
పాలిటెక్నిక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
ఆకుపాముల (మునగాల) : మండలంలోని ఆకుపాముల గ్రామపంచాయతీ శివారులో ఉన్న భగత్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి మంగళవారం అర్థరాత్రి అనుమానాస్పదంగా మృతిచెందాడు. కళాశాల యాజమాన్యం, సహచర విద్యార్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల డివిజన్ శ్రీరాంపూర్‌కు చెందిన దుర్గం కృష్టయ్య మూడో కుమారుడు దుర్గం వేణు (17) గత సంవత్సరం నిర్వహించిన కౌన్సెలింగ్ ద్వారా మండలంలోని ఆకుపాముల భగత్ పాలిటెక్నిక్ కళాశాలలో మైనింగ్ విభాగంలో సీటు సాధించాడు.
వేణు కళాశాల ప్రాంగణంలో ఉన్న డిప్లోమా హాస్టల్ ఉంటూ కళాశాలకు వెళ్తుండేవాడు. ఈ హాస్టల్‌లో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు జార్ఖాండ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన 350 మంది విద్యార్థులు ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. సోమవారం సెలవు కావడంతో సహచర విద్యార్థులు, రూమ్‌మేట్స్‌తో వేణు సరదాగా కాలం గడిపాడు. సాయింత్రం 5 గంటల సమయంలో బయటకు వెళ్లిన వేణు తిరిగి హాస్టల్‌కు రాలేదు. రాత్రి ఎనిమిది గంటల వరకు కనీసం మెస్‌కు కూడా రాకపోవడంతో తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
దీంతో కళాశాలకు చెందిన విద్యార్థులు, సిబ్బంది జట్లుగా ఏర్పడి కళాశాల చుట్టు దాదాపు మూడు కి.మీ పరిధిలో వెతుకులాట ప్రారంభించారు. కాగా రాత్రి 10 గంటల సమయంలో ఆకుపాముల ఆవాస గ్రామమైన నర్సింహాపురం శివారులో కారింగుల వీరయ్యకు చెందిన వ్యవసాయ బావి ఒడ్డున వేణుకు సంబంధించిన సెల్‌ఫోన్, చెప్పులు ఉండడంతో అనుమానించిన విద్యార్థులు, సిబ్బంది బావిలో వెతకగా వేణు మృతదేహాం లభ్యమైంది. దీంతో వారు కళాశాల యజమాన్యం, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం తెల్లవారుజామున ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల సాయం తో వేణు మృతదేహాన్ని బయటకు తీశారు.
హత్యా..ఆత్మహత్యా?
ఇదిలా ఉండగా దుర్గం వేణు మృతి అనుమానాస్పదంగా మారింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్న వేణు హాస్టల్‌కు దూరంగా ఉన్న బావిని ఎందుకు ఎంచుకుంటాడనేది ఓ ప్రశ్న. ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మృతి చెందాడా అనేది మరో ప్రశ్న. మృతుడి దేహాంపై అక్కడక్కడ గాయాలు కనిపించడంతో ఎవరైన హత్య చేసి బావిలో పడవేశారా అనేది మీమాంసగా మారింది. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారిస్తే తప్ప వాస్తవాలు తెలియవని పోలీసులు, యాజమాన్యం అంటోంది. కోదాడ రూరల్ సీఐ పి.మధుసూదన్‌న్‌రెడ్డి, రూరల్ ఎస్‌ఐ విజయప్రకాశ్, మునగాల ఎస్‌ఐ గడ్డం నగేశ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హాస్టల్‌కు చెందిన పలువురు విద్యార్థులను విచారించారు.
పరీక్షల ఒత్తిడి తట్టుకోలేకే...
ఇటీవల పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సర వార్షిక పరీక్షల్లో ఇన్విజిలేటర్ల ఒత్తిడి తట్టుకోలేక మానసిక వేదనతో వేణు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని కళాశాల యాజమన్యం అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. వారం రోజలుగా కళాశాలలో పరీక్ష నిర్వాహకులు విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారని పలువురు విద్యార్థులు తమ ముందు వాపోయారని యాజమాన్యం తెలిపింది.
కేసు నమోదు...
భగత్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన దుర్గం వేణు అనుమానాస్పద మృతిపై మృతుడి తండ్రి కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ రూరల్ సీఐ పి.మధుసూధన్‌రెడ్డి తెలిపారు. మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.