ధర్నా చేస్తున్న విద్యార్థినులు
చిత్తూరు, పలమనేరు: పలమనేరు సమీపంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల బుధవారం ఆందోళనలతో దద్దరిల్లింది. ఓ అధ్యాపకుడు అకారణంగా తమను వేధిస్తున్నాడంటూ ముగ్గురు విద్యార్థినులు ఆరోపించారు. తర్వాత తమ తల్లిదండ్రులతో కలసి కళాశాల నుంచి వెళ్లిపోతామంటూ గొడవకు దిగారు. ఈవ్యవహారం క్రమంగా పెద్దదై విద్యార్థినుల ధర్నా, ఆపై మహిళా అధ్యాపకుల నిరసన వ్యక్తం చేసే స్థాయికి చేరింది. విద్యార్థినులకు మద్దతుగా సీఐటీయూ నాయకులు రావడంతో అక్కడి విషయాలు బయటపడ్డాయి. ఇక్కడ కళాశాలలో ఏపీ, తెలంగాణకు చెందిన 500 మందికి పైగా విద్యనభ్యసిస్తున్నారు. అక్కడ పనిచేసే ఎలక్ట్రానిక్స్ అధ్యాపకుడు శ్రీధర్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ముగ్గురు విద్యార్థినులు ప్రిన్సిపల్ విశ్వనాథరెడ్డికి ఫిర్యాదు చేశారు.
దానికితోడు హాస్టల్‌లో సౌకర్యాలు లేవని తాము ఇక్కడ ఉండలేమని ఇళ్లకు వెళ్లిపోతామంటూ విన్నవించారు. అయితే ప్రిన్సిపల్ వారి మాటలను ఖాతరు చేయలేదు. దీంతో వందలాది మంది విద్యార్థినులు ప్రిన్సిపల్ గది ఎదుట ధర్నాకు దిగారు. మెస్‌లో పెట్టే భోజనంలో పురుగులున్నాయని ఆరోపించారు. మెస్‌లో వంట చేయడానికి కూడా తమను ఉపయోగించు కుంటున్నారని, అనారోగ్యానికి గురైతే కనీసం ఆస్పత్రికి కూడా పంపడం లేదన్నారు. ఇక్కో విద్యార్థినికి కేవలం 5 కాయిన్స్ మాత్రమే ఇచ్చి కుటుంబ సభ్యులతో కాయిన్‌బాక్స్‌లో మాట్లాడమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ కాయిన్‌బాక్స్ కూడా మరమ్మతులకు గురైనా.. పట్టించుకునే నాథుడు లేకుండా పోయారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగేదాకా ధర్నా విరమించబోమంటూ విద్యార్థినులు భీష్మించారు.
మహిళా అధ్యాపకులను వేధిస్తున్న ప్రిన్సిపల్
ఇది ఇలా ఉండగా ప్రిన్సిపల్ విశ్వనాథ రెడ్డి తమ ను వేధిస్తున్నారంటూ పలువురు మíహిళా అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు కూడా నిరసనకు సిద్ధమయ్యారు. విషయం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కావడంతో ఆర్జేడీ సూర్యుడు కళాశాల వద్దకు చేరుకున్నారు. బాధిత విద్యార్థినులను, మహిళా అధ్యాపకులను విచారించారు.
బాధ్యులపై వేటు తప్పదు..
విచారణ అనంతరం ఆర్జేడీ మీడియాతో మట్లాడారు. విద్యార్థినులను శ్రీధర్ అనే అధ్యాపకుడు వేధిస్తున్న మాట నిజమేనని, ఈ విషయం విచారణలో స్పష్టమైందన్నారు. గతంలోనే ఆయనకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు చెప్పారు. మరోవైపు మహిళా అధ్యాపకులకు మెటర్నటీ లీవ్ అడిగితే ఎందుకు ఎంజాయ్ చేసేందుకా..? అనడం, సర్టిఫికెట్లను ఇవ్వకుండా సతాయించడం తదితరాల ఆరోపణలన్నీ వాస్తవాలేనన్నారు. వీరిపై కమిషనర్‌కు నివేదికను పంపిస్తామని, బాధ్యులపై వేటు తప్పదని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment