బిడ్డలా చూసుకుంటానన్నారు..! | Akhil Parents fired on College Principal | Sakshi
Sakshi News home page

బిడ్డలా చూసుకుంటానన్నారు..!

Published Tue, Nov 21 2017 10:54 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM

Akhil Parents fired on College Principal - Sakshi - Sakshi

విలపిస్తున్న మృతుని తల్లి, సోదరుడు, మేనమామ,సంగమానికి కొట్టువచ్చిన అఖిల్‌ మృతదేహం

కాజేజిలో చేర్పించేటప్పుడు కన్నబిడ్డలా చూసుకుంటామని ప్రిన్సిపాల్‌ చెప్పాడయ్యా.. నిన్ననగా చనిపోతే ఇంత వరకూ యాజమాన్యం వారు వచ్చిన పాపాన లేదు. ఐదొందల కిలోమీటర్ల నుంచి వచ్చి కాలేజీలో చేర్పిస్తే విగత జీవిగా తీసుకెళ్లాల్సి వస్తుందని సాగరసంగమం వద్ద విద్యార్థి అఖిల్‌ కుమార్‌ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

అవనిగడ్డ: శ్రీకాకుళం జిల్లా రాగోలుకు చెందిన ముగడ అఖిల్‌కుమార్‌(16)ని నాగాయలంకలోని అంజని వెటర్నరరీ పాలిటెక్నిక్‌ కళాశాలలో రెండు నెలల క్రితం చేర్పించారు. 16 మంది మిత్రులతో సాగరసంగమానికి ఆదివారం వెళ్లారు. బీచ్‌లో స్నానం చేస్తూ గల్లంతవ్వగా, సోమవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. తోటి విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కనకరత్నం, సూర్యారావు ఉద యం 11 గంటలకు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. అప్పటి నుంచి సాయంత్రం 5.30 వరకు కాలేజీ యాజమాన్యం ఎవరూ ప్రమాద వివరాలు తెలుసుకునేందుకుగానీ,  పరామర్శించేందుకు గా నీ రాలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చేర్చుకునేటప్పుడు మీ పిల్లాడిని నా సొంత బిడ్డలా చూసుకుంటానని ప్రిన్సిపాల్‌ చెప్పారని, బిడ్డ శవాన్ని అప్పగించారని తల్లి కనకరత్నం కన్నీటి పర్యాంతమైంది. మా పిల్లాడిని చేర్పించేటప్పుడు మా ఫోన్‌ నంబర్లు తీసుకున్నారని, ఈ ఘటన జరిగాక ఇంతవరకూ కాలేజీ నుంచి ఎవరూ ఫోన్‌ చేయలేదని, అడగడానికి మేము ఫోన్‌ చేస్తే వస్తున్నామని చెబుతున్నారే గానీ రాలేదని మృతుని తల్లి  ఆవేదన వ్యక్తం చేసింది.

యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
అంజిని వెటర్నరీ కళాశాల అని చెబితే చేర్పించామని, అక్కడ కాలేజీకి ఆ పేరే లేదని, మారుతి పాలిటెక్నిక్‌ కళాశాల అని ఉందని, ఈ కాలేజికి గుర్తింపు ఉందోలేదో కూడా అర్థం కావడం లేదని, ఇక్కడ కూడా మమ్మల్ని మోసం చేశారని మృతుడి మేనమామ తాలాబత్తుల సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌కు ఫోన్‌  చేస్తే మాకేమీ తెలియదు, చెప్పకుండా వెళ్లారని సమాధానం చెబుతున్నారని, హెచ్‌ఓడీతో కలసి వెళ్లినట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారని చెప్పారు. కళాశాలలో చదివే విద్యార్థి చనిపోతే కనీసం చూడటానికి రాలేదని, మమ్మల్ని మోసం చేసి మా బిడ్డ ఉసురు తీసిన కళాశాల యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి కనకరత్నం డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు రాయపూడి వేణుగోపాలరావు, సిద్దినేని అశోక్, లేబాక శ్యాం, పద్యాల వెంకట ప్రసాద్, బండ్రెడ్డి హరి, మాలమహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి దోవా గోవర్ధనరావు, సీపీఐ మండల కన్వీనర్‌ నారేపాలెం శంకరరావు, వైఎస్సార్‌సీపీ  నాయకుడు గాజుల రాంబాబు (రాముడు) వైద్యశాలకు చేరుకుని మృతుడి తల్లిదండ్రులను పరామర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాలేజీ యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సంగమం వద్ద లభ్యమైనఅఖిల్‌ మృతదేహం
కోడూరు : హంసలదీవిలోని పాలకాయతిప్ప బీచ్‌ వద్ద ఆదివారం సాయంత్రం గల్లంతైన ముడుగ అఖిల్‌కుమార్‌ మృతదేహం సోమవారం సంగమం వద్ద లభ్యమైంది. సోమవారం తెల్లవారుజామునే 5.30 గంటల సమయంలో అఖిల్‌ మృతిచెంది సంగమానికి కొట్టుకువచ్చాడని ఎస్‌ఐ ఎస్‌ఐ వై.సుధాకర్‌ తెలిపారు. తండ్రి సూర్యారావు పిర్యాధు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement