
పాలిటెక్నిక్‌కూ నిరాదరణ
ఎచ్చెర్ల క్యాంపస్: ఒకప్పుడు పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుకు మంచి డిమాండ్ ఉండేది. జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు 10వ తరగతి తరువాత మూడేళ్ల ఈ కోర్సుకు ప్రాధాన్యతనిచ్చేవారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉన్నత చదువు చదివేవారు. లేని వారు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరేవారు. ప్రస్తుతం గతంలో పోల్చితే డిప్లమా తరువాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గాయి. మరోవైపు మూడేళ్ల డిప్లమా తరువాత మరో మూడేళ్లు ఇంజినీరింగ్ పూర్తి చేసినా ఆశించిన ఉపాధి అభ్యం కావడం లేదు
. దీంతో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కోర్సులకు డిమాండ్ తగ్గింది. పాలిటెక్నిక్‌లో ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు నిండకపోవడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మెకానికల్, సివిల్, ట్రిపుల్‌ఈ వంటి బ్రాంచ్‌లకు మాత్రమే ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు చేరారు. జిల్లాలో ఐదు ప్రభుత్వ కళాశాలలు ఉండగా.. 780 సీట్లకు 513 ప్రవేశాలు జరిగాయి. ఆరు ప్రైవేట్ కళాశాలలు ఉండగా.. 1920 సీట్లకు 536 నిండాయి.
ప్రభుత్వ కళాశాలలను పరిశీలిస్తే..
సీతంపేట మోడల్ పాలిటెక్నిక్ ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేశారు. మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహించినా 120 సీట్లకు 22 ప్రవేశాలు మాత్రమే జరిగాయి. సివిల్‌లో 60 సీట్లకు 07, మెకానికల్‌లో 60 సీట్లకు 15 మాత్రమే నిండాయి. ఎస్టీ అభ్యర్థులు లేనప్పుడు రిజర్వేషన్ రోస్టర్ మార్పు చేస్తే కొంత వరకు ప్రవేశాలు జరిగే అవకాశం ఉంటుంది. డిమాండ్ ఉన్న బ్రాంచ్‌లైనా కనీసం ఇక్కడ ప్రవేశాలు లేకపోవడం ప్రభుత్వ సంస్థ నిర్వహణ సమస్యగా మారుతుంది. రెసిడెన్సియల్ విద్యా సంస్థ అయినా కనీసం ప్రవేశాలు జరగలేదు. టెక్కలి ప్రభుత్వ కళాశాలను శ్రీకాకుళంలో నిర్వహించేటప్పుడు మెరుగ్గా ప్రవేశాలు ఉండేవి.
శతశాతం ప్రవేశాలు జరిగే ఈ కళాశాలల్లో తరగతులు ప్రారంభమైన తరువాత మూడో విడత కౌన్సెలింగ్‌లో విద్యార్థులు ఆప్షన్లు మార్చుకుంటున్నారు. అక్కడ బోధకులు, సౌకర్యాలు సక్రమంగా లేకపోవడం సమస్యగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 120 సీట్లకు 82 మంది చేరారు. సివిల్‌లో 60కి 39, ట్రిపుల్‌ఈలో 60కి 43 మంది చేరారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్‌లో నిర్వహిస్తున్న కొన్ని డిప్లమా బ్యాచ్‌లకు కూడా డిమాండ్ తగ్గింది. సీసీపీ బ్రాంచ్‌లో 60 మందికి ఏడుగురు మాత్రమే చేరారు.
సీఎంఈలో 60కి 40 మంది చేరారు. ప్రభుత్వ మహిళల పాలిటెక్నిక్‌లో ఏఈఐలో 60 సీట్లకు ఆరుగురు మాత్రమే చేరారు. ప్రభుత్వ కళాశాలైనా.. ఈ బ్రాంచ్‌కు విద్యార్థినులు ప్రాధన్యాతివ్వలేదు. గత రెండు కౌన్సెలింగ్‌ల్లో ఆమదాలవలసలో పూర్తి స్థాయిలో సీట్లు నిండాయి. తుదివిడత కౌన్సెలింగ్‌లో మాత్రం ఈసీఈలో 60 సీట్లకు 57 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో నిర్వహిస్తున్న ఏఈఐ, సీసీపీ కోర్సుల్లో గత కొన్నేళ్ల నుంచి సైతం విద్యార్థులు ప్రవేశాలు మెరుగ్గా లేవు. కాలానుగుణంగా ఈ కోర్సు డిజైన్లు మార్పు చేస్తేనే మనుగడ సాధ్యమయ్యే పరిస్థితికి చేరుకున్నాయి.
ప్రైవేట్ కళాశాలల పరిస్థితి ఇదీ..
ఇక ప్రైవేట్ కళాశాలల పరిస్థితి చూస్తే.. ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’ అన్న చందాన ఉంది. డిప్లమాలో డిమాండ్ ఉన్న మెకానికల్, ట్రిపుల్‌ఈ, సివిల్ డిప్లమా కోర్సులు నిర్వహిస్తున్నారు. అయినా కళాశాలల్లో కనీస ప్రవేశాలు లేవు. సీనియర్ కళాశాలల్లో సైతం విద్యార్థులు చేరే పరిస్థితి లేదు. నారాయణ కళాశాలలో 420 సీట్లకు 41 మంది చేరారు. ఈసీఈలో 60 సీట్లకు 0, ట్రిపుల్‌ఈలో 120కి 4, సివిల్‌లో 60కి 8, మెకానికల్‌లో 180కి 29 చొప్పున ప్రవేశాలు జరిగాయి.
టీవీఆర్‌లో 300 సీట్లకు 28 ప్రవేశాలు జరగ్గా.. మెకానికల్‌లో 120కి 18, ట్రిపుల్‌ఈలో 120కి 05, సివిల్ 60కి 05 ప్ర వేశాలు జరిగాయి. సిస్టంలో 240కి 72, శివానీలో 180కి 36 సీట్లు నిండాయి. ఈ కళాశాలలో మెకానికల్‌లో మాత్రమే 60కి 25 ప్రవేశాలు జరిగాయి. ట్రిపుల్‌ఈలో 60కి 4, సివిల్‌లో 60కి 07 సీట్లు నిండాయి. ఐతంలో 360కి 156, వెంకటేశ్వరలో 420కి 203 ప్రవేశాలు జరిగాయి. మెకానికల్, ట్రిపుల్‌ఈల్లో ఈ ఏడాది కొంత వరకు మెరుగ్గా ప్రవేశాలయ్యాయి. ప్రస్తుతం సాంకేతిక విద్యాశాఖ సీట్ల తగ్గింపుపై సైతం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంజినీరింగ్‌లో చాలా కళాశాలు సీట్లు తగ్గించుకున్నాయి.