
కోదాడ: రాసుకున్నోళ్లకు రాసుకున్నంత.. అన్నట్టుగా మారింది.. కోదాడలోని పాలిటెక్నిక్ పరీక్షల వ్యవహారం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాల్సిన కళాశాలల యా జమాన్యాలే అడ్డదారులు తొక్కుతున్నాయి. పరీక్షల విధులను నిర్వహించడానికి ఇతర కళాశాలల నుంచి వస్తున్న ఇన్విజిలేటర్లను పరీక్షహాళ్లోకి వెళ్లనీయకుండా తమ వారిని పంపించడం, వినని వారిని కరెన్సీతో మ్యానేజ్ చేయడం లేదంటే బెదిరించడం పరిపాటిగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోదాడలో సుమారు 5 వేల మంది విద్యార్థులు పాల్‌టెక్నిక్ పరీక్షలు రాస్తున్నారు. కొన్ని కళాశాలలు పాస్ గ్యారెంటీ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.4 నుంచి 5 వేలు వసూలు చేస్తున్నారని తెలిసింది.
వచ్చి కూర్చొని .. ఇచ్చింది తీసుకు వెళ్లండి...
అక్టోబర్ 25 నుంచి పాలిటెక్నిక్ ప్రథమ, ద్వితీయ, అక్టోబర్ 26 నుంచి తృతీయ సంవత్సర సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. సెల్ఫ్ సెంటర్‌లో పరీక్షలు జరుగుతుండడంతో కళాశాలల యాజమాన్యాలు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఇన్విజిలేషన్ విధులకు వస్తున్న ఇతర కళాశాలల అధ్యాపకులకు డ్యూటీలు వెయ్యడం లేదని సమాచారం. వచ్చిన వారిని కూర్చోబెట్టి తమ కళాశాలవారికే డ్యూటీలు వేసుకుని జోరుగా మాస్ కాపీయింగ్‌ను జరుపుతున్నారని కొందరు అధ్యాపకులే ఆరోపిస్తున్నారు. దీనికోసం రెండు కళాశాలలు విద్యార్థుల నుంచి డబ్బుల వసూలుకు తెరలేపినట్టు తెలుస్తోంది. మాట వినని ఇన్విజిలేటర్లకు భారీగా ముట్టజెపుతున్నారు. ఒక రోజు డ్యూటీ చేస్తే రెండు మూడు వందలు ఇస్తారు. కాని కొన్ని కళాశాలలు తాము చెప్పినట్లు వింటున్న ఇతర కళాశాలల అధ్యాపకులకు ఒక్క రోజు డ్యూటీకి ఐదు వేల రూపాయలను ముట్టజెపుతున్నారని సమాచారం. వచ్చి కూర్చొని ఇచ్చింది తీసుకువెళ్లండని, మాట వినని వారిని ఘాటుగా బెదిరిస్తున్నట్లు కొందరు మహిళా అధ్యాపకులు వాపోతున్నారు.
అన్నీ మేనేజ్
పాలిటెక్నిక్ పరీక్షల నిర్వహణ సీసీ కెమెరాల నడుమ పకడ్బందీగా నిర్వహించే ఏర్పాట్లు చేసినా వాటిని కూడా ఏమార్చి తమ దందా సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాస్ కాపియింగ్ జరగకుండా చూడాల్సిన స్క్వా డ్‌లు అతిథుల వలె వచ్చిపోతున్నారని అధ్యాపకులే అంటున్నారు. పాస్ గ్యారెంటీ స్కీంలో భాగంగా జరుగుతున్న ఈ తంతంగంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
అవకాశంగా మారిన పరీక్షల విధానం
గతంలో సెల్ఫ్ సెంటర్లతో పాలిటెక్నిక్ పరీక్షలను నిర్వహించేవారు. దీంతో కళాశాలలు అడ్డదారులు తొక్కుతున్నాయనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర సాంకేతిక విద్య అధికారులు ఒక కళాశాల విద్యార్థులను మరో కళాశాలకు మార్చి పరీక్షలు నిర్వహించారు. దీంతో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకపోవడం పాస్ పర్సెంటేజీ గణనీయంగా తగ్గిపోయింది. దీంతో పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరే వారు తగ్గి పోతుండడంతో కంగుతిన్న కళాశాలలు తెర వెనుక లాబీయింగ్ జరిపి ఈ సారి ఆ విధానాన్ని ఎత్తి వేయించాయి. విద్యార్థులను మార్చకుండా ఏ కళాశాల విద్యార్థులు అదే కళాశాలలో పరీక్షలు రాసే విధంగా పాత విధానాన్నే తిరిగి తెరమీదకు తెచ్చారు. కాక పోతే పరీక్షల నిర్వహించే ఇన్విజిలేటర్లను మాత్రం ఒక కళాశాల వారిని మరో కళాశాలకు మార్చారు.
Comments
Please login to add a commentAdd a comment