పాలిటెక్నిక్ కళాశాలలోని సమస్యలు తెలుసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి
గుమ్మలక్ష్మీపురం: చదువుకోవడానికి పాఠ్యపుస్తకాలు లేవు. ప్రయోగాలు చేసుకునేందుకు ల్యాబ్‌లు లేవు. కూర్చునేందుకు తగిన బెంచీలు లేవు. రెగ్యులర్ బోధకులు లేరు. ప్రిన్సిపాల్ లేరు. అసంపూర్తిగా నిలిచిపోయిన బోధన గదులు. మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. ఉల్లిపాయలు వేయకుండా... ఎక్స్‌పైర్ అయిన సామగ్రితో వంటలు. ఇదీ గుమ్మలక్ష్మీపురంలోని గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కళాశాల(ఎస్టీ)లో దుస్థితి. వాటిని ప్రత్యక్షంగా చూసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి చలించిపోయారు. గత పాలకుల నిర్లక్ష్యానికి విస్తుపోయారు. ఇప్పటికైనా దానిని పూర్తి మౌలిక సదుపాయాలతోతీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆదర్శంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.
అసలేమైందంటే...: గుమ్మలక్ష్మీపురంలో మంగళవారం నిర్వహించిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి హాజరయ్యారు. ఆ సందర్భంలో అక్కడి పాలిటెక్నిక్ విద్యార్థులు ఆమెకు కళాశాలలోని సమస్యలు వివరించారు. వెంటనే స్పందించిన ఆమె అప్పటికప్పుడు కళాశాలను సందర్శించారు. అక్కడ నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు చదువుకోసం వస్తే గత టీడీపీ ప్రభుత్వం కనీస సౌకర్యాలేవీ కల్పించకుండా భవనాన్ని నిర్మించి నిర్లక్ష్యంగా వదిలేయడం బాధాకరమన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ సమస్య ఎప్పుడూ తన దృష్టికి రాలేదని, ఈ పరిస్థితుల్లో విద్యార్థులను చూస్తే ఎంతగానో బాధకలుగుతోందని, ఈ సమస్యలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కళాశాలలో నెలకొన్న సమస్యలను నివేదిక రూపంలో అందజేయాలని ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ నరసింహకు ఆమె ఆదేశించారు. ఆమె వెంట వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment