బదిలీ టీచర్లలో వెబ్..డబ్..
- 7 వేల మందికి తప్పని స్థానచలనం
- పనితీరు ప్రతిభ ఆధారంగా బదిలీ పాయింట్లు
- వెబ్ కౌన్సెలింగ్‌లో ఆరు స్టేజ్‌లు
- కౌన్సెలింగ్ నిర్వహణకు సిద్ధం డీఈఓ
విజయనగరం అర్బన్: గంటకో ప్రకటన, రోజుకొక జీవో రావడంతో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ గందరగోళంగా తయారయింది. విద్యాసంత్సరం ప్రారంభం నాటికి టీచర్ల బదిలీ పూర్తిచేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటికీ బదిలీల స్పష్టత ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ప్రాథమిక పాఠశాలల్లో రెండేళ్లుగా బదిలీలు చేపట్టలేదు. మూడేళ్లుగా హేతుబద్ధీకరణ లేదు. రెండింటినీ కలిపి ప్రస్తుతం నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపధ్యంలో బదిలీల కోసం ఎదురుచూస్తున్న వారు కొందరైతే.. నిబంధనలకు లోబడి తప్పనిసరిగా మారాల్సిన వారు మరికొందరు ఉన్నారు. విద్యాసంవత్సరం మధ్యలో జరపడం వల్ల ఎక్కడికి వెళ్లాల్సిన ఉంటుందోనని దాదాపుగా అందరూ ఆందోళన చెందుతున్నారు.
ఏడువేల మందికి స్థాన చలనం !
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిధిలో 13 వేలమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో ప్రస్తుతం సుమారు ఏడు వేల మందికి బదిలీలు, హేతుబద్ధీకరణ ప్రక్రియలో స్థానచలనం ఖాయమని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు. ఉపాధ్యాయుల బదిలీలను ఈ నెల రెండవ వారంలోనే నిర్వహించాలని భావించి, షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఆ తరువాత వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలంటూ మంత్రి గంటా ప్రకటించారు.
వెనువెంటనే మరో ప్రకటనలో ఉపాధ్యాయుల వృత్తిప్రతిభ ప్రాధిపతికన పాటించాలంటూ సీఎం పేర్కొన్నారు. దీంతో త్వరలోనే బదిలీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అకాశం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. తక్కువ మంది విద్యార్థులున్న కిలోమీటరు పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను ఆదర్శపాఠశాల పేరుతో విలీనం చేసేందుకు ప్రభుత్వం జీఓ నంబర్ 45ని విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 30 లోపు విద్యార్థులున్న 194 పాఠశాలలను 262 పాఠశాలల్లో విలీనం చేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. వీటిల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించినున్నారు. కేవలం హేతుబద్ధీకరణ పేరుతోనే సూమారు 800 మందికిపైగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు. ఈ నేపధ్యంలో అధిక సంఖ్యల్లో ఉపాధ్యాయులకు స్థానచలనం తప్పదని స్పష్టమవుతోంది.
పనితీరు ప్రతిభ ఆధారంగా బదిలీ పాయింట్లు
సీఎం ప్రకటన నేపధ్యంలో ముందుగా ఉపాధ్యాయుల పనితీరును వివరాలను సిద్ధం చేసుకొని బదిలీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ పనితీరును గుర్తించే ప్రక్రియలో విద్యార్థి ఉత్తీర్ణత శాతంతోపాటు, స్థానిక నివాసం, టీచర్ పిల్లలను వాళ్లు పనిచేసిన స్కూళ్లలో చదివించడం వంటి టీచర్ వ్యక్తగత వృత్తిప్రమాణాలకు మార్కులు వేసి వారికి ప్రాధాన్యం ఇస్తారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి పద్ధతిని పాటించడంతో టీచర్లు ఆందోళన చెందుతున్నారు.
ఆరు స్థాయిల్లో ...
బదిలీల ప్రక్రియను మొత్తం ఆరు స్థాయిల్లో నిర్వహించనున్నారు. ముందుగా .. ఇప్పటికే ఉన్న ఖాళీలు, ఎనిదేళ్లు ఒకేచోట సర్వీసు కలిగిన వారి ఖాళీలు, హేతుబద్ధీకరణ ఖాళీలను ప్రదర్శిస్తారు. అనంతరం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజులు సమయం ఇస్తారు. ఉపాధ్యాయుడు దరఖాస్తు చేసిన ప్రింట్‌ను తీసుకొని సంబంధిత ధ్రువీకరణవపత్రాలతో మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులకు సమర్పించి నిర్ణరించుకోవాలి. వారు వాటిని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపుతారు. అనంతరం తాత్కాలిక సీనియార్టీ జాబితాను ఎన్టైటిల్మెంట్ పాయింట్లతో వెబ్సైట్లో ఉంచుతారు. దీనిపై దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల సెల్‌ఫోన్‌కు పాస్వర్డ్ వస్తుంది.
అనంతరం ఆన్లైన్లోనే తాము పనిచేదలుచుకున్న, కోరుకున్న పాఠశాలల వివరాలను నమోదు చేయాలి. అవసరమైతే రెండుసార్లు వాటిని మార్చుకొనే అవకాశం కూడా కల్పిస్తున్నారు. వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా సీనియారిటీలో తమ కిందనున్న వారు ఖాళీ చేసిన స్థానాలను సైతం ఎంపిక చేసుకొనే వెసులుబాటు కల్పిస్తారు. గతంలో ఈ తరహా సదుపాయం ఉండేదికాదు. ఆంగ్ల మాధ్యమం పాఠశాలలను కోరుకున్న వారు ఇకపై ఆ పాఠశాలలోనే పనిచేయాల్సి ఉంటుంది. వెబ్‌కౌన్సెలింగ్ ముగిసిన ఐదు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు పంపుతారు. ఉపాధ్యాయుల సెల్‌నంబర్లకు కూడా సంక్షిప్త సమాచారం పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
కౌన్సెలింగ్ నిర్వహణకు సిద్ధం డీఈఓ
హేతుబద్ధీకరణ, వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. తొలిసారి వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహిస్తుండటంతో కొందరికి అవగాహనలేదని ముందుగానే టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. కౌన్సెలింగ్‌పై స్పష్టమైన సెడ్యూల్ రానందున ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నామని తెలిపారు. ఎప్పుడు కౌన్సెలింగ్ నిర్వహించమన్నా సిద్ధం ఉన్నామని డీఈఓ స్పష్టం చేశారు.