పాలిటెక్నిక్ అభ్యర్థులూ అర్హులే
Published Fri, Jul 22 2016 12:14 PM | Last Updated on Tue, Mar 19 2019 5:57 PM
పీసీ దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనవచ్చు
వెల్లడించిన ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్
ఆదిలాబాద్ : కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన పాలిటెక్నిక్ ఉత్తీర్ణ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అనుమతి లభించినట్లు ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. గురువారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో ఏడో రోజు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలను ఆయన పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ, పాలిటెక్నిక్ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు నుంచి ఉత్తర్వులు అందినట్లు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ విద్యార్హత ఉన్నవారికి దేహదారుఢ్య పరీక్షలకు అనుమతి రాకపోవడంతో ఇటీవల జరిగిన ఎంపికలో తిరస్కరణకు గురైనట్లు తెలిపారు. ప్రసుత్తం అనుమతి లభించడంతో మూడు నాలుగు రోజుల్లో పాలిటెక్నిక్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని, ఇందుకోసం వారికి ఫోన్ ద్వారా సమాచారం తెలపాలని జిల్లా పోలీసు కార్యాలయం అధికారులు ఎంఏ జోసెఫిన్, జి.ప్రదీప్‌కుమార్‌లకు ఆదేశాలు జారీ చేశారు. పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్మీడియట్‌కు సరిసమానమని రాష్ట్రస్థాయి పోలీసు అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.
501 మంది అర్హత
జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో కొనసాగుతున్న పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో గురువారం 501 మంది పురుష, మహిళ అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఎస్పీ తెలిపారు. 1200 మంది అభ్యర్థుల్లో 816 మంది పురుషులు హాజరుకాగా, 408 మంది అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. అలాగే మహిళల్లో 109 మంది హాజరుకాగా, 93 మంది అర్హత సాధించారని తెలిపారు. కాగా, దేహదారుఢ్య పరీక్షల పర్యవేక్షణలో జిల్లా అదనపు ఎస్పీ జీఆర్ రాధిక, ఉట్నూర్, ఆదిలాబాద్, కాగజ్‌నగర్, భైంసా, నిర్మల్ డీఎస్పీలు ఎస్.మల్లారెడ్డి, ఎ.లక్ష్మీనారాయణ, ఎండీ హబీబ్‌ఖాన్, అందె రాములు, టి.మనోహర్‌రెడ్డి, సీసీఎస్ డీఎస్పీ కె.నర్సింహారెడ్డి, శిక్షణ కేంద్రం డీఎస్పీ కె.సీతారాములు, పోలీసు కార్యాలయ అధికారులు డి.పుష్పరాజ్, ఎంఏ జోసెఫ్, ఆర్.భారతి, యూనుస్ అలీ, సులోచన, పద్మవతి, శ్రవంతి, మనిలా, దయానంద్, జగదీశ్, సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, పాల్గొన్నారు.
Advertisement
Advertisement