ఖమ్మంకల్చరల్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంసెట్ కౌన్సెలింగ్ ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం తొలిరోజు నుంచే ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లింపునకు అవకాశం ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ 28వ తేదీ నుంచి ప్రారంభమై.. అదేరోజు కళాశాలలు, సీట్ల కోసంవెబ్ కౌన్సెలింగ్ కొనసాగుతుంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని అధికారులు పేర్కొంటున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు కలుపుకొని సుమారు 5వేల మందికిపైగా విద్యార్థులు వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొంటారని అంచనా వేసిన అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొత్తగూడెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
షెడ్యూల్ ఇలా..
ఈనెల 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ అదేరోజు నుంచి జూన్ 5వ తేదీ వరకు కొనసాగుతుంది. విద్యార్థులకు సీట్లను జూన్ 8వ తేదీన కేటాయిస్తారు. ఫీజు చెల్లింపు, కళాశాలల్లో రిపోర్టింగ్ జూన్ 8వ తేదీ నుంచి 12వ తేదీలోగా చేయాల్సి ఉంటుంది.
ర్యాంకులవారీగా...
మే 28వ తేదీన ఒకటో ర్యాంకు నుంచి 10వేల ర్యాంకు, మే 29న 10,001వ ర్యాంకు నుంచి 25వేల ర్యాంకు, మే 30న 25,001వ ర్యాంకు నుంచి 40వేల ర్యాంకు, మే 31న 40,001వ ర్యాంకు నుంచి 54వేల ర్యాంకు, జూన్ 1న 54,001వ ర్యాంకు నుంచి 68వేల ర్యాంకు, జూన్ 2న 68,001 నుంచి 82వేల ర్యాంకు, జూన్ 3న 82,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు పొందిన విద్యార్థుల వరకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసేందుకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న రెండు కళాశాలల్లో కోఆర్డినేటర్లను నియమించారు. ఆయా కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందితోపాటు అదనంగా మరికొందరు కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్‌సోర్సింగ్ పద్ధతిన నియమించారు.
సమర్పించాల్సిన పత్రాలు
కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్, ర్యాంకు కార్డు, పదో తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు, ఆరు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఆదాయ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, ఇంటర్ టీసీతో హాజరుకావాల్సి ఉంటుంది. పీహెచ్‌సీ, ఎన్‌సీసీ, సీఏపీ కోటాకు చెందిన విద్యార్థులు మాత్రం హైదరాబాద్‌లోని ఎస్‌వీ భవన్, మాసబ్ ట్యాంక్ ఏరియాలో జరిగే కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరుకావాల్సి ఉంటుంది.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
సోమవారం నుంచి జరిగే ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గతంలో పనిచేసిన అనుభవంతో ఎలాంటి అక్రమాలు, తప్పిదాలు జరగకుండా ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తాం. కౌన్సెలింగ్ కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యమైనా విద్యార్థులు సహకరించాలి.
– కె.సుదర్శన్‌రెడ్డి,
ఖమ్మం జిల్లా ఎంసెట్ కోఆర్డినేటర్
Comments
Please login to add a commentAdd a comment