కాసుల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు | Polytechnic Colleges Situation Under Satavahana University | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 28 2018 2:42 PM | Last Updated on Fri, Sep 28 2018 6:28 PM

Polytechnic Colleges Situation Under Satavahana University - Sakshi

పాలిటెక్నిక్‌ కళాశాలలకు పంపించిన లేఖ

శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్‌) : పాలిటెక్నిక్‌ విద్యార్థులకు చివరి సెమిస్టర్‌లో ఉండాల్సిన పారిశ్రామిక శిక్షణపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఆరో సెమిస్టర్‌ను కొనసాగించడానికి స్టేట్‌బోర్టు ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ వారు సూచించిన నియమ నిబంధనలు కళాశాలలకు కాసుల వర్షం కురిపించేలా ఉన్నాయని విద్యారంగ నిపుణుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సాకుతో ఎస్‌బీటీఈటీ లక్ష్యాన్ని పక్కదారి పట్టించేలా నియమనిబంధనలకు విరుద్ధంగా అనుసరించడానికి ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేట్‌ డిప్లొమా కళాశాలలు వ్యూహాలు పన్నుతున్నాయి. చివరి సెమిస్టర్‌లో స్టేట్‌బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలకు చివరి సెమిస్టర్‌లో విద్యార్థుల అభిప్రాయం మేరకు ఆర్నెల్ల పారిశ్రామిక శిక్షణ లేదా మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్‌హౌజ్‌ ప్రాజెక్టు అనే రెండుదారులు సూచించారు.

ఇందులో ఎక్కువ శాతం మంది విద్యార్థులు పారిశ్రామిక శిక్షణ వైపే మొగ్గుచూపుతున్నారు. అయినా వివిధ సాకులను చూపిస్తూ తమ కళాశాలల్లోనే మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్‌హౌజ్‌ ప్రాజెక్టు వైపు విద్యార్థులకు ఇష్టం లేకుండానే మళ్లించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రాజెక్టు పేరుతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు కళాశాలలు విద్యార్థుల నుంచి అదనంగా డబ్బులు దండుకోవచ్చనే పన్నాగంతో వారి అభిప్రాయాలకు సంబంధం లేకుండానే ఇన్‌హౌజ్‌ ప్రాజెక్టు వైపునకు బలవంతంగా మళ్లిస్తున్నారని సమాచారం. ఎస్‌బీటీఈటీ అధికారులు దీనిపై దృష్టి పెట్టి విద్యార్థులు కోరుకున్న విధంగా చివరి సెమిస్టర్‌ అమలు చేయాలని పలు ప్రైవేట్‌ కళాశాలల పాలిటెక్నిక్‌ విద్యార్థులతోపాటు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

మొదటి నుంచీ తర్జనభర్జనే..
పాలిటెక్నిక్‌ కోర్సుల్లో గతంలో దాదాపు చివరి సంవత్సరంలో ఏదైనా ఒక సెమిస్టర్‌లో ఆర్నెల్ల పారిశ్రామిక శిక్షణ ఉండేది. తర్వాత దీనిని తొలగించి సబ్జెక్టులు జోడించి కేవలం వేసవి సెలవులు, ఇతర సెలవుల్లో నెలరోజుల శిక్షణ పెట్టారు. ఈ నిర్ణయంతో నిపుణులు, విద్యావంతులతోపాటు వివిధ వర్గాల నుంచి పాలిటెక్నిక్‌ కోర్సులో కచ్చితంగా ఆర్నెల్ల శిక్షణ అవసరమనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో మళ్లీ ఆర్నెల్లకు మార్చారు. 2018–19 విద్యాసంవత్సరంలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆరు నెలల పారిశ్రామిక శిక్షణ లేదా మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్‌హౌజ్‌ ప్రాజెక్టు ఉండాలనే రెండు ఆప్షన్లు ఇవ్వడం వారిని అయోమయంలోకి నెట్టివేస్తున్నాయి. ఈ విధంగా విద్యాసంవత్సరం ప్రారంభమైన నాటినుంచి పారిశ్రామిక శిక్షణపై సరైన స్పష్టత లేకుండానే గడుస్తూ వచ్చింది. తీరా చూసేసరికి అధికారులు రెండు ఆప్షన్లతో కూడిన నిర్ణయానికి వచ్చారు. ఇదే అదునుగా తీసుకుని విద్యార్థులను సంప్రదించకుండానే నేరుగా ఇన్‌హౌజ్‌ ప్రాజెక్టు వైపునకే మళ్లిస్తున్నట్లు సమాచారం. కొన్ని కళాశాలలు పారిశ్రామిక శిక్షణ వైపునకు వెళ్లాలని భావిస్తుండగా, మరికొన్ని ఇన్‌హౌజ్‌ ప్రాజెక్టు వైపు ఆసక్తి చూపిస్తున్నాయి.
 
ప్రాజెక్టు సాకుతో దండుకునే పన్నాగం..?
ఎస్‌బీటీఈటీ అధికారులు రూపొందించిన పాలిటెక్నిక్‌ సెమిస్టర్‌లో పాటించాల్సిన నియమ నిబంధనలు కళాశాలలకు కాసుల వర్షం కురిపించేలా ఉన్నాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆర్నెల్ల పారిశ్రామిక శిక్షణకు పంపితే విద్యార్థులు నేరుగా పరిశ్రమలకే సంబంధిత ఫీజు చెల్లించే అవకాశాలుంటాయని.. దీంతో కళాశాలలకు ఒరిగేదేమీ ఉండదని భావించి, సబ్జెక్టులతో కూడిన ప్రాజెక్టు వర్క్‌ ఆప్షన్‌ ఎంపిక చేస్తే విద్యార్థులు కళాశాలలోనే ఉండడంతోపాటు ప్రాజెక్టు పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు దండుకునే పన్నాగం పన్నుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ మేర కు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు కళాశాలల్లో విద్యార్థులతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోకుండానే నేరుగా కళాశాల యాజ మాన్యాలే ప్రాజెక్టు వైపు నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆరో సెమిస్టర్‌లో విద్యార్థులకు అన్యాయం జరగడంతోపాటు కళాశాలలకు కాసుల వర్షం కురవడం ఖాయమనే భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది.

ఇప్పటికే పలు కళాశాలలు ఆరు నెలల పారిశ్రామిక శిక్షణ వైపునకు మొగ్గుచూపగా పలు కళాశాలలు ప్రాజెక్టు పేరుతో డబ్బులు దండుకోవాలనే ఊగిసలాటలో నిర్ణయాన్ని బయట పెట్టడంలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నగరానికి సమీపంలో ఉన్న ఒక పాలిటెక్నిక్‌ యాజమాన్యం మాత్రం విద్యార్థులను నామమాత్రంగా సంప్రదించి మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్‌హౌజ్‌ ప్రాజెక్టు వైపు మళ్లించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. సొంత అభిప్రాయానికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల ఆశలకు గండికొడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆరో సెమిస్టర్‌లో పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రెండు దారులు ఆప్షన్లు కా కుండా ఏదో ఒకటే అధికారులే నిర్ణయించి నిబంధనలు రూపొందిస్తే బాగుంటుందని, రెండు దారులుండడంతో అయోమయానికి గురవుతున్నామని పలువురు  విద్యార్థులు పెదవి విరుస్తున్నారు. ఎస్‌బీటీఈటీ అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ ఆరో సెమిస్టర్‌లో అవలంబించే తీరుపై ప్రత్యేక నిఘాపెట్టి అక్రమాలకు పాల్పడడానికి ప్రయత్నిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement