GPS technology
-
పోయిందనుకున్న స్కూటర్ పట్టించింది - ఓలా ఫీచర్.. అదిరిపోలా!
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో 'ఓలా' ఒకటి. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రారంభంలో కొన్ని సమస్యలకు గురైనప్పటికీ, ప్రస్తుతం మంచి సంఖ్యలో అమ్మకాలను పొందుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇందులో ఉన్న అప్డేటెడ్ ఫీచర్స్ అనే చెప్పాలి. ఇందులో ఆ ఫీచర్స్ ఇటీవల దొంగతనం సమయంలో కూడా గుర్తించడానికి సహాయపడ్డాయి. నివేదికల ప్రకారం, జోధ్‌పూర్ ప్రాంతానికి చెందిన 'అంజలి పాల్' అనే మహిళ ఓలా స్కూటర్‌ను గుర్తుతెలియని దుండగులు దొంగలించి ప్యాకర్స్ అండ్ మూవర్స్ సహాయంతో వేరే నగరానికి పంపించాలి నిర్చియించుకుని దానిని పూర్తిగా ప్యాక్ చేసి ఉంచారు. అయితే స్కూటర్ పోగొట్టుకున్న అంజలి తన ఎలక్ట్రిక్ స్కూటర్లోని జిపిఎస్ నావిగేషన్ ద్వారా పోలీసుల సహాయంతో పట్టుకుంది. స్కూటర్ దొంగిలించబడిన తర్వాత అది ఎక్కడ ఉందో కనిపెట్టడానికి ఓనర్ లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగానే అంజలి పాల్ తన స్కూటర్ కనిపెట్టగలిగింది. దీనికి కంపెనీ కూడా సహాయం చేసినట్లు తెలుస్తోంది. జోధ్‌పూర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్‌లో ఈ స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఆధునిక ఫీచర్స్ అందిస్తుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నిజానికి దొంగల భారీ నుంచి రక్షించుకోవడానికి కార్లలో, బైకులలో యాంటీ తెఫ్ట్ అలారం వంటివి అందిస్తారు. దీనితో పాటు నావిగేషన్ అందుబాటులో ఉన్నప్పుడు దొంగతనం జరిగిన తర్వాత కూడా కనిపెట్టడానికి సహాయపడుతుంది. (ఇదీ చదవండి: Boult Rover Pro: కేవలం రూ. 2499కే స్మార్ట్‌వాచ్: లేటెస్ట్ డిజైన్ & అంతకు మించిన ఫీచర్స్) లేటెస్ట్ వాహనాల్లో యాంటీ-థెఫ్ట్ అలారం వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నప్పటికీ దొంగిలించడానికి దొంగలు కూడా అధునాతన సాధనాలను ఉపయోగిస్తున్నారు. అలాంటి సమయంలో దొంగతనాలకు చెక్ పెట్టడానికి స్టీరింగ్ లాక్స్, గేర్ లాక్స్, వీల్ లాక్స్ & జిపిఎస్ ట్రాకర్స్ చాలా ఉపయోగాడతాయి. (ఇదీ చదవండి: సి3 కొత్త వేరియంట్ లాంచ్ చేసిన సిట్రోయెన్ - ధర ఎంతంటే?) గతంలో కూడా జిపిఎస్ లొకేషన్ అండ్ టెక్నాలజీ ద్వారా అనేక హై ఎండ్ కార్లు రికవరీ చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం ఓలా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు అలాంటి ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మాత్రమే పోయిన స్కూటర్ మళ్ళీ పొందగలిగారు. ఇది నిజంగా కంపెనీ కస్టమర్లకు అందించిన వరమనే చెప్పాలి. I GOT MY OLA SCOOTER BACK🥰 special thanks to @OlaElectric @ola_supports @bhash they provided us the ola location several times. And special thanks to the sub inspector @SulochanaJaat and rajendra sir posted in basani police station jodhpur @CP_Jodhpur @JdprRuralPolice https://t.co/qxH3AERtk1 pic.twitter.com/DnfYeylXLD — Anjali Pal (@anjalipal8477) April 13, 2023 -
జీపీఎస్ పెట్టినా వదల్లేదు.. ఫార్ములావన్ స్టార్‌కు చేదు అనుభవం
నాలుగుసార్లు ఫార్ములావన్ చాంపియన్ విజేత.. ఆస్టన్ మార్టిన్ ఎఫ్1 డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు చేదు అనుభవం ఎదురైంది. వెటెల్ బ్యాగును దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగలు ఎత్తుకెళ్లిన బ్యాగును వెటెల్ జీపీఎస్ ట్రాకర్ ద్వారా కనుక్కోవాలనుకున్నప్పటికి ఫలితం లేకుండా పోయింది. విషయంలోకి వెళితే.. స్పానిష్ గ్రాండ్ప్రిక్స్ ముగించుకొని బార్సిలోనాకు చేరుకున్న సెబాస్టియన్ వెటెల్ ఒకరోజు అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాడు. తన కారును హోటల్ ముందు పార్క్ చేసి లోనికి వెళ్లాడు. పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన వెటెల్‌కు కారులో బ్యాగు కనిపించలేదు. దీంతో దొంగలు ఎత్తుకెళ్లారని భావించిన వెటెల్.. బ్యాగులో తన ఐ ఫోన్ ఎయిర్ పాడ్స్‌కు జీపీఎస్ ట్రాకర్ ఉన్నట్లు గుర్తొచ్చింది. వెంటనే తన ఐ-ఫోన్లో జీపీఎస్ ఆన్ చేశాడు. జీపీఎస్ లొకేషన్ ఆధారంగా తన కారులోనే బయల్దేరిన వెటెల్ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దారి మధ్యలోనే సదరు దొంగలు తన ఐ ఫోన్ ఎయిర్ పాడ్స్ పడేయడంతో జీపీఎస్ అక్కడే ఆగిపోయింది. దీంతో వెటెల్ తన బ్యాగు జాడను తెలుసులేకపోయాడు. కాగా ఈ ఏడాది వెటెల్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తాజాగా ముగిసిన స్పానిష్ గ్రాండ్ప్రిక్స్ను వెటెల్ 11వ పొజిషన్‌తో ముగించాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 66 ల్యాప్‌ల రేసును వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 37 నిమిషాల 20.475 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో 27వ ల్యాప్‌లో వైదొలిగాడు. చదవండి: ICC: అంపైరింగ్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం Spanish Grand Prix: వెర్స్టాపెన్ ఖాతాలో నాలుగో విజయం -
జీపీఎస్ అటెండెన్స్ వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరికీ లేని సర్వీసు నిబంధనలు తమకెందుకని గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. మొబైల్ యాప్‌తో అటెండెన్స్ నమోదు, రోజంతా కార్యకలాపాలు, విధుల నిర్వహణపై జీపీఎస్ ద్వారా ట్రాకింగ్ ఎందుకని వాపోతున్నారు. సోమవారం నుంచి కొత్తగా అమల్లోకి తెచ్చిన జీపీఎస్ అటెండెన్స్‌ను పాటించలేమంటూ పర్మినెంట్ గ్రామ కార్యదర్శులతోపాటు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సైతం జిల్లా కలెక్టర్లు మొదలు పీఆర్ కమిషనర్, కార్యదర్శి, సీఎస్‌దాకా వినతిపత్రాలను ఇస్తున్నారు. ఉదయం 8:30 గంటలకే... ఉదయం 8.30 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామకార్యదర్శులు సెల్ఫీ దిగి కొత్త డీఎస్ఆర్ మొబైల్ పీఎస్ యాప్ ‘క్యాప్చర్ జీపీ లొకేషన్’ఆప్షన్ ద్వారా అటెండెన్స్ నమోదు చేయాలి. రోజుకు 12 గంటలకు పైబడి విధులు, కింది నుంచి పైస్థాయి వరకు పదిమంది దాకా బాస్‌లు, రోజూ వారడిగే నివేదికలు ఇలా అనేక బరువు బాధ్యతలతో పనిచేస్తున్న తమపై ఇప్పుడు జీపీఎస్ అటెండెన్స్ విధానాన్ని తీసుకురావడం సరికాదని అంటున్నారు. దీంతోపాటు రోజూ డీఎస్ఆర్ యాప్‌లో రోడ్లు, డ్రైన్లు తదితరాలతోపాటు పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, అవెన్యూ ప్లాంటేషన్, ఇంటింటి చెత్త సేకరణ వంటి ఐదు ఫొటోలు లైవ్‌లో అప్లోడ్ చేయాలి. జీపీఎస్ ద్వారా అటెండెన్స్ నమోదు చేశాకే డీఎస్ఆర్ యాప్‌లో మిగతా ఆప్షన్లు ఎంట్రీ చేయడానికి వీలవుతుంది. మాకెందుకు నాలుగేళ్ల ప్రొబేషన్ రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. దాదాపు మూడువేల మంది పర్మినెంట్ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు. రెండున్నరేళ్ల కింద ఏడున్నరవేల జూనియర్ పంచాయతీ సెక్రటరీలను (జేపీఎస్) నియమించారు. మరో రెండువేల మంది దాకా ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ జూనియర్ సెక్రటరీలు కూడా పనిచేస్తున్నారు. తొలుత జేపీఎస్‌లకు మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉండగా.. దాన్ని నాలుగేళ్లకు పెంచారు. మహిళా జేపీఎస్‌లకు ప్రసూతి సెలవులు సైతం ఇవ్వడం లేదు. ఇతర ప్రభుత్వోద్యోగులకు రెండేళ్ల ప్రొబేషన్ ఉంటే తమకు నాలుగేళ్లు ఎందుకని అంటున్నారు. నిర్దిష్ట పనివేళలు నిర్ణయించాలి జీపీఎస్ ద్వారా ఫిజికల్ టచ్ లైవ్ లొకేషన్ అటెండెన్స్ నమోదు రద్దుచేయాలి. సెక్రటరీలకు నిర్దిష్ట పనివేళలు నిర్ణయించాలి. ఉపాధి హామీ పనులకు ఒక క్షేత్రస్థాయి సహాయకుడిని ఇవ్వాలి. పంచాయతీల్లో సాంకేతిక పనుల నిర్వహణకు ట్యాబ్లెట్, సిమ్‌కార్డు, ఇంటర్నెట్, డేటా కార్డు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. పంచాయతీలను జనాభా ప్రాతిపదికన 4 గ్రేడ్లుగా విభజించాలి. ప్రస్తుత సర్వీస్ రూల్స్ ప్రకారం 4 గ్రేడ్లు కొనసాగించాలి. –పి.మధుసూదన్‌రెడ్డి, అధ్యక్షుడు, పంచాయతీ సెక్రటరీల సంఘం పని ఒత్తిడి ఎక్కువ యాప్ ద్వారా జీపీఎస్ పద్ధతిలో అటెండెన్స్ నమోదు చేయొద్దని కలెక్టర్లను కోరాం. మేము లేవనెత్తిన అంశాలపై కలెక్టర్లు, పీఆర్ ఉన్నతాధికారుల నుంచి వచ్చే స్పందనను బట్టి మా కార్యాచరణను ఖరారు చేస్తాం. సోమవారం నుంచి అటెండెన్స్ మాత్రం నమోదు చేయడం లేదు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు విధుల నిర్వహణతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. –నిమ్మల వెంకట్ గౌడ్, అధ్యక్షుడు, జూనియర్ సెక్రటరీల సంఘం -
ఏప్రిల్ 6నుంచి జీపీఎస్ సిస్టమ్స్ పనిచేయవు!
సాక్షి, న్యూఢిల్లీ : గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్).. సమాచార, ప్రసార రంగాల్లో అద్భుత సాంకేతిక విప్లవం. ప్రపంచ మార్గదర్శిగా పేరుగాంచిన ఆవిష్కరణ. ఎక్కడికైనా వెళ్లాలంటే.. దారి తెలియదన్న బాధ లేదు.. ఎలా వెళ్లాలి? అనే టెన్షన్ అవసరం లేదు. ఏ వీధికి ఎలా వెళ్లాలో.. ఎక్కడ ఏ మలుపు తిరగాలో అన్నీ అదే చూపెడుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్ నుంచి మిలిటరీ వరకూ.. అన్ని విభాగాల్లో విరివిగా వాడుకలో ఉంది. ఫోన్లు, స్మార్ట్ హోం డివైజ్ ల్లో ఎక్కువగా జీపీఎస్ సర్వీసులను వాడుతుంటారు. జీపీఎస్ సర్వీస్‌తో ఎన్నో కంపెనీలు తమ బిజినెస్ ను రన్ చేస్తున్నాయి. విమానాల్లో, శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనే కాకుండా మానవుడి దైనందిన జీవితంలో కూడా జీపీఎస్ సేవలు ఉపయోగపడుతున్నాయి. కాగా రానున్న రోజుల్లో జీపీఎస్ బేసిడ్ డివైజ్ ల్లో సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని శాన్ ఫ్రాన్సిస్కొలో ఇటీవల ఏర్పాటు చేసిని ఆర్ఎస్ఏ 2019 సెక్యూరిటీ సమావేశంలో నిపుణులు పేర్కొన్నారు. అంతర్జాతీయ సైబర్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. వైటూకే (Y2K) బగ్ కారణంగా 2019 ఏప్రిల్ 6 నుంచి జీపీఎస్ డివైజ్ లలో సర్వీసులు ఆగిపోనున్నాయి. ఆ లోపు మీ డివైజ్ లను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేందంటే ఇకపై మీ డివైజ్‌లలో జీపీఎస్ సేవలను వినియోగించుకోలేరు. జీపీఎస్ సిస్టమ్స్ ను రీసెట్ చేస్తుండడం వల్ల అప్డేట్ చేసుకోవాలని సూచించారు. తైవానీస్ మల్టీనేషనల్ సైబర్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ బిల్ మాలిక్ ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 6న విమాన ప్రయాణం చేయననని చెప్పారు. 1999లో జీపీఎస్ రిసెట్ అయినట్లుగా ఏప్రిల్ 6న కూడా అలాగే అవుతుందన్నారు. కానీ ఆ రోజు పరిస్థితి కొంచెం అధ్వాన్నంగా ఉండోచ్చునని హెచ్చరించారు. జీపీఎస్ డివైజ్‌లలో కంప్యూటర్ క్యాలెండర్ టైమ్ ముగిసిందని. ఇప్పుడు అప్డేట్ చేస్తే ఆటోమాటిగ్గా మళ్లీ పనిచేస్తుందని వెల్లడించారు. ఇప్పటివరకూ శాటిలైట్ నుంచి వెలువడే జీపీఎస్ సిగ్నల్స్ క్లాక్ టైం స్టాప్ .. వీక్ నంబర్ అనుసంధానంగా పనిచేస్తున్నాయి. జీపీఎస్ సిగ్నల్ లోని వీక్ నంబర్ 10 డిజిట్ బైనరీ కోడ్ రూపంలో స్టోర్ అవుతోంది. బైనరీ కోడ్ 0 నుంచి 1,024 ఇలా ఫామ్ అయి ఉంటుంది. ఈ విధానం ద్వారా జీపీఎస్ సిస్టమ్ ను 1,024 (19.6 సంవత్సరాలు) వీక్స్ గా లెక్కించే అవకాశం ఉంటుంది. అంటే.. 1,024 వీక్స్ పూర్తి కాగానే.. జీపీఎస్ సిస్టమ్ క్లాక్.. ఆటోమాటిక్ గా రీసెట్ అయి మళ్లీ 0 నుంచి కౌంటింగ్ ప్రారంభవుతుంది. గతంలో జీపీఎస్ క్లాక్ 1999, ఆగస్టు 21న రీసెట్ అయింది. దాదాపు 20 ఏళ్ల తరువాత మళ్లీ జీపీఎస్ క్లాక్ రీసెట్ కానుంది. 2010 తర్వాత రిలీజ్ అయిన జీపీఎస్ డివైజ్ ల్లో ఈ కొత్త బైనరీ కోడ్ విధానం పర్ ఫెక్ట్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీలో ఎవరైనా పాత జీపీఎస్ బేసిడ్ సిస్టమ్ ను వాడుతున్నట్టయితే వెంటనే అప్ డేట్ చేసుకోండి.. మీ డివైజ్ తయారీదారులు అప్ డేట్ ను రిలీజ్ చేయకుంటే మాత్రం.. సిస్టమ్ లో కొన్ని సీరియస్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. -
గుడ్డిగా యాప్స్ వాడితే అంతే సంగతి..!
