నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
* రాష్ట్ర వ్యాప్తంగా 34 హెల్ప్‌లైన్ కేంద్రాల ఏర్పాటు
* హైదరాబాద్‌లో లేని కేంద్రం
సాక్షి, హైదరాబాద్ : ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి సంబంధించి శుక్రవారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే విజయవాడ కేంద్రంగా నోడల్ ఆఫీసును, రాష్ట్ర వ్యాప్తంగా 34 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్‌కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు, తరగతుల ప్రారంభానికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేశారు.
హైదరాబాద్‌లో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) కేంద్రంగా పర్యవేక్షణ సాగిస్తారు. హైదరాబాద్‌లో కౌన్సెలింగ్‌కు ఎలాంటి కేంద్రాలు ఏర్పాటుచేయలేదు. కౌన్సెలింగ్ నోడల్ కేంద్రంగా ఉన్న సాంకేతిక విద్యాభవనానికి తెలంగాణ ప్రభుత్వం తాళాలు వేయించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో హెల్ప్‌లైన్ కేంద్రాలకు సహకరించదన్న ఉద్దేశంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఏపీ ఎంసెట్ రాసిన హైదరాబాద్ సహా తెలంగాణ అన్ని జిల్లాల విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు ఏపీలోని హెల్ప్‌లైన్ కేంద్రాలకు వెళ్లాలి.
విద్యార్థులకు ఇప్పటికే ర్యాంకు కార్డులు జారీచేశారు. ఏఐసీటీఈ అనుమతి ఉన్న కాలేజీలకు యూనివర్సిటీల అఫ్లియేషన్, అనుమతుల మంజూరు కొలిక్కివచ్చింది.ప్రస్తుతం 339 కాలేజీల్లో 1.70 లక్షల వరకు సీట్లున్నాయి. ఇందులో 1.28 వేల సీట్లు కన్వీనర్ కోటాకు సంబంధించినవి.1.38 లక్షల మంది ఎంసెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకానున్నారు. జేఎన్‌టీయూకే పరిధిలో 229 కాలేజీలు, జేఎన్‌టీయూఏ పరిధిలో 95 కాలేజీలు, ఏయూ పరిధిలో 10, ఏఎన్‌యూ పరిధిలో 5 కాలేజీలు కౌన్సెలింగ్ జాబితాలో ఉండనున్నాయి.
తొలివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా జూన్ 12 నుంచి 20 వరకు ర్యాంకుల వారీగా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. జూన్ 14 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. జూన్ 22, 23 తేదీల్లో ఆప్షన్లను మార్పుచేసుకొనే అవకాశం ఉంది. జూన్ 26న సీట్లను అలాట్ చేయనున్నారు.