ఇంటర్మీడియట్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ లెక్చరర్లు
నాంపల్లి: అకారణంగా తొలగించిన తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్లు మంగళవారం ఇంటర్మీడియట్ కమిషనరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే... 2016–17 విద్యా సంవత్సరానికి గాను 135 కొత్త కాంట్రాక్టు పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబందించి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ మార్చి 27న గైడ్ లైన్స్ విడుదల చేశారు. ఇందులో 2016–17 విద్యా సంవత్సరంలో రెండు నెలల పాటు పనిచేసి మిగులు దామాషా ప్రకారం పక్కన ఉంచిన 16 మందిని ఈ నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా భర్తీ చేయాలనే ప్రతిపాదనను ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి పంపారు.
కాగా గతంలో కమిషనర్ వాణీ ప్రసాద్ ఇచ్చిన గైడ్‌లైన్స్ కాదని కొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేయడంతో తాము రోడ్డున పడతామంటూ పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం 16 మంది బాధిత కాంట్రాక్టు లెక్చరర్లు నాంపల్లిలోని కమిషనరేట్‌కు వచ్చారు. మధ్యాహ్నం శంకర్‌లాల్, నరేందర్‌రెడ్డి, జానీ పాష, రాధిక, హరిత, రమ్య పెట్రోలు బాటిల్స్ తీసుకుని కార్యాలయ భవనంపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ లాల్ అనే వ్యక్తి పెట్రోల్ మీద పోసుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కిందకు తీసుకువచ్చారు. మీకు న్యాయం చేసే విధంగా అధికారులతో చర్చిస్తామంటూ కమిషనర్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అయితే చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఏసీపీ భిక్షంరెడ్డి, బేగంబజార్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస రావులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కొంత సమయం కావాలని కోరారు. ఐదు రోజుల్లో తమకు న్యాయం జరిగేలా చూడాలని, జి.ఓ నెం.324లో తమను చేర్చాలని బాధితులు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment