♦ జూన్ 9 కల్లా విద్యా సంవత్సరం ప్రారంభం
♦ సాంకేతిక విద్యా డెరైక్టర్ ఎంవీరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్-2016 పరీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్ 24న జరుగనుంది. ఈ మేరకు పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లపై సోమవారం పాలిసెట్ కమిటీ సమావేశమై సమీక్షించింది. సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి, ప్రవేశాల కౌన్సెలింగ్ తదితర అంశాలపై చర్చించారు. గతేడాది దాదాపు 52 వేలకుపైగా పాలిటెక్నిక్ సీట్లకు లక్ష మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి అంతకంటే ఎక్కువగా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
మొత్తంగా వచ్చే విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ ప్రవేశాలను జూన్ 9లోగా పూర్తి చేయాలని.. ఆ రోజు నుంచే తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని పాలిసెట్ కమిటీని ఎంవీ రెడ్డి ఆదేశించారు. అలాగే ఈ సమావేశంలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్‌లలో మార్పులు, ఇందుకు ఏర్పాటు చేసే కమిటీలో పరిశ్రమలకు ప్రాతినిధ్యం కల్పించడంపైనా చర్చించారు. అన్ని ఇంజనీరింగ్ కోర్సులకు అవసరమయ్యే సబ్జెక్టులను ఉంచేసి... అంతగా అవసరం లేని సబ్జెక్టులను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పదో తరగతి సిలబస్‌ను చూసి, అందుకు అనుగుణంగా మార్పులు చేయాలని అభిప్రాయపడ్డారు. ఇక పాలిటెక్నిక్‌లలో పాలిసెట్ ప్రాస్పెక్టస్, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, వెబ్‌సైట్ తదితర సమాచారం అందుబాటులో ఉంచనున్నారు. ఈ సమావేశంలో సాంకేతిక విద్య జాయింట్ డెరైక్టర్ యూవీఎస్‌ఎన్ మూర్తి, ఎస్‌బీటీఈటీ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, ఆర్జేడీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 24న పాలిసెట్
Published Tue, Dec 29 2015 1:03 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM
Advertisement