పాలిటెక్నిక్ బోధనపై నిఘా!
♦ తరగతి గదుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
♦ సహజ బోధనకు ఆటంకమని
♦ అధ్యాపకుల ఆందోళన
♦ వెంటనే తొలగించాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో బోధన, అభ్యసన ప్రక్రియపై సాంకేతిక విద్యా శాఖ నిఘా పెట్టింది. తరగతి గదుల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే నల్లగొండ జిల్లాలోని రెండు పాలిటె క్నిక్ కాలేజీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, మిగిలిన జిల్లాల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో త్వరలోనే ఏర్పాటు చేసేందుకు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. వాస్తవానికి కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధానికి, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా గుర్తించి తగు చర్యలు చేపట్టేందుకు రాష్ట్రంలోని 52 పాలిటెక్నిక్ కాలేజీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సాంకేతిక విద్యా శాఖ చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా ప్రతి కాలేజీలో ప్రాధాన్యక్రమంలో విద్యార్థినుల హాస్టళ్లు, బాలుర హాస్టళ్లు, కళాశాల ప్రధాన భవనం, ప్రధాన ద్వారం వద్ద సీసీ కెమెరాలు అమర్చాలని సాంకేతిక విద్యా డెరైక్టర్ జనవరి 30న ఆదేశాలు జారీ చేశారు. అయితే కొందరు ప్రిన్సిపాళ్లు అత్యుత్సాహంతో ఏకంగా తరగతి గదుల్లో సీసీ కెమెరాలు అమర్చారు. నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్, తిరుమలగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని తరగతి గదుల్లో అమర్చారు. తరగతి గదుల్లో కెమెరాలు అమర్చడం వల్ల బోధన యాంత్రికంగా మారుతుందని, అందుకే తరగతి గదుల్లో అవసరం లేదని, వాటిని తొలగించాలని తెలంగాణ పాలిటెక్నిక్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు నర్సయ్యగౌడ్ డిమాండ్ చేశారు.