హిందూపురం అర్బన్: స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని శ్రావణి (18) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన నరసింహులుకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తూ పిల్లలను చదివించుకుంటున్నాడు. ఈ క్రమంలో పెద్ద కుమార్తె శ్రావణి (18) హిందూపురంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
కళాశాల క్యాంపస్‌లోని హాస్టల్‌లో ఉంటున్న ఆమె మంగళవారం ఉదయం 10.20 గంటలకు స్నానాలగదిలో అపస్మారక స్థితిలో పడి ఉండగా గమనించిన స్నేహితుల నుంచి సమాచారం అందుకున్న ప్రిన్సిపాల్ హరీష్‌బాబు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. క్రిమి సంహారక మందు తాగినట్లుగా వైద్యులు గుర్తించి చికిత్స మొదలు పెట్టారు. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ హరూన్‌బాషా కళాశాల వసతి గృహానికి చేరుకుని పరిశీలించారు.
క్రిమి సంహారక మందు తాగే ముందు శ్రావణి రాసి పెట్టిన ఓ ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో తన మృతికి కారకులు ఎవరూ కాదని ఆమె పేర్కొంది. క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, తనకు ఆపరేషన్ అంటే భయమని వివరించింది. తల్లిదండ్రులకు తాను భారం కాకూడదనే ఉద్దేశ్యంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment