
సాక్షి, విశాఖపట్నం: మిగిలిన రాష్ట్రాలతో పోల్చిచూస్తే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ముందు వరసలో ఉందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) డైరెక్టర్ జనరల్ సురేంద్రనాథ్ త్రిపాఠి స్పష్టం చేశారు. అడ్వాన్స్‌డ్ ప్రొఫెషనల్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఏపీపీపీఏ) 48వ విజిట్‌లో భాగంగా 38 మంది సభ్యుల ఐఐపీఏ బృందం రెండో రోజు విశాఖలో పర్యటించింది. ఇందులో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు, సంబంధిత శాఖల అధికారులతో సురేంద్రనాథ్ త్రిపాఠి శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను అందరి కంటే ఎక్కువగా ఏపీ సద్వినియోగం చేసుకుంటున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ, గ్రామ, వార్డు వలంటీర్లు ద్వారా గ్రామస్థాయిలో పనితీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. రైతుభరోసా కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్ల సేవలు సరికొత్త సేవా విప్లవానికి నాంది పలికినట్లుగా ఉన్నాయన్నారు. స్వయం సహాయక బృందాలు, అంగన్‌వాడీ వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. డీబీటీ ద్వారా ప్రజలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చడం వల్ల.. ఏపీ ప్రజల జీవన స్థితిగతులు, ప్రమాణాలు మెరుగుపడేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయని తమ క్షేత్ర స్థాయి పర్యటనలో వెల్లడైందని డీజీ త్రిపాఠి వివరించారు. స్వచ్ఛత విషయంలో విశాఖ నగరం ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రోగ్రామ్ డైరెక్టర్ డా.వీఎన్ అలోక్, ఐఐపీఏ అడిషనల్ డైరెక్టర్ కుసుమ్‌లతతో పాటు త్రివిధ దళ ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సకల వసతులు: రూ.3,364 కోట్లతో సంక్షేమ హాస్టళ్ల ఆధునీకరణ
Comments
Please login to add a commentAdd a comment