పాలిసెట్‌లో 8 మందికి ఫుల్ మార్కులు | Full marks for 8 people in paliset | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌లో 8 మందికి ఫుల్ మార్కులు

Published Tue, May 3 2016 2:48 AM | Last Updated on Tue, Sep 18 2018 7:45 PM

పాలిసెట్‌లో 8 మందికి ఫుల్ మార్కులు - Sakshi

పాలిసెట్‌లో 8 మందికి ఫుల్ మార్కులు

ఫలితాలు విడుదల చేసిన కడియం.. 82.57 శాతం ఉత్తీర్ణత
 

 సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్-2016లో 82.57 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ప్రవేశపరీక్షలో ఎనిమిది మంది విద్యార్థులు మొత్తంగా 120కి 120 మార్కులు సాధించడం విశేషం. మరో ఏడుగురు విద్యార్థులు 119 మార్కులు సాధించారు. పాలిసెట్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు.  పాలిసెట్‌కు 1,27,972 మంది దరఖాస్తు చేసుకోగా.. ఏప్రిల్ 21న నిర్వహించిన పరీక్షకు 1,24,747 మంది హాజరయ్యారు. ఇందులో 1,03,001 మంది (82.57 శాతం) అర్హత సాధించారు.

గతేడాది ఉత్తీర్ణత శాతం 72.88 శాతమే కావడం గమనార్హం. ఈసారి పరీక్షకు 80,123 మంది బాలురు హాజరుకాగా.. 64,784 మంది (80.86 శాతం) అర్హత సాధించారు. బాలికలు 44,624 మంది పరీక్ష రాయగా.. 38,217 మంది (85.64 శాతం) అర్హత సాధించారు. ఇక పాలిసెట్‌కు 20,922 మంది ఎస్సీ విద్యార్థులు, 12,366 మంది ఎస్టీ విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. వారంతా అర్హత సాధించడం గమనార్హం. పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడిన తరువాత ర్యాంకులు కేటాయిస్తామని కడియం వెల్లడించారు.  ఈనెల 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని... 54 ప్రభుత్వ (11,560 సీట్లు), 169 ప్రైవేటు (46,520 సీట్లు) పాలిటెక్నిక్‌లలో కలిపి 58,080 సీట్లను భర్తీ చేస్తామని తెలిపారు. జూన్ 9వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులు polycetts.nic.in, www.dte.telangana. gov.in, www.sbtet.telangana.gov.in, www.sakshieducation.com వెబ్‌సైట్ల నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

 వెబ్‌సైట్‌లో ఓఎంఆర్ జవాబు పత్రాలు
 స్కాన్ చేసిన ఓఎంఆర్ జవాబు పత్రాలను తమ వెబ్‌సైట్ (https://polycetts.nic.in)లో అందుబాటులో ఉంచినట్లు సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. విద్యార్థులు వాటిని చూసుకోవచ్చని పేర్కొన్నారు.

 టాపర్లలో ఐదుగురు ఏపీ వారే..
 తెలంగాణ పాలిసెట్‌లో వంద శాతం మార్కులు సాధించిన విద్యార్థుల్లో ఐదుగురు రాజమండ్రికి చెందిన వారే ఉన్నారు. మిగతా ముగ్గురు తెలంగాణ జిల్లాలకు చెందిన వారు. రాష్ట్ర విభజన చట్టం నిబంధనల ప్రకారం తెలంగాణలోని విద్యా సంస్థల్లో 15 శాతం ఓపెన్ కోటా సీట్లలో ప్రవేశాలు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా అర్హులే. దీంతో పలువురు ఏపీ విద్యార్థులు తెలంగాణ పాలిసెట్ రాశారు. ముఖ్యంగా ఉత్తమ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీగా పేరున్న వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్‌లో ప్రవేశాల కోసం ఏపీ విద్యార్థులు పాలిసెట్ రాస్తుంటారు. ఈసారి 120 మార్కులు సాధించిన వారిలో రిత్విక్ తేజ నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన విద్యార్థి, భరత్‌కుమార్ వరంగల్ జిల్లా తొర్రూరుకు చెందిన విద్యార్థి. హనుమంతు శ్రీలేఖ స్వస్థలం మెదక్ జిల్లా సంగారెడ్డి. మిగతా ఐదుగురు ధర్మతేజ, సాయి సీతారామ హరీశ్, అఖిల్, సత్యసాయి భూషణ్, శ్రీసిద్ధి రాజమండ్రికి చెందిన  వారే. వీరంతా అక్కడి విద్యాసంస్థల్లో పదో తరగతి చదివారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement