Paliset -2016
-
నేటి నుంచి పాలిసెట్ తుదివిడత కౌన్సెలింగ్
- రాష్ట్రవ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి - 6న సీట్లు కేటాయించనున్న సాంకేతిక విద్యామండలి సాక్షి, హైదరాబాద్: పాలిసెట్-2016 ర్యాంకర్లకు తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యామండలి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 21 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సర్టిఫికెట్ల పరిశీలనకు (తొలివిడతలో వెరిఫికేషన్ చేయించుకోని) అభ్యర్థులు హాజరుకావచ్చు. వీరితో పాటు మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరైనా ఏ కళాశాలలోనూ సీటు రాని అభ్యర్థులు, ఒకవేళ సీటు పొందినప్పటికీ కళాశాల లేదా కోర్సును మార్చుకోవాలనుకుంటున్న అభ్యర్థులు కూడా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులకు ఈ నెల 6న సాయంత్రం ఆరుగంటల తరువాత సీట్ల కేటాయింపు చేయనున్నట్లు కౌన్సెలింగ్ క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. తుదివిడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారు ఆయా కళాశాలల్లో ఈ నెల 8లోగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అందుబాటులో 25 వేల సీట్లు తుది విడత కౌన్సెలింగ్‌కు హాజరవుతున్న అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంకా 24,948 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 205 పాలిటెక్నిక్ కాలేజీల్లో 50,632 సీట్లుం డగా, తొలివిడత కౌన్సెలింగ్‌లో కేవలం 25,684 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిపోయిన సీట్ల భర్తీ నిమిత్తం తాజాగా తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియను సాంకేతిక విద్యామండలి ప్రారంభించింది. సప్లిమెంటరీ అభ్యర్థులకు అవకాశం లేనట్టే పాలిసెట్‌లో ర్యాంకులు పొంది టెన్త్ ఫెయిలైన అభ్యర్థులకు తుదివిడత కౌన్సెలింగ్‌లో అవకాశం లేకుండా పోయింది. వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఈ ఏడాది భారీగా సీట్లు మిగిలిపోవడంతో టెన్త్ సప్లిమెంటరీలో పాసైన అభ్యర్థులకు అవకాశమివ్వాలని తొలుత సాంకేతిక విద్యామండలి భావించినప్పటికీ.. సప్లిమెంటరీ ఫలితాల విడుదలలో విద్యాశాఖ నుంచి స్పష్టమైన సమాచారం అందలేదని తెలుస్తోంది. దీంతో రెండో విడత ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇబ్బంది కలగకూడదని భావించిన సాంకేతిక విద్యామండలి అధికారులు.. తాజాగా తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టారు. స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ నాటికి ఫలితాలు వస్తే టెన్త్ సప్లిమెంటరీలో పాసైన అభ్యర్థులకు పాలిటెక్నిక్‌లలో చేరేందుకు చివరి అవకాశం లభించనుంది. -
నేటినుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
మహబూబ్‌నగర్ విద్యావిభాగం/ వనపర్తిటౌన్: తెలంగాణ ప్రభుత్వ సాం కేతిక విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పాలిసెట్-2016 ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శుక్రవా రం నుంచి 28వ తేదీ వరకు వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ రవికాంత్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు వెబ్ఆప్షన్లు పెట్టుకోవచ్చన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు. తప్పనిసరి తీసుకురావాల్సినవి పాలిసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, టెన్త్ మార్కుల జాబితా, 4 నుంచి 10వ తరగతికి వరకు స్టడీ సర్టిఫికేట్, నివాస ధ్రువీకరణపత్రం, కుల, ఈ ఏడాది ఆదాయ ధ్రువీకరణపత్రాలు, ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. ఫీజు చెల్లింపు ఇలా.. అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన సందర్భంగా బీసీ, ఓసీ అభ్యర్థులు రూ. 500 ఫీజు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు, అర్బన్‌లోని బీసీలకు ఆదాయం రూ.2లక్షల లోపు ఆదాయం కలిగి ఉం డాలి. గ్రామీణప్రాంతాల్లోని బీసీలకు రూ.1.50లక్షల ఆదాయం కలిగి ఉండాలి. జిల్లాకేంద్రంలో.. జిల్లాలో మహబూబ్‌నగర్, వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ధ్రువీకరణపత్రాల పరిశీలన కొనసాగుతుందని ప్రిన్సిపాల్ రవీంద్రబాబు తెలిపారు. ఓసీ, బీసీ, ఎస్సీ విద్యార్థులు వనపర్తి, మహబూబ్‌నగర్‌లో ఎక్కడైనా హాజరుకావచ్చన్నారు. ఎస్టీ విద్యార్థులు మాత్రం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కోరారు. ఈనెల 23 నుంచి 30 వరకు ఆప్షన్ల నమోదుకు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. శుక్రవారం జరిగే ధ్రువీకరణపత్రాల పరిశీలనకు ఉదయం 9గంటలకు 1 నుంచి 7000 ర్యాంకు, 1.30గంటలకు 7001 నుంచి 14000 ర్యాంకు వరకు అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. -
పాలిసెట్‌లో 8 మందికి ఫుల్ మార్కులు
ఫలితాలు విడుదల చేసిన కడియం.. 82.57 శాతం ఉత్తీర్ణత సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్-2016లో 82.57 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ప్రవేశపరీక్షలో ఎనిమిది మంది విద్యార్థులు మొత్తంగా 120కి 120 మార్కులు సాధించడం విశేషం. మరో ఏడుగురు విద్యార్థులు 119 మార్కులు సాధించారు. పాలిసెట్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు. పాలిసెట్‌కు 1,27,972 మంది దరఖాస్తు చేసుకోగా.. ఏప్రిల్ 21న నిర్వహించిన పరీక్షకు 1,24,747 మంది హాజరయ్యారు. ఇందులో 1,03,001 మంది (82.57 శాతం) అర్హత సాధించారు. గతేడాది ఉత్తీర్ణత శాతం 72.88 శాతమే కావడం గమనార్హం. ఈసారి పరీక్షకు 80,123 మంది బాలురు హాజరుకాగా.. 64,784 మంది (80.86 శాతం) అర్హత సాధించారు. బాలికలు 44,624 మంది పరీక్ష రాయగా.. 38,217 మంది (85.64 శాతం) అర్హత సాధించారు. ఇక పాలిసెట్‌కు 20,922 మంది ఎస్సీ విద్యార్థులు, 12,366 మంది ఎస్టీ విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. వారంతా అర్హత సాధించడం గమనార్హం. పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడిన తరువాత ర్యాంకులు కేటాయిస్తామని కడియం వెల్లడించారు. ఈనెల 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని... 54 ప్రభుత్వ (11,560 సీట్లు), 169 ప్రైవేటు (46,520 సీట్లు) పాలిటెక్నిక్‌లలో కలిపి 58,080 సీట్లను భర్తీ చేస్తామని తెలిపారు. జూన్ 9వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. విద్యార్థులు polycetts.nic.in, www.dte.telangana. gov.in, www.sbtet.telangana.gov.in, www.sakshieducation.com వెబ్సైట్ల నుంచి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. వెబ్సైట్లో ఓఎంఆర్ జవాబు పత్రాలు స్కాన్ చేసిన ఓఎంఆర్ జవాబు పత్రాలను తమ వెబ్సైట్ (https://polycetts.nic.in)లో అందుబాటులో ఉంచినట్లు సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. విద్యార్థులు వాటిని చూసుకోవచ్చని పేర్కొన్నారు. టాపర్లలో ఐదుగురు ఏపీ వారే.. తెలంగాణ పాలిసెట్‌లో వంద శాతం మార్కులు సాధించిన విద్యార్థుల్లో ఐదుగురు రాజమండ్రికి చెందిన వారే ఉన్నారు. మిగతా ముగ్గురు తెలంగాణ జిల్లాలకు చెందిన వారు. రాష్ట్ర విభజన చట్టం నిబంధనల ప్రకారం తెలంగాణలోని విద్యా సంస్థల్లో 15 శాతం ఓపెన్ కోటా సీట్లలో ప్రవేశాలు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా అర్హులే. దీంతో పలువురు ఏపీ విద్యార్థులు తెలంగాణ పాలిసెట్ రాశారు. ముఖ్యంగా ఉత్తమ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీగా పేరున్న వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్‌లో ప్రవేశాల కోసం ఏపీ విద్యార్థులు పాలిసెట్ రాస్తుంటారు. ఈసారి 120 మార్కులు సాధించిన వారిలో రిత్విక్ తేజ నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన విద్యార్థి, భరత్‌కుమార్ వరంగల్ జిల్లా తొర్రూరుకు చెందిన విద్యార్థి. హనుమంతు శ్రీలేఖ స్వస్థలం మెదక్ జిల్లా సంగారెడ్డి. మిగతా ఐదుగురు ధర్మతేజ, సాయి సీతారామ హరీశ్, అఖిల్, సత్యసాయి భూషణ్, శ్రీసిద్ధి రాజమండ్రికి చెందిన వారే. వీరంతా అక్కడి విద్యాసంస్థల్లో పదో తరగతి చదివారు. -
ఏప్రిల్ 21న పాలీసెట్-2016
ఈ నెల 8న నోటిఫికేషన్ విడుదల: సాంకేతిక విద్యా డెరైక్టర్ ఎంవీరెడ్డి సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశంకోసం నిర్వహించే పాలీసెట్-2016 ఏప్రిల్ 21న జరగనుందని సాంకేతిక విద్యా డెరైక్టర్ ఎంవీ రెడ్డి శనివారం ప్రకటించారు. పాలీసెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 8న విడుదల చేస్తామని, టెన్త్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గతంలో ఉన్న రూ.330 దరఖాస్తు ఫీజును ఈ ఏడాది రూ.165కు తగ్గించామన్నా రు. polycetts.nic.in వెబ్సైట్ ద్వారా సమీప పాలిటెక్నిక్ సహాయ కేంద్రాలు లేదా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీ ఆన్లైన్ కేంద్రాల నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 21 నుంచి పరీక్షలు: పాలిటెక్నిక్ వార్షిక పరీక్షలు మార్చి 21నుంచి ప్రారంభం కానున్నాయని ఎంవీరెడ్డి తెలిపారు. ఈ సారి పరీక్షల నిర్వహణలో పలు సంస్కరణలు తెచ్చామని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వెసులుబాటు కల్పిస్తూ ఫస్టియర్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని సరళీకరించామన్నారు. దీనిద్వారా విద్యార్థులు జవాబులను వ్యాసరూపంలో కాకుండా సంక్షిప్త రూపంలో రాసేందుకు సలువవుతుందన్నారు.పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను అరికట్టడంకోసం ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ప్రైవేటు పాలిటెక్నిక్‌లలోని పరీక్షహాళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించామన్నారు. పాలిటెక్నిక్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాక ఒకటి లేదా 2 సబ్జెక్టుల్లో మాత్రమే ఫెయిలైన విద్యార్థులకు మొదటిసారిగా ఇన్స్టంట్ పరీక్షలను నిర్వహించబోతున్నట్లు ఎంవీరెడ్డి తెలిపారు.