రైతులతో మాట్లాడుతున్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్, సభ్యులు
సాక్షి, అమరావతి/గన్నవరం: సీఎం వైఎస్ జగన్ దూరదృష్టితో ఏర్పాటు చేసిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్ ప్రశంసించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల ఏర్పాటు వినూత్న ఆలోచన అని అభినందించారు. గత రెండున్నరేళ్లుగా ఏపీ ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు గ్రామసీమల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం ఆయన కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో గ్రామ సచివాలయం, ఆర్బీకేని సందర్శించి వాటి ద్వారా అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించారు.
తిరిగే తిప్పలు లేకుండా అన్ని సేవలు..
పౌర సేవలను ప్రజల చెంతకు చేర్చడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించిందని, ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిందని కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యంతో సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు ఏర్పాటయ్యాయన్నారు. రాష్ట్రంలో 15 వేలకు పైగా గ్రామ సచివాలయాలు, 10,778 ఆర్బీకేలు సేవలందిస్తున్నాయని తెలిపారు. గతంలో ప్రజలు సమస్యల పరిష్కారం కోసం మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లేవారని, ఇప్పుడు వారి గ్రామాల్లోనే సచివాలయాల ద్వారా అన్ని సేవలు అందుతున్నాయన్నారు. వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవస్థలు తొలగిపోయి వేగంగా పనులు జరుగుతున్నట్లు పలువురు నీతి ఆయోగ్ బృందానికి తెలియచేశారు. అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలను నిర్ణీత గడువులోగా ఇస్తున్నారని, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తేవడం బాగుందని చెప్పారు.
మహిళా సంఘాల భాగస్వామ్యం అభినందనీయం
ప్రకృతిసాగులో మహిళా సంఘాల భాగస్వామ్యం అభినందనీయమని రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులు సాగు చేస్తున్న పెరటి తోటల క్షేత్రాన్ని నీతి అయోగ్ బృందం సందర్శించింది. తనకున్న ఐదు సెంట్ల స్థలంలో పసుపుతో పాటు 18 రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నానని, ఇంట్లో వినియోగం, ఖర్చులు పోనూ మిగిలిన వాటిని విక్రయించి నెలకు రూ.1,000 సంపాదిస్తున్నానని పొదుపు సంఘం మహిళ జన్యావుల ధనలక్ష్మి తెలిపింది. కార్యక్రమంలో నీతి ఆయోగ్ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ కె.రాజేశ్వరరావు, సీనియర్ సలహాదారులు డాక్టర్ నీలం పటేల్, సీహెచ్‌పీ శరత్‌రెడ్డి, అవినాష్‌మిశ్రాతో పాటు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయకుమార్, రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్బీకేల పనితీరు చాలా బాగుంది
ఆర్బీకేల వ్యవస్థ చాలా బాగుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్ చెప్పారు. డిజిటల్ లైబ్రరీ, స్మార్ట్ టీవీ, కియోస్క్, ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ కిట్‌లతో పాటు రైతుల కోసం అందుబాటులో ఉంచిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఆయన పరిశీలించారు. ఆర్బీకేల ద్వారా ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సొంతూరిలోనే రైతులకు అందించడం, ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ–క్రాప్ నమోదు, వైఎస్సార్ రైతు భరోసా, పంటల బీమా, సున్నా వడ్డీకే పంట రుణాలు, బ్యాంకింగ్ సేవలు ఇలా ఆర్బీకేల ద్వారా అంది స్తోన్న సేవలన్నీ బాగున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment