అనంతపురం క్రైం: మద్యం తాగి కళాశాలకు వచ్చిన విద్యార్థి ని లెక్చరర్ మందలించడంతో అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం పట్టణంలోని రాంనగర్ రైల్వేగేట్ వద్ద గురువారం వెలుగు చూసింది. పట్టణంలోని శారదా నగర్‌కు చెందిన ఎస్. అరుణ్‌కుమార్(18) స్థానిక ఇంటలెక్చువల్ పాల్‌టెక్నిక్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం మద్యం సేవించి కళాశాలకు హజరయ్యాడు. అక్కడ స్నేహితులతో సరదాగా గొడవ పడుతున్న సమయంలో తరగతి గదిలోని కిటికి అద్దం పగిలింది. ఇది గుర్తించిన ఉపాధ్యాయుడు ముగ్గురు విద్యార్థులను పిలిచి మందలించాడు.
దీంతో ఇద్దరు విద్యార్థులు తాము చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరారు. అయితే అరుణ్ కుమార్ మాత్రం ఉపాధ్యాయుడితో వాగ్వాదానికి దిగాడు. దీంతో అతను మద్యం తాగి ఉన్నాడని గుర్తించిన సదరు ఉపాధ్యాయుడు అతన్ని తన గదికి తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లాక ఏం జరిగిందనే విషయం తెలియక పోగా అప్పటి నుంచి అరుణ్ కుమార్ కళాశాలకు రావడం మానేశాడు. నిన్న ఇంట్లోంచి బయటకు వెళ్లిన అరుణ్ రాంనగర్ రైల్వే గేట్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు, జీఆర్‌పీ పోలీసులు విచారణ చేస్తున్నారు.