ఉన్నతంగా మారుద్దాం | AP Government Will Reopen Colleges In October 2020 | Sakshi
Sakshi News home page

ఉన్నతంగా మారుద్దాం

Published Fri, Aug 7 2020 5:00 AM | Last Updated on Fri, Aug 7 2020 7:39 AM

AP Government Will Reopen Colleges In October 2020 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన తదితర పథకాల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఉన్నత విద్యలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను 90 శాతానికి చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నాలుగేళ్ల ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సుల్లో కూడా అప్రెంటిస్‌షిప్‌ ఉంటుందని, ఈ నాలుగేళ్లలోనే 20 అదనపు క్రెడిట్స్‌ సాధించిన వారికి బీటెక్‌ ఆనర్స్‌ డిగ్రీ వస్తుందని సీఎం జగన్‌ తెలిపారు. విద్యార్థి అదే విభాగంలో ఈ క్రెడిట్స్‌ సాధిస్తే ఆనర్స్‌ అడ్వాన్స్‌డ్‌ అని వ్యవహరిస్తారు. వేరే విభాగంలో క్రెడిట్స్‌ సాధిస్తే ఆనర్స్‌ మైనర్‌ అని పేర్కొంటారు.

యూనివర్సిటీల్లో 1,100 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల ఖాళీల భర్తీకి  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సీఎం జగన్‌  అక్టోబర్‌ 15 నుంచి కాలేజీలు పునఃప్రారంభమవుతాయని ప్రకటించారు. కాలేజీలు తెరిచిన తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. సెప్టెంబర్‌లో సెట్ల నిర్వహణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఉన్నత విద్యా రంగంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. కాలేజీల్లో కూడా నాడు–నేడు కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ పూర్తి చేయాలని సీఎం సూచించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. 

32.4 నుంచి 90 శాతానికి పెరగాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన ద్వారా ఉన్నత చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నందున కచ్చితంగా గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో పెరగాలి. దీన్ని ఇప్పుడున్న 32.4 శాతం నుంచి 90 శాతానికి తీసుకెళ్లాలి.

అడ్మిషన్ల సమయంలోనే ఐచ్ఛికం
మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటిస్‌షిప్‌ను చేర్చాం. దీనికి అదనంగా ఒక ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ కూడా ఉంటుంది. ఇవి నేర్చుకుంటేనే డిగ్రీ ఆనర్స్‌గా పరిగణిస్తాం. అదనంగా ఏడాది అనేది విద్యార్థి ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. అడ్మిషన్ల సమయంలోనే సాధారణ డిగ్రీ కావాలా? ఆనర్స్‌ డిగ్రీ కావాలా? అన్న దానిపై ఐఛ్చికాన్ని తీసుకుంటాం. 

బీటెక్‌లో కూడా..
బీటెక్‌ డిగ్రీలకు సంబంధించి 4 ఏళ్లలో కూడా తప్పనిసరి అప్రెంటిస్‌షిప్‌ ఉంటుంది. అదనంగా 20 క్రెడిట్స్‌ సాధించిన వారికి ఆనర్స్‌ డిగ్రీ వస్తుంది

వైద్య కళాశాలలకు రూ.6 వేల కోట్లు
పాత మెడికల్‌ కాలేజీలను మరమ్మతు చేసి నాడు– నేడు కార్యక్రమాల కోసం రూ.6 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం విద్యా రంగం మీద దృష్టి పెట్టింది కాబట్టి  వీటి గురించి ఆలోచిస్తోంది.

ఆ దుస్థితికి కారణం...
ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో సెల్‌ఫోన్‌ వెలుగులో ఆపరేషన్లు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎలుకలు కొరికి శిశువు చనిపోయే దుస్థితి ఎందుకు దాపురించింది? జనరేటర్లు పని చేయని పరిస్థితి ఎందుకు వచ్చింది?

తెలుగు, సంస్కత అకాడమీల ప్రారంభానికి గ్రీన్‌ సిగ్నల్‌
తెలుగు, సంస్కృత అకాడమీల ప్రారంభానికి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అరకులో ప్రభుత్వ ఆధ్వర్యంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకారం తెలిపారు. కచ్చితమైన నిధుల కేటాయింపుతో మూడు నాలుగేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. కర్నూలులో క్లస్టర్‌ యూనివర్సిటీ, కడపలో ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

వర్సిటీల్లో 1,100 పోస్టుల భర్తీకి ఆమోదం
► యూనివర్సిటీల్లో దాదాపు 1,110 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు.
► సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌చంద్ర, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement