పాలిసెట్ గడువు పొడిగింపు
♦ సోమవారం వరకు దరఖాస్తుల స్వీకరణ
♦ 268 కేంద్రాల్లో 21న పరీక్ష
♦ పరీక్ష నిర్వహణకు తొలిసారి జీపీఎస్ టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) నిర్వహించే పాలిసెట్-2016 దరఖాస్తు గడువును ఒక రోజు పొడిగించారు. వాస్తవానికి ఆదివారంతో గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ వరుస సెలవులు వచ్చిన నేపథ్యంలో అభ్యర్థుల సౌకర్యార్థం సోమవారం వరకు గడువు పొడిగించినట్లు సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీ రెడ్డి శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షకు శనివారం వరకు మొత్తం 1,03,400 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 268 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు.
ఈ నెల 21న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష ముగిశాక రెండు రోజుల్లోగా ‘కీ’ విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరిస్తారు. మే 3న ఫలితాలతోపాటు తుది ‘కీ’ని కూడా విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాలిసెట్‌లో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 54 ప్రభుత్వ, 166 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో నిర్వహించే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆయా కాలేజీల్లో మొత్తం 58,880 సీట్లున్నాయి. పాలిసెట్ ద రఖాస్తుల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లా నుంచి ఇప్పటివరకు 21,901 దరఖాస్తులు అందగా, రంగారెడ్డి జిల్లా నుంచి 6,424 దరఖాస్తులు అందినట్లు తెలిసింది. మిగిలిన జిల్లాల్లోనూ గతేడాది కంటే ఈ ఏడాది మంచి స్పందన లభిస్తోందని అధికారులు పేర్కొన్నారు.
ప్రప్రథమంగా జీపీఎస్ టెక్నాలజీ వినియోగం
పాలిసెట్-2016 పరీక్ష నిర్వహణలో ప్రప్రథమంగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) సాంకేతికతను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని పొందేందుకు పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28 ప్రాంతీయ కేంద్రాల నుంచి 268 పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తరలించే వాహనాలపై పటిష్ట నిఘా పెట్టనున్నారు. ఆయా వాహనాల కదలికలను హైదరాబాద్‌లోని ఎస్‌బీటీఈటీ కార్యాలయం నుంచే నేరుగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లోనూ అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రీజినల్ కోఆర్డినేటర్లకు ఎస్‌బీటీఈటీ ఆదేశాలు జారీచేసింది.