మంత్రివర్యా ఇటువైపు చూడరా? | Students Suffering In Tekkali Polytechnic College | Sakshi
Sakshi News home page

మంత్రివర్యా ఇటువైపు చూడరా?

Published Wed, Oct 10 2018 7:13 AM | Last Updated on Wed, Oct 10 2018 7:13 AM

Students Suffering In Tekkali Polytechnic College - Sakshi

నందిగాం మండలం తురకలకోటలో ఉన్న టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల

రెండేళ్ల క్రితం వరకు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను ఏడాది కిందట టెక్కలికి తరలించారు. నందిగాం మండలం తురకల కోట సమీపంలో కొండల మధ్యనున్న మూత పడిన ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ కళాశాలను ఏర్పాటు చేశారు. ఆ భవనం యాజమాన్యానికి ప్రభుత్వం  సుమారు 9 కోట్ల 80 లక్షల రూపాయలు చెల్లించింది. అయితే, కళాశాల ఏర్పాటై ఏడాది గడుస్తున్నా ఇంత వరకు రెగ్యులర్‌ సిబ్బందిని నియమించలేదు. డిప్యూటేషన్‌ సిబ్బందితో తరగతులు నిర్వహిస్తుండటం,  పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు లేకపోవడం, ల్యాబ్‌లలో సరైన పరికరాలు లేకపోవడం, ప్రభుత్వ వసతి గృహాలు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇలాకాలో ఉన్న ఈ కళాశాల విషయంలో చిన్నచూపు చూడడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.

టెక్కలి: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాల విద్యార్థులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతానికి సర్కార్‌ కళా శాల మం జూరైందనే సంతోషం కం టే.. పిల్లల కష్టాలే తమను బాధిస్తున్నాయని ఈ ప్రాంతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   కొండలు, తోటల మధ్యలో ఉన్న కళాశాలకు రక్షణ గోడ కూడా లేకపోవడంతో అక్కడ ఉండటానికే పిల్లలు భయపడుతున్నారు. ఈ కారణంగానే ఈ ఏడాది ఇక్కడి సీట్లు కూడా పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదు. కళాశాలలో ప్రస్తుతం ట్రిపుల్‌ ఈ, సివిల్‌ బ్రాంచ్‌లు నడుస్తున్నాయి.   ఒక్కో బ్రాంచ్‌కి ఐదుగురు  ఉపన్యాసకులు (లెక్చరర్లు), ఒక సీనియర్‌ ఉపన్యాసకుడు, శాఖాధిపతి ఒకరు చొప్పున ఉండాలి. ప్రస్తుతం ఓఎస్డీ (ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ) ఒకరు, ట్రిపుల్‌ ఈ, సివిల్‌ బ్రాంచ్‌లకు ఒక్కొక్కరు చొప్పున ఉపన్యాసకులు డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. వీరితో పాటు ఆరుగురు కాంట్రాక్ట్‌ ఉపన్యాసకులు, ఇద్దరు గెస్ట్‌ లెక్చరర్లు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం కళాశాలలో ట్రిపుల్‌ ఈ, సివిల్‌ బ్రాంచిల్లో మొత్తం 193 మంది విద్యార్థులు ఉన్నారు.

అందుబాటులో లేని ల్యాబ్‌లు
విద్యార్థులకు తగినన్ని ల్యాబ్‌లు ఏర్పాటు చేయలేదు. మూత పడిన ఇంజినీరింగ్‌ కళాశాలలో ఉన్న కొన్ని పరికరాలతో ఇప్పుడు ల్యాబ్‌లు నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం 5వ సెమిస్టర్‌ ల్యాబ్‌ పరీక్షలు జరగాల్సి ఉండగా అవి జరగడం లేదు.

వసతి గృహాలు లేక అవస్థలు..
 కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ వసతి గృహాలు లేకపోవడంతో అద్దె ఇళ్లల్లో అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థినులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో ఇంట్లో ముగ్గురు నుంచి ఐదు మంది చొప్పున వేల రూపాయలు అద్దె కడుతూ, వండుకుని తింటూ ఇబ్బందులు పడుతున్నారు.
  కళాశాలలో  అవసరమైనన్ని మరుగుదొడ్లు లేవు. ఉన్నవి పూర్తిగా అధ్వానంగా మారాయి.  కళాశాల ఏర్పాటు చేసిన తరువాత విద్యార్థులకు అవసరమైన వాటి కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోవడం గమనించదగ్గ విషయం.

కళాశాలలో తగ్గిన సీట్ల భర్తీ:
కొండలు, తోటల మధ్యలో కనీస సదుపాయాలు లేని ఈ కాలేజీలో చేరేందుకు విద్యార్థులు కూడా ఆసక్తి చూపడం లేదు. ట్రిపుల్‌ఈ లో 60,  సివిల్‌ విభాగానికి 60 చొప్పున ప్రభుత్వం సీట్లు కేటాయించగా,  ఈ ఏడాది ట్రిపుల్‌ ఈలో 34, సివిల్‌లో 19 మంది మాత్రమే చేరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement