రాష్ట్ర వైద్య శాఖకు కేంద్రం ఇచ్చిన ప్రశంస పత్రం
సాక్షి, అమరావతి: టెలీమెడిసిన్ సేవల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లుగా మార్చడంలో, వాటి నిర్వహణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై ప్రశంసలు కురిపించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్షుక్ మాండవీయ వర్చువల్ విధానంలో శనివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
ప్రజారోగ్యంపై సర్కార్ ప్రత్యేక దృష్టి
ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఈ ఏడాది ఆఖరు నాటికి హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లుగా మార్చాలని కేంద్రం రాష్ట్రాలకు లక్ష్యం నిర్దేశించింది. దీనికి ముందే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘నాడు–నేడు’ కింద ఆరోగ్య ఉపకేంద్రాలను వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లుగా అభివృద్ధి చేసింది. అదేవిధంగా పీహెచ్‌సీల్లోనూ వసతుల కల్పన చేపట్టింది. పట్టణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేస్తూ పట్టణ ప్రాంతాల్లో 560 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు రాష్ట్రంలో 560 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6,313 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు.. వంద శాతం హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లుగా రూపాంతరం చెందాయి.
ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు
హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు కాకముందు వాటిలో కేవలం ప్రాథమిక వైద్యసేవలను మాత్రమే అందించేవారు. హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లుగా మారాక పలు వ్యాధులకు ప్రాథమిక వ్యాధి నిర్ధారణతోపాటు వైద్య సేవలు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో 12 రకాల వైద్య సేవలు అందుతున్నాయి. పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల్లో సమగ్ర మాతా–శిశు సంరక్షణ సేవలు, ప్రసూతి సేవలు, మానసిక వైద్యసేవలు, బీపీ, షుగర్, గుండె సంబంధిత, కంటి, చెవి, ముక్కు, గొంతు సంరక్షణ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఏపీ నుంచే 43.01 శాతం కన్సల్టేషన్‌లు
కేంద్రం 2019 నవంబర్‌లో దేశవ్యాప్తంగా ఈ–సంజీవని టెలీమెడిసిన్ సేవలను ప్రారంభించింది. ప్రారంభంలో టెలీమెడిసిన్ సేవలు అందించడం కోసం ఇంతకుముందున్న 13 జిల్లాల్లోని వైద్య కళాశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం 13 హబ్‌లను ఏర్పాటు చేసింది. అనంతరం మరో 14 హబ్‌లతో ఈ సేవలు విస్తరించింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 27 హబ్‌లలో ప్రజలకు టెలీమెడిసిన్ సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 3,30,36,214 కన్సల్టేషన్‌లు నమోదయ్యాయి. వీటిలో 43.01 శాతం అంటే 1,42,11,879 మన రాష్ట్రం నుంచే ఉన్నాయి. 47 లక్షల కన్సల్టేషన్‌లతో కర్ణాటక రెండో స్థానంలో, 34 లక్షలతో పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా రోజుకు లక్ష కన్సల్టేషన్‌లు నమోదవుతుంటే అందులో 50 నుంచి 60 శాతం ఏపీ నుంచే ఉంటున్నాయి. ఈ అంశంపై కేంద్రం ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించింది.
ఆశా వర్కర్ల ద్వారా టెలీమెడిసిన్ సేవలపై అవగాహన
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,145 పీహెచ్‌సీలతోపాటు వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను టెలీమెడిసిన్ హబ్‌లకు అనుసంధానం చేశారు. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రజలు ఇంటి నుంచే టెలీమెడిసిన్ సేవలు పొందేందుకు వీలుగా ఈ–సంజీవని (ఓపీడీ) సేవలు అందుబాటులోకి వచ్చాయి. టెలీమెడిసిన్ సేవలను విస్తృతం చేయడంతోపాటు స్మార్ట్ ఫోన్ లేనివారు, వాడకం తెలియనివారు, వృద్ధులు, ఇతరులకు వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ సంజీవని ఓపీడీ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచడం కోసం రాష్ట్రంలో 42 వేల మంది ఆశావర్కర్‌లకు స్మార్ట్ ఫోన్‌లు పంపిణీ చేసింది. స్మార్ట్ ఫోన్‌లన్నింటినీ హబ్‌లకు అనుసంధానించారు. ఆశాల ద్వారా ప్రజలకు మరింతగా టెలీమెడిసిన్ సేవలు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment