ఎంసెట్‌ తొలివిడత కౌన్సెలింగ్‌లో 72 వేలకు పైగా సీట్లు భర్తీ | Over 72000 Seats Have Been Filled In AP EAMCET Counseling | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ తొలివిడత కౌన్సెలింగ్‌లో 72 వేలకు పైగా సీట్లు భర్తీ

Published Mon, Jan 4 2021 5:27 AM | Last Updated on Mon, Jan 4 2021 5:27 AM

Over 72000 Seats Have Been Filled In AP EAMCET Counseling - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఎంసెట్‌–2020 తొలివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా 72,867 మందికి సీట్లు కేటాయించారు. ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎం.ఎం.నాయక్‌ ఆదివారం సాయంత్రం అభ్యర్థులకు సీట్లు కేటాయింపు పూర్తి చేయించారు. ఈసారి ఎంసెట్‌లో ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన గతేడాది అక్టోబర్‌ 23 నుంచి ప్రారంభం అయినా ఫీజులు, కాలేజీల అఫ్లియేషన్‌ జాప్యంతో వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ డిసెంబర్‌ 28 నుంచి ఈనెల 1వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం ఎంసెట్‌లో 1,29,714 మంది అర్హత సాధించగా 90,076 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

వీరిలో 89,078 మంది ధ్రువపత్రాలను పరిశీలన చేయించుకున్నారు. 83,014 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారు. రాష్ట్రంలోని 380 ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లోని మొత్తం సీట్లలో కన్వీనర్‌ కోటా కింద 1,03,766 సీట్లు ఉండగా వాటిలో 72,867 మొదటి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయి. ఇంకా 30,899 సీట్లు మిగిలి ఉన్నాయి. యూనివర్సిటీల పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లో ఇంజనీరింగ్‌ సీట్లు 5,649, ఫార్మసీ సీట్లు 77 భర్తీ చేశారు. ప్రయివేటు కాలేజీల్లోని ఇంజనీరింగ్‌ సీట్లు 66,900, ఫార్మసీ సీట్లు 241 భర్తీ అయ్యాయి. ఇంకా స్పోర్ట్స్‌ కేటగిరీలోని 465 మందికి సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన నివేదికలు శాప్‌ నుంచి అందనందున వారికి మొదటి విడతలో సీట్లు కేటాయించలేదు. వారికి తదుపరి సీట్లు కేటాయించనున్నట్లు కన్వీనర్‌ నాయక్‌ వివరించారు. 

ఈసారి జీవో అలాట్మెంట్‌ కాలేజీ ఒక్కటే
కాలేజీల్లో ప్రమాణాలు, ఇతర సదుపాయాల విషయంలో ప్రభుత్వం ఈసారి పగడ్బందీ చర్యలు తీసుకోవడంతో దాని ప్రభావం కౌన్సెలింగ్‌లో స్పష్టంగా కనిపించింది. గతంలో జీరో అలాట్‌మెంటు కాలేజీల నుంచి 20 సీట్లు కూడా భర్తీ కాని కాలేజీల సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ ఈసారి ప్రభుత్వమే సరైన ప్రమాణాలు, నిర్ణీత నిబంధనల ప్రకారం సదుపాయాలు, సిబ్బంది లేని కాలేజీలను జీవో అడ్మిషన్ల కేటగిరీలో చేర్చి వాటికి సీట్ల కేటాయింపును నిలిపివేసింది. ఇంజనీరింగ్‌లో 48, బీ ఫార్మసీలో 5 కాలేజీలకు అడ్మిషన్ల జాబితా నుంచి తప్పించింది. 

54 కాలేజీల్లో 100 శాతం సీట్ల భర్తీ
ఈసారి పూర్తి స్థాయిలో వంద శాతం సీట్లు భర్తీ అయిన కాలేజీల సంఖ్య గతంలో కన్నా పెరిగింది. 2019 ఎంసెట్‌లో తొలివిడత కౌన్సెలింగ్‌లో 44 కాలేజీల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాగా ఈసారి వాటి సంఖ్య 54కు పెరిగింది.

కంప్యూటర్‌ సైన్స్‌దే అగ్రస్థానం
ఏపీ ఎంసెట్‌–2020 తొలివిడత సీట్ల కేటాయింపులో అత్యధిక సీట్లు కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలోనే భర్తీ అయ్యాయి. గతంలో మాదిరిగానే ఆ విభాగం అగ్రస్థానంలో ఉంది. ఐటీ, ఈసీఈ విభాగాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement