
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా మరో 29 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ఏర్పాటుకు అవసరమైన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే కేంద్రం 5 పాలిటెక్నిక్‌ల ఏర్పాటుకు ఓకే చెప్పగా, మరో 24 పాలిటెక్నిక్‌లకు అనుమతుల కోసం సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 58 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు ఉండగా, అసలు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు లేని 5 జిల్లాల్లో కొత్త పాలిటెక్నిక్ కాలేజీల మంజూరు కోసం సబ్మిషన్ పథకం కింద కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది.
ఒక్కో పాలిటెక్నిక్ భవన నిర్మాణం, లైబ్రరీ, ఫర్నిచర్, వాహనాలు, ఇతర సదుపాయాల కల్పనకు కేంద్రం రూ.12.30 కోట్లను ఇవ్వనుంది. నిర్వహణ ఖర్చులు, వేతనాలు ఇతరత్రా అవసరాలకు సంబంధించి మరో రూ.8 కోట్ల వరకు రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. కాగా, మూడు కంటే తక్కువ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్న 20 జిల్లాల్లోని 24 ప్రాంతాల్లో కొత్త పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త పాలిటెక్నిక్‌లకు సంబంధించిన అనుమతులు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి లభిస్తాయని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాత్కాలిక భవనంలో ముందుగా కాలేజీలను ఏర్పాటు చేసి, రెండేళ్లలోపు వాటి భవన నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరంనాటికి వాటిని ప్రారంభించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 11,702 సీట్లు అందుబాటులో ఉండగా, ఈ కొత్త కాలేజీలు వస్తే ఒక్కో కాలేజీలో అదనంగా 180 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 16 వేలు దాటనుంది. ఇక భవిష్యత్తులో నియోజకవర్గానికి ఒకటి చొప్పున పాలిటెక్నిక్‌లు ఏర్పాటు చేసే ప్రతిపాదనల్లో భాగంగా మరో 32 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను ఏర్పాటు చేసే దిశలో సర్కారు ఆలోచనలు చేస్తోంది.
నియోజకవర్గానికి ఒకటిపై కసరత్తు..
రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుపై సాంకేతిక విద్యాశాఖ దృష్టి సారించింది. వీటికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పారిశ్రామిక రంగ లెక్కల ప్రకారం ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌కు ముగ్గురు పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లు ఉండాలి.
ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. ముగ్గురు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఒక పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ను ప్రారంభిస్తామని గతంలో పేర్కొంది. ఇందులో భాగంగా సాంకేతిక విద్యాశాఖ రూపొందిస్తున్న తెలంగాణ –2024 విజన్ డాక్యుమెంటులో వీటి ఏర్పాటును ప్రతిపాదిస్తోంది.
కేంద్రం ఓకే చెప్పిన ఐదు పాలిటెక్నిక్‌లు..
జిల్లా ప్రతిపాదిత ప్రాంతం
కొమురంభీం ఆసిఫాబాద్ సిర్పూర్ (యూ)
పెద్దపల్లి రామగుండం
నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్
కామారెడ్డి జుక్కల్
మహబూబాబాద్ మహబూబాబాద్
Comments
Please login to add a commentAdd a comment