2025 నాటికి 7 కోట్ల మందికి షుగర్
* 21 కోట్ల మందికి హై-బీపీ
* ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన
సాక్షి, హైదరాబాద్: దేశంలో 30 నుంచి 59 ఏళ్ల మధ్య వయసులో చనిపోతున్న వారిలో 53 శాతం మంది దీర్ఘకాలిక వ్యాధులతోనే మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఆందోళన వ్యక్తంచేశాయి. అందులో హృదయ సంబంధ వ్యాధులతో చనిపోతున్న వారు 29 శాతం ఉన్నారంది. ‘భారత్‌లో దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, నిర్మూలన’పై కేంద్ర ఆరోగ్యశాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఇటీవల ఢిల్లీలో కీలక సదస్సు నిర్వహించాయి.
ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ, నిమ్స్ నెఫ్రాలజిస్ట్ టి.గంగాధర్ పాల్గొన్నారు.దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, నిర్మూలనకు సంబంధించి మార్గదర్శకాలపై సదస్సులో నివేదిక విడుదల చేశారు. మధుమేహ (షుగర్) వ్యాధి ద్వారానే దీర్ఘకాలిక వ్యాధులు మరింత ప్రబలుతున్నాయని ఆ నివేదిక స్పష్టంచేసింది. 2025 నాటికి దేశంలో 21.30 కోట్ల మంది హై-బీపీ, సుమారు 7కోట్ల మంది షుగర్ రోగులు ఉంటారని తెలిపింది.
షుగర్, హై-బీపీ, గుండె పోట్ల కారణంగా విదేశాలతో పోలిస్తే దేశంలో ఐదు పదేళ్ల ముందే చనిపోతున్నారంది. చిన్న వయసులో షుగర్, గుండెపోటు రావడానికి ప్రధాన కారణం తాజా పండ్లు, కూరగాయలు తీసుకోకపోవడం, ఆహారపుటలవాట్లు, పొగ తాగడమేనని తేల్చింది.
గ్రామస్థాయి వరకు వెల్‌నెస్ కేంద్రాలు...
ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా మూడు రకాల ప్రత్యేక కార్యక్రమాలు... ఆరోగ్యంపై అవగాహన, దీర్ఘకాలిక వ్యాధులను ముందే గుర్తించడం, వ్యాధులకు గురైన వారికి అవసరమైన చికిత్స చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. ప్రజలు రోగాల బారిన పడకుండా చూసేలా గ్రామస్థాయి వరకు ‘వెల్‌నెస్ కేంద్రాల’ను నెలకొల్పాలని సూచించింది. కాగా, తమిళనాడులో ప్రస్తుతం ఆదర్శవంతమైన ఆరోగ్య వ్యవస్థ ఉందని, దాన్ని అమలు చేస్తే బాగుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలపై కసరత్తు చేసి ఆదర్శవంతమైన ఆరోగ్య విధానాన్ని రూపొం దిస్తామని ఆయన తెలిపారు.