సాక్షి, అమరావతి: యువతకు మంచి భవిష్యత్‌ను అందించాలనే ఆలోచనలను ఆచరణలో పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.100 కోట్లతో 3 పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్ సోమవారం గెజిట్ విడుదల చేశారు. ఈ వివరాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, వైఎస్సార్ జిల్లా మైదుకూరుల్లో పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, మెటలర్జికల్ విభాగాల్లో డిప్లొమా కోర్సుల కోసం సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ యువతకు మరింత వెసులుబాటు ఉంటుందన్నారు.
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ మరింత మెరుగుపడి విద్య పూర్తవగానే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని తెలిపారు. మంజూరైన 3 పాలిటెక్నిక్ కాలేజీల్లో ఒకదాన్ని రూ.30 కోట్లతో తన నియోజకవర్గం డోన్ పరిధిలోని బేతంచెర్లలో ఏర్పాటు చేస్తుండటం పట్ల సీఎం వైఎస్ జగన్‌కు బుగ్గన రాజేంద్రనాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు. 3 కాలేజీలను వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికే కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.
చదవండి: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment