పాలిటెక్నిక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
తాడేపల్లిగూడెం రూరల్ : పెదతాడేపల్లిలోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలోని పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మరణించాడు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. తణుకు పట్టణానికి చెందిన మెకానిక్ మండల స్వామిజీరావు కుమారుడు మోహన శ్రీనివాస్ (17) పెదతాడేపల్లిలోని ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. రోజూలానే గురువారం కూడా కళాశాలకు వెళ్లాడు. సాయంత్రం ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కాలేజీ సెక్యూరిటీకి ఫోన్‌చేశారు. దీంతో వారు 6.20 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ కళాశాల భవనంపై నుంచి పడిపోయాడని, తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారని చెప్పారు. దీంతో శ్రీనివాస్ తండ్రి స్వామీజీరావు తన సోదరులతో కలిసి ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ శ్రీనివాస్ రెండు కాళ్లకు కట్లు కట్టి ఉన్నాయి. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో అతనిని ప్రైవేటు అంబులెన్సులో విజయవాడ తరలిస్తుండగా, మార్గమధ్యలో గన్నవరం వద్ద శ్రీనివాస్ మరణించాడు. ఈ మేరకు రూరల్ పోలీసులకు స్వామిజీరావు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు భవనంపై నుంచి పడిపోయాడా? లేదా మరేదైనా కారణంతో మరణించాడా అనేది దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. ఆయన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఎస్‌ఐ వి.చంద్రశేఖర్ దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు తెలిపారు.