
పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య
- కడపలో విద్యాభ్యాసం
- స్వగ్రామంలో బలవన్మరణం
గుత్తి రూరల్ : గుత్తి రూరల్ మండలం బేతాపల్లికి చెందిన మరియమ్మ, సుంకన్న దంపతుల కుమార్తె సురేఖ(17) బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సురేఖ కడపలో పాలిటెక్నిక్ చదువుతోంది. అక్కడే హాస్టల్లో ఉండేది. అయితే తరచూ కడుపునొప్పితో బాధపడేది. పలు ఆస్పత్రుల్లో చూపించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో విష ద్రావకం తాగినట్లు వివరించారు.
అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే 108లో గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమెను మెరుగైన వైద్యం కోసం కర్నూలు పెద్దాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎంత పని చేశావమ్మా..
‘పొద్దున కరువు పనికి కూడా పోయెస్తివి కదమ్మా.. అంతలోనే మందు తాగి ఎంత పని చేశావమ్మా’ అంటూ ఆస్పత్రి వద్ద సురేఖ తల్లి, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంట్లో ఖాళీగా ఉండలేక పనికి పోతూ, మాకు అండగా ఉంటివి కదమ్మా.. దేవుడా ఎందుకయ్యా ఇంత పెద్ద శిక్ష విధించావు. ఇక మా కడుపుకోత తీరేదెట్టయ్యా.. అంటూ తల్లి మరియమ్మ గుండెలు పగిలేలా రోదించడం కలచివేసింది.