తొలి దశలో 165 మంది
- దశలవారీగా పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ
- 165 మందికి ఈ నెల 11న సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలే జీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీ కరణకు సాంకేతిక విద్యాశాఖ కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే క్రమబద్ధీకరణ ఫైలును ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. మరోవైపు క్లియర్ వేకెన్సీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ఈ నెల 11న సాంకేతిక విద్యా కమిషనర్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. సాంకేతిక విద్యా కమిషనర్ ఓఎస్‌డీ, హైదరాబాద్ ఆర్‌జేడీ, సంబంధిత ఏడీలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు కమిటీని ఏర్పాటు చేసింది. క్రమబద్ధీకరణను దశల వారీగా చేపట్టాలని నిర్ణయించింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 457 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తుండగా, మొదటి దశలో క్లియర్ వేకెన్సీల్లో పనిచేస్తున్న 165 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీకరణను చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఆ 165 మంది కాంట్రాక్టు లెక్చరర్ల జాబితాను పంపించింది. మిగతా పోస్టులను ప్రభుత్వం క్రియేట్ చేసి, ఉత్తర్వులు జారీ చేశాక మిగిలిన వారిని క్రమబద్ధీకరించాలని భావిస్తోంది. మరోవైపు జహీరాబాద్, వనపర్తి, మాసబ్‌ట్యాంకు, రామంతాపూర్, బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీల్లో పని చేస్తున్న వారిలో ఐదుగురు కాంట్రాక్టు లెక్చరర్లు స్థానికేతరులుగా గుర్తించింది. వారి నియామకం ఓపెన్ కోటాలో జరిగితే దానిని పరిగణనలోకి తీసుకొని క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టనుంది.