
గుండెపోటుతో పాలిటెక్నిక్ విద్యార్థి మృతి
ఘట్‌కేసర్: పాలిటెక్నిక్ విద్యార్థి ఒకరు గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. నల్లగొండ జిల్లా, మేళ్లచెరువు మండలానికి చెందిన వెంకట్‌రెడ్డి, సరితా దంపతులు బతుకుదెరువు నిమిత్తం కొన్ని ఏళ్ల కిందట ఘట్‌కేసర్‌కు వలస వచ్చారు. ఇక్కడి మేధాకాలనీలో నివాసముంటూ జోడిమెట్ల వద్ద గల మేధా కంపెనీలో పనిచేస్తున్నారు. వీరి కుమారుడు అఖిల్ (19) మండల పరిధిలోని కొండాపూర్‌లో గల సంస్కృతి విద్యాసంస్థల్లో పాలిటెక్నిక్ (ఈసీ) డిప్లొమా మూడో సంవత్సరం చదువుతున్నాడు. ప్రతి రోజూ కళాశాలకు బస్సులో వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో గురువారం కూడా కళాశాలకు వెళ్లాడు.
మధ్యాహ్న సమయంలో వాంతులు చేసుకున్నాడు. అనంతరం ఛాతీలో నొప్పిగా ఉన్నట్లు చెప్పడంతో సహచరులు క ళాశాలకు చెందిన వాహనంలో ఘట్‌కేసర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం నగరంలోని సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. అఖిల్ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారన్నారు. మంచి మిత్రుడిని కోల్పోయినట్లు తోటి మిత్రులు కన్నీరు పెట్టుకున్నారు. కాగా.. అఖిల్ మృతిపై అతడి తండ్రి అ నుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మృతదేహంతో ఆందోళన
విద్యార్థి అఖిల్ మృతదేహంతో మండలపరిధిలోని సంస్కృతి విద్యాసంస్థల ఎదుట తల్లిదండ్రులు, మిత్రులు శుక్రవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మృతుడి తండ్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తన కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా అఖిల్ మృతి చెందాడని ఆరోపించారు. కళాశాలలో ఏదైనా జరిగి ఉంటేనే.. వాంతులు చేసుకుని ఉంటాడని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సమయంలో కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు శ్రీకాంత్, నరేష్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఆందోళన విరమిస్తారని సీఐ ప్రకాష్ తెలిపారు.