వాషింగ్టన్: ప్రస్తుతం ఎక్కువగా టెక్నాలజీ మీదే ఆధారపడి పనులు లాగించేస్తున్నారు. అయితే కొన్నిసార్లు అది మన ప్రాణాల మీదకి తెస్తుందనడానికి అమెరికాలో ఇటీవల ఓ ప్రమాదం ఘటన నిదర్శనమని చెప్పవచ్చు. అసలేమైందంటే.. ఓ వ్యక్తి వద్ద ఇద్దరు మిత్రులు కారు అద్దెకు తీసుకున్నారు. ఈశాన్యరాష్ట్రం వెర్మాంట్ లోని బర్లింగ్టన్ నగరంలో ఎస్యూవీ కారును ఈ వ్యక్తుల డ్రైవర్ నడుపుతున్నాడు. ఆ డ్రైవర్ ట్రాఫిక్ తగ్గుతుందని భావించి తరచుగా జీపీఎస్ మ్యాప్ ఫాలో అయ్యేవాడు. అందులో భాగంగానే తన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న వేజ్ యాప్ (Waze app)ను వాడాడు. ఈ క్రమంలో ఓ ప్రదేశానికి రాగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, రద్దీ తక్కువగా ఉండే రూట్ కోసం వేజ్ యాప్‌లో జీపీఎస్ మ్యాప్‌ను ఫాలో అవుతూ కాస్త ముందుకు నడపగానే మంచుతో గడ్డకట్టి ఉన్న చిన్న సరసులోకి కారు రయ్‌మంటూ దూసుకెళ్లింది. భయబ్రాంతులకు లోనవడం కారులోని వారి వంతయింది. మంచుగడ్డలు చూపిన నరకం కన్నా యాప్ చూపిన నరకమే ఆ ముగ్గురు బాధితుల్ని తెగ ఇబ్బంది పెట్టిందని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ప్రమాదం విషయం తెలియగానే యజమాని టారా గుర్టిన్ షాకయ్యారు. కారులోని వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారని తెలియగానే ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం ఎస్యూవీ జీపును నీటి మడుగు నుంచి బయటకు తీసినట్లు చెప్పారు. గూగుల్ అధికార ప్రతినిధి జూలీ మోస్లర్ ఈ ఘటనపై స్పందిస్తూ.. వేజ్ యాప్‌లో ఇప్పటికే కొన్ని లక్షలసార్లు మార్పులు చేశాం. నిత్యం రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందనేది రోజూ అప్డేట్ చేస్తుంటాం. డ్రైవర్లు యాప్‌తో పాటు రోడ్డుపై ఓ కన్నేసి ఉంచి వాహనాలు నడిపితే కొన్ని ప్రమాదాలను అరికట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. -
జీపీఎస్ టెక్నాలజీ
గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్).. సమాచార, ప్రసార రంగాల్లో అద్భుత సాంకేతిక విప్లవం. ప్రపంచ మార్గదర్శిగా పేరుగాంచిన ఆవిష్కరణ. ఎక్కడికైనా వెళ్లాలంటే.. దారి తెలియదన్న బాధ లేదు.. ఎలా వెళ్లాలి? అనే టెన్షన్ అవసరం లేదు. ఏ వీధికి ఎలా వెళ్లాలో.. ఎక్కడ ఏ మలుపు తిరగాలో అన్నీ అదే చూపెడుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్ నుంచి మిలిటరీ వరకూ.. అన్ని విభాగాల్లో విరివిగా వాడుకలో ఉంది. అసలు జీపీఎస్ టెక్నాలజీ ఏంటి? ఎలా పనిచేస్తుంది? మానవాళికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.. Global Positioning System జీపీఎస్ అంటే ఒక ప్రదేశానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం, దూరాన్ని అంచనా వేయడం, గమ్యాన్ని గుర్తించడం, సమయాన్ని లెక్కించడం, మ్యాపింగ్ వంటి విషయాల్లో జీపీఎస్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం మొబైల్, వాహన, రక్షణ రంగాలతోపాటు వ్యవసాయం, సినిమా, రవాణా, ఐటీ రంగాల్లో జీపీఎస్ టెక్నాలజీని విరివిగా వినియోగిస్తున్నారు. జీపీఎస్ వ్యవస్థను తొలిసారి 1978లో అమెరికా రక్షణ విభాగం.. నవ్స్టార్ పేరిట ప్రారంభించింది. 