
సాక్షి, హైదరాబాద్: పాలిసెట్–2018 ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ఏడుగురు విద్యార్థులు 120 మార్కులకు 120 మార్కులను సాధించి ఒకటో ర్యాం కును సాధించారు. గత నెల 21న జరిగిన పాలిసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 1,25,063 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 1,21,422 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 1,12,010 మంది (92.21 శాతం) విద్యార్థులు అర్హత సాధించినట్లు సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. మంగళవారం సాంకేతిక విద్యా కమిషనర్ కార్యాలయంలో పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షకు హాజరైన 74,224 మంది బాలురులో 67,499 మంది (90.94 శాతం) అర్హత సాధించారని.. 47,918 మంది బాలికల్లో 44,511 మంది (94.31 శాతం) అర్హత పొందారని ఆయన చెప్పారు.
నోటిఫికేషన్‌లో కాలేజీలు, సీట్ల వివరాలు..
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ నెల 2న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు నవీన్ మిట్టల్ చెప్పారు. విద్యార్థులకు నోటిఫికేషన్ 3న అందుబాటులోకి వస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ నెల 14 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రవేశాల ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి చేసి, జూన్ 1 నుంచి తరగతులను ప్రారంభిస్తామని వివరించారు. ఒకటి, రెండో దశ కౌన్సెలింగ్‌లను ఈలోగా పూర్తిచేస్తామని, స్లైడింగ్ కోసం (సంబంధిత కాలేజీల్లోనే ఒక బ్రాంచీ నుంచి మరో బ్రాంచీకి మార్చుకునేందుకు) ప్రత్యేకంగా మరో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల ర్యాంకును బట్టి వారికి సీట్లను కేటాయిస్తామని, అయితే వారు పదో తరగతిలో ఉత్తీర్ణులైతే ఆ సీట్లు ఉంటాయని పేర్కొన్నారు. ఇక అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీలు, సీట్ల వివరాలను నోటిఫికేషన్‌లో వెల్లడిస్తామని వివరించారు. ఈ సారి ముందుగానే ప్రవేశాల కౌన్సెలింగ్‌ను పూర్తి చేస్తున్నందునా ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు మిగిలే పరిస్థితి ఉండదన్నారు. ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం 31 జిల్లాల్లోనూ హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ ప్రవేశాల షెడ్యూలు..
- మే 2న నోటిఫికేషన్
-14 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు
-15 నుంచి 19 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
-15 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు
- 23న మొదటి దశ సీట్ల కేటాయింపు
- ఆ తరువాత ప్రవేశాలు, 30వ తేదీలోగా రెండో దశ సీట్ల కేటాయింపు
Comments
Please login to add a commentAdd a comment