ఫలితాలను విడుదల చేస్తున్న మంత్రి బుగ్గన, అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడేలా పాలిటెక్నిక్, ఐటీఐ విద్యా సంస్థల్లో పలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. మాన్యుఫ్యాక్చరింగ్‌తో పాటు హాస్పిటాలిటీ, నర్సింగ్ తదితర కొత్త కోర్సులను ప్రవేశపెట్టి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు. హోటల్ ఇండస్ట్రీలో అనేక మంది ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి చేరుతున్నారని, అలాగే నర్సింగ్ వంటి సేవలకు జాతీయంగా, అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉందని చెప్పారు.
పాలిటెక్నిక్, ఐటీఐలలో, స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థల్లో ఈ కొత్త కోర్సులు ప్రవేశపెడతామన్నారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ –2022 ఫలితాలను ఆయన శనివారం విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త కోర్సులు, కరిక్యులమ్‌లో మార్పులు చేసి మరింత నాణ్యమైన విద్యను అందిస్తామని వివరించారు. మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులతో సమానంగా ఈ డిప్లొమా కోర్సులను కూడా తీర్చిదిద్దుతామని అన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో పాటు పలువురు ప్రముఖులు డిప్లొమా కోర్సుల్లో చేరి పైకి వచ్చిన వారేనని వివరించారు.
2021 విద్యా సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3డీ, యానిమేషన్, మల్టీ మీడియా కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. రానున్న బ్యాచుల వారికి క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్‌డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషీన్ లెర్నింగ్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్‌వర్క్ కోర్సులు ప్రవేశ పెడుతున్నట్లు మంత్రి చెప్పారు. విద్యార్థులు బాగా రాణించాలంటే తల్లుల పాత్ర కీలకమన్నారు. ఈ సమావేశంలో స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ముఖ్య కార్యదర్శి సౌరభ్‌గౌర్, కమిషనర్ పోలా భాస్కర్, స్టేట్ టెక్నికల్ బోర్డ్ ఆఫ్ ట్రైనింగ్ సెక్రటరీ విజయభాస్కర్, జేడీ ఎ.నిర్మల్‌కుమార్ ప్రియ తదితరులు పాల్గొన్నారు.
బాలికల ముందంజ
పాలిటెక్నిక్ ఫలితాల్లో బాలురకన్నా బాలికలు ఉత్తీర్ణత శాతంలో ఆధిక్యంలో నిలిచారు. మొత్తం 1,31,608 మంది పరీక్షలు రాయగా వారిలో 1,20,866 (91.84 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 74,510 మంది (90.56 శాతం), బాలికలు 46,356 మంది (93.96 శాతం) ఉత్తీర్ణులయ్యారు. చల్లా సత్య హర్షిత మొదటి ర్యాంకు సాధించింది. టాప్ 10 ర్యాంకుల్లో తూర్పు గోదావరి జిల్లా ఎక్కువ దక్కించుకుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించగా ఓసీలు 91.39 శాతం ఉత్తీర్ణులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment