, శంకర్ జగన్నాథ్, లోకేశ్వరి, తెలుగు అనువాదకుడు టి.ఎస్.వి.ప్రసాదరావు ఈ బృందానికి, ప్రజలకు సంధానకర్తలుగా వ్యవహరించారు. -
కాలుష్యంతో మానవాళికి ముప్పు
సాక్షి, విశాఖపట్నం: పెరుగుతున్న కాలుష్యం మొత్తం మానవాళిని నాశనం చేస్తోందనీ.. దానిపై యుద్ధం చెయ్యాల్సిన తరుణం ఆసన్నమైందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపొందించేందుకు నడుం బిగించాలని ఆయన పిలుపు ఇచ్చారు. విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించిన భారత పెట్రోలియం, ఎనర్జీ సంస్థ(ఐఐపీఏ) నాలుగో వ్యవస్థాపక దినోత్సవంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రపంచం ముందున్న ఏకైక లక్ష్యం కాలుష్యమని వ్యాఖ్యానించారు. ఎనర్జీ రంగంలో వస్తున్న మార్పులు, పరిణామాల్ని అధ్యయనం చేసి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం సహాయంతో యువ శాస్త్రవేత్తల్ని తయారు చెయ్యగలమని ఆయన ఆకాంక్షించారు. ఐఐపీఏ న్యూస్ లెటర్ని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అంతకుముందు ఏయూ ఆవరణలో గవర్నర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, ఐఐపీఏ డైరెక్టర్ ప్రొ.వీఎస్ఆర్కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా అమరవీరుల సంస్మరణార్థం సాగరతీరంలో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో గవర్నర్, మంత్రి ముత్తంశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
మేయర్‌ను కలిసిన ఐఐపీఏ ప్రతినిధులు
సాక్షి, సిటీబ్యూరో: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్(ఐఐపీఏ, న్యూఢిల్లీ) ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ సుజిత్‌కుమార్ ప్రుసేథ్ నేతృత్వంలోని 9 మంది ప్రతినిధుల బృందం బుధవారం మేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కుమార్‌లను కలిసింది. జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న రూ. 5కే భోజనం, పేదబస్తీ ప్రజలకు శుద్ధజ లం, ఆస్తిపన్ను, డిజిట ల్ బర్త్ సర్టిఫికెట్లు, జీవవైవిధ్య విభాగం పనులు తదితర అంశాల గురించి వీరు మేయర్, డిప్యూటీ మేయర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల గురించి పూర్తి వివరాలందజేయాలని , తాము కూడా ఆయా ప్రాంతాల్లో వీటిని అమలు చేస్తామని ప్రతినిధులు కోరారు. వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రాథమ్యాల కనుగుణంగా పనులను పూర్తిచేయవచ్చునని ప్రతినిధుల బృందం అభిప్రాయపడింది. ఇక్కడి పనితీరు చాలా బాగుందని కితాబిచ్చింది.