1994లో 24 శాటిలైట్లతో పూర్తిస్థాయి నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం చాలా దేశాలు అమెరికా జీపీఎస్ టెక్నాలజీనే వినియోగించుకుంటున్నాయి. పనితీరు మొదట భూమిపై ఉండే సమాచారాన్ని జీపీఎస్ సర్వర్ల ద్వారా ఉపగ్రహాలు స్వీకరిస్తాయి. అంటే.. సమాచారం భూమి నుంచి అంతరిక్షానికి చేరుతుంది. అక్కడ నుంచి వినియోగదారుల అభ్యర్థన మేరకు ఆ సమాచారం యూజర్‌కు చేరుతుంది. తర్వాత యూజర్ నుంచి గమ్యానికి చేరుతుంది. ఇలా త్రికోణమితి (ట్రయాంగిల్) విధానంలో సిగ్నల్స్ నిరంతరం ప్రసారమవుతూ ఉంటాయి. 2డీ పొజిషన్ (అక్షాంశ, రేఖాంశాల) ఆధారంగా కనీసం మూడు శాటిలైట్లు రేడియో సిగ్నల్స్ ద్వారా కదలికలను ట్రాక్ చేస్తాయి. ఒకసారి యూజర్ పొజిషన్‌ను గుర్తించిన తర్వాత.. వేగం, ట్రాకింగ్, ఒక స్థానం నుంచి మరో స్థానానికి మధ్య ఉన్న దూరం, ప్రయాణ దూరం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి అంశాలను జీపీఎస్ సర్వర్లు పరిగణలోకి తీసుకుంటాయి. భూమి నుంచి 12 వేల మైళ్ల దూరంలోని కక్ష్యలో ఉన్న జీపీఎస్ వ్యవస్థలో శాటిలైట్లు రోజంతా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి సుమారు గంటకు 7 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి. జీపీఎస్ ఉపయోగాలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనే కాకుండా మానవుడి దైనందిన జీవితంలో కూడాజీపీఎస్ సేవలు ఎలా ఉపయోగపడు తున్నాయో చూద్దాం.. పిల్లలు, మహిళలు, ఇతర కుటుంబ సభ్యులు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఇంట్లో నుంచే వాహన కదలికలను గమనించవచ్చు. దొంగతనానికి గురైన వాహనాలు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పట్టుకోవడానికి వినియోగిస్తారు. భూ, వాయు, జల మార్గాల్లో వాహన చోదకులకు (డ్రైవర్లు, పైలట్లు) దిశానిర్దేశం చేయొచ్చు. సర్వేలు, మ్యాపింగ్ అవసరాలకు ఉపయోగపడుతుంది. కేసుల విచారణ సమయంలో పోలీసులు ఎక్కువగా జీపీఎస్‌పై ఆధారపడతారు. వాతావరణ పరిస్థితులను, ప్రకృతి వైపరీత్యాలను జీపీఎస్ ద్వారానే అంచనా వేస్తారు. వాహనాలకు జీపీఎస్ టెక్నాలజీని అమర్చడం ద్వారా అక్రమ రవాణాలను, చోరీలను సులభంగా గుర్తించవచ్చు, నియత్రించవచ్చు. అడవులు, వన్య మృగాల పర్యవేక్షణలో అటవీ శాఖ జీపీఎస్ టెక్నాలజీపైనే ఆధారపడుతోంది. జీపీఎస్ బేస్డ్ మెషీన్ గెడైన్స్ సిస్టం ద్వారా నిర్మాణ రంగం, మైనింగ్ వంటి విభాగాల్లో భారీ పరికరాలను ఆపరేట్ చేస్తారు. వ్యవసాయ రంగంలో పంట పొలాలను పరిశీలించడం, పర్యవేక్షణ, మందులను పిచికారీ, పంట కోయడం వంటి పనులకు వాడే కొన్ని పరికరాల్లో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో, బైకులు, కార్ రేసింగ్లలో ఈ టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి, సముద్రం లోపల దిశానిర్దేశం చేయడానికి, విపత్కర పరిస్థితుల్లో ఆచూకీ తెలపడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఠ రక్షణ రంగంలో ఎక్కువగా ఈ జీపీఎస్ టెక్నాలజీని వినియోగిస్తారు. యుద్ధ సమయాల్లో శత్రువుల ఆచూకీ, సమయం తెలుసుకోవడానికి, సైనికులకు దిశానిర్దేశం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. కొన్ని జీపీఎస్ ఆధారిత యాప్‌లు Explore Around You మీరు ఒక ప్రదేశానికి వెళ్లాలనుకున్నారు. అక్కడికి ఎలా వెళ్లాలో మీకు తెలుసు. కానీ అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? హోటల్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి? వంటి సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది. ఇందులో ఉండే అప్షన్లలో ప్రధానమైంది ‘డిస్టెన్స్ రేడియస్’. దీని ద్వారా మీరున్న చోటుకి నిర్ణీత దూరంలో ఉన్న వాటిని తెలుసుకోవచ్చు. అలాగే ‘టైం ఆఫ్ డే’ ఆప్షన్ నిర్ణీత సమయంలో అందుబాటులో ఉన్నవాటిని మాత్రమే చూపుతుంది. ఉదాహరణకు మీరో కాఫీ షాప్‌ని సెలెక్ట్ చేశారనుకోండి.. అది మీరున్న చోటుకి ఎంత దూరంలో ఉంది? అందులో ధరలు, ఫోన్ నంబర్లు, అడ్రస్, కాఫీ షాపు ఫొటోలు వంటి వివరాలను మీ కళ్ల ముందుంచుతుంది. నెట్ లేకుంటే జీపీఎస్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం లేదు. . MAPS.MEలాంటి ఆఫ్‌లైన్‌లో పనిచేసే యాప్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు... జీపీఎస్ డేటా మొబైల్‌లోకి డౌన్లోడ్ అయి పనిచేస్తుంది. ఈ యాప్ డౌన్లోడ్ కోసం http://goo.gl/XIqbZr ఛోట లింక్‌ని చూడండి. రెండింటిలోనూ.. స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ రెండింటిలోనూ జీపీఎస్ నేవిగేషన్ సేవల్ని వినియోగించుకోవాలనుకుంటున్నారా..? అయితే MapFactor GPS Navigation యాప్‌ని ఇన్‌స్టాల్‌ని చేసుకోండి. ఈ యాప్ ఇన్స్టాల్ చేయగానే ఆఫ్‌లైన్‌లో వాడుకునేందుకు వీలుగా మ్యాప్ డేటా మొత్తం ఎస్డీ కార్డ్‌లో సేవ్ అవుతుంది. వివిధ భాషల్లో నేవిగేషన్‌ని పొందగలిగే ఈ యాప్ అప్డేట్స్ని ప్రతినెలా ఉచితంగా పొందొచ్చు. 2డీ, 3డీ రూపాల్లో మ్యాప్ డిస్ప్లే కనిపించడం ఈ యాప్ ప్రత్యేకత. అడుగు దూరంలో మన జీపీఎస్ అగ్రరాజ్యం అమెరికా విసిరిన సవాలుకు దీటుగా జవాబు చెప్పేందుకు ఇస్రో చేపట్టిన బృహత్తర కార్యమే.. ఐఆర్ఎన్ఎస్ఎస్ (Indian Regional Navigation Satellite System).ఈ శాటిలైట్ వ్యవస్థ ద్వారా స్వదేశీ జీపీఎస్ వ్యవస్థ కల సాకారం కానుంది. ఇప్పటివరకు అమెరికా ఆధీనంలో ఉన్న జీపీఎస్ సేవల్నే చాలా దేశాలు వినియోగించుకుంటున్నాయి. క్లిష్ట సమయాల్లో సేవలు అందించడంలో మెలికపెడుతూ అమెరికా నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తోంది. కార్గిల్ యుద్ధ సమయంలో జీపీఎస్ సేవల వినియోగం, సమాచార సేకరణలో అమెరికా నుంచి మన దేశానికి ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా స్వదేశీ జీపీఎస్ వ్యవస్థను రూపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం, ఇస్రో పనిచేస్తున్నాయి. ఈ సేవలు అందుబాటులో వస్తే మిలిటరీ, పౌర, వాణిజ్య సేవల సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. రెండు రకాల సేవలందించే ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్లో మొదటిది స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్(ఎస్పీఎస్). ఇది వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. రెండోది రిస్ట్రిక్టెడ్ సర్వీస్(ఆర్ఎస్). ఇది మిలిటరీ లాంటి కొన్ని విభాగాలకు అందుబాటులో ఉండబోతోంది. -
జీపీఎస్ టెక్నాలజీ సూట్‌కేసులు వచ్చేస్తున్నాయ్
కాలిఫోర్నియా : మనం సాధారణంగా మొబైల్స్, కార్లలో జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) టెక్నాలజీని ఎక్కువగా వాడుతుంటాం. కానీ ఒక సూట్‌కేస్‌కి జీపీఎస్ ఉంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? మన సామాన్లు భద్రంగా ఉండటమే కాదు.. అది ప్రపంచంలో ఎక్కడున్నా లొకేషన్‌ను ట్రేస్చేసి తెలుసుకోవచ్చు. అదే బ్లూస్మార్ట్ సూట్‌కే సు. ఇది మొబైల్ యాప్ ద్వారా పనిచేస్తుంది. ఇందులో ఓ పవర్‌బ్యాంక్ కూడా ఉంటుంది. దీనిద్వారా మొబైల్ చార్జింగ్ చేసుకోవచ్చు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ సూట్కేసుకు డిజిటల్ లాక్ కూడా ఉంది. దానిని పగలగొడితే తప్ప దొంగలు ఓపెన్ చేయలేరు. త్వరలోనే ఇండియాలో ఈ బ్లూస్మార్ట్ సూట్‌కేసులు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. -
పాలిసెట్ గడువు పొడిగింపు
♦ సోమవారం వరకు దరఖాస్తుల స్వీకరణ ♦ 268 కేంద్రాల్లో 21న పరీక్ష ♦ పరీక్ష నిర్వహణకు తొలిసారి జీపీఎస్ టెక్నాలజీ సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) నిర్వహించే పాలిసెట్-2016 దరఖాస్తు గడువును ఒక రోజు పొడిగించారు. వాస్తవానికి ఆదివారంతో గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ వరుస సెలవులు వచ్చిన నేపథ్యంలో అభ్యర్థుల సౌకర్యార్థం సోమవారం వరకు గడువు పొడిగించినట్లు సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీ రెడ్డి శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షకు శనివారం వరకు మొత్తం 1,03,400 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 268 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. ఈ నెల 21న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష ముగిశాక రెండు రోజుల్లోగా ‘కీ’ విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరిస్తారు. మే 3న ఫలితాలతోపాటు తుది ‘కీ’ని కూడా విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాలిసెట్‌లో ర్యాంకులు పొందిన అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 54 ప్రభుత్వ, 166 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో నిర్వహించే డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆయా కాలేజీల్లో మొత్తం 58,880 సీట్లున్నాయి. పాలిసెట్ ద రఖాస్తుల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లా నుంచి ఇప్పటివరకు 21,901 దరఖాస్తులు అందగా, రంగారెడ్డి జిల్లా నుంచి 6,424 దరఖాస్తులు అందినట్లు తెలిసింది. మిగిలిన జిల్లాల్లోనూ గతేడాది కంటే ఈ ఏడాది మంచి స్పందన లభిస్తోందని అధికారులు పేర్కొన్నారు. ప్రప్రథమంగా జీపీఎస్ టెక్నాలజీ వినియోగం పాలిసెట్-2016 పరీక్ష నిర్వహణలో ప్రప్రథమంగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) సాంకేతికతను వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని పొందేందుకు పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28 ప్రాంతీయ కేంద్రాల నుంచి 268 పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తరలించే వాహనాలపై పటిష్ట నిఘా పెట్టనున్నారు. ఆయా వాహనాల కదలికలను హైదరాబాద్‌లోని ఎస్బీటీఈటీ కార్యాలయం నుంచే నేరుగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లోనూ అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రీజినల్ కోఆర్డినేటర్లకు ఎస్బీటీఈటీ ఆదేశాలు జారీచేసింది.