SBTET
-
రేపే ఏపీ పాలిసెట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ డిప్లొమాలో వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్–2020) ఆదివారం(27) జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్టు సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం నాయక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ► రాష్ట్ర వ్యాప్తంగా 388 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షకు 88,484 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. కోవిడ్–19 నిబంధనలను అనుసరించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ► అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు పెన్ను, పెన్సిల్ తెచ్చుకోవాలి. తప్పనిసరిగా మాస్క్, గ్లౌజ్ ధరించాలి. శానిటైజర్, వాటర్ బాటిల్ తెచ్చుకోవచ్చు. ► అభ్యర్థుల శరీర ఉష్ణోగ్రతను పరిశీలించాక పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ► కరోనా లక్షణాలుండే విద్యార్థుల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయనున్నారు. ► విద్యార్థి కోవిడ్–19 సెల్ఫ్ డిక్లరేషన్‌ను నింపి సమర్పించాల్సి ఉంటుంది. హాల్ టికెట్, డిక్లరేషన్ ఫారాలను ‘హెచ్‌టీటీపీఎస్//పీఓఎల్‌వైసీఈటీఏపీ.ఎన్ఐసీ.ఐఎన్’ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
కాసుల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు
శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్) : పాలిటెక్నిక్ విద్యార్థులకు చివరి సెమిస్టర్లో ఉండాల్సిన పారిశ్రామిక శిక్షణపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఆరో సెమిస్టర్‌ను కొనసాగించడానికి స్టేట్‌బోర్టు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వారు సూచించిన నియమ నిబంధనలు కళాశాలలకు కాసుల వర్షం కురిపించేలా ఉన్నాయని విద్యారంగ నిపుణుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సాకుతో ఎస్బీటీఈటీ లక్ష్యాన్ని పక్కదారి పట్టించేలా నియమనిబంధనలకు విరుద్ధంగా అనుసరించడానికి ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేట్ డిప్లొమా కళాశాలలు వ్యూహాలు పన్నుతున్నాయి. చివరి సెమిస్టర్లో స్టేట్‌బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలకు చివరి సెమిస్టర్లో విద్యార్థుల అభిప్రాయం మేరకు ఆర్నెల్ల పారిశ్రామిక శిక్షణ లేదా మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్‌హౌజ్ ప్రాజెక్టు అనే రెండుదారులు సూచించారు. ఇందులో ఎక్కువ శాతం మంది విద్యార్థులు పారిశ్రామిక శిక్షణ వైపే మొగ్గుచూపుతున్నారు. అయినా వివిధ సాకులను చూపిస్తూ తమ కళాశాలల్లోనే మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్‌హౌజ్ ప్రాజెక్టు వైపు విద్యార్థులకు ఇష్టం లేకుండానే మళ్లించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రాజెక్టు పేరుతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు కళాశాలలు విద్యార్థుల నుంచి అదనంగా డబ్బులు దండుకోవచ్చనే పన్నాగంతో వారి అభిప్రాయాలకు సంబంధం లేకుండానే ఇన్‌హౌజ్ ప్రాజెక్టు వైపునకు బలవంతంగా మళ్లిస్తున్నారని సమాచారం. ఎస్బీటీఈటీ అధికారులు దీనిపై దృష్టి పెట్టి విద్యార్థులు కోరుకున్న విధంగా చివరి సెమిస్టర్ అమలు చేయాలని పలు ప్రైవేట్ కళాశాలల పాలిటెక్నిక్ విద్యార్థులతోపాటు విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మొదటి నుంచీ తర్జనభర్జనే.. పాలిటెక్నిక్ కోర్సుల్లో గతంలో దాదాపు చివరి సంవత్సరంలో ఏదైనా ఒక సెమిస్టర్లో ఆర్నెల్ల పారిశ్రామిక శిక్షణ ఉండేది. తర్వాత దీనిని తొలగించి సబ్జెక్టులు జోడించి కేవలం వేసవి సెలవులు, ఇతర సెలవుల్లో నెలరోజుల శిక్షణ పెట్టారు. ఈ నిర్ణయంతో నిపుణులు, విద్యావంతులతోపాటు వివిధ వర్గాల నుంచి పాలిటెక్నిక్ కోర్సులో కచ్చితంగా ఆర్నెల్ల శిక్షణ అవసరమనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో మళ్లీ ఆర్నెల్లకు మార్చారు. 2018–19 విద్యాసంవత్సరంలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆరు నెలల పారిశ్రామిక శిక్షణ లేదా మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్‌హౌజ్ ప్రాజెక్టు ఉండాలనే రెండు ఆప్షన్లు ఇవ్వడం వారిని అయోమయంలోకి నెట్టివేస్తున్నాయి. ఈ విధంగా విద్యాసంవత్సరం ప్రారంభమైన నాటినుంచి పారిశ్రామిక శిక్షణపై సరైన స్పష్టత లేకుండానే గడుస్తూ వచ్చింది. తీరా చూసేసరికి అధికారులు రెండు ఆప్షన్లతో కూడిన నిర్ణయానికి వచ్చారు. ఇదే అదునుగా తీసుకుని విద్యార్థులను సంప్రదించకుండానే నేరుగా ఇన్‌హౌజ్ ప్రాజెక్టు వైపునకే మళ్లిస్తున్నట్లు సమాచారం. కొన్ని కళాశాలలు పారిశ్రామిక శిక్షణ వైపునకు వెళ్లాలని భావిస్తుండగా, మరికొన్ని ఇన్‌హౌజ్ ప్రాజెక్టు వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రాజెక్టు సాకుతో దండుకునే పన్నాగం..? ఎస్బీటీఈటీ అధికారులు రూపొందించిన పాలిటెక్నిక్ సెమిస్టర్లో పాటించాల్సిన నియమ నిబంధనలు కళాశాలలకు కాసుల వర్షం కురిపించేలా ఉన్నాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆర్నెల్ల పారిశ్రామిక శిక్షణకు పంపితే విద్యార్థులు నేరుగా పరిశ్రమలకే సంబంధిత ఫీజు చెల్లించే అవకాశాలుంటాయని.. దీంతో కళాశాలలకు ఒరిగేదేమీ ఉండదని భావించి, సబ్జెక్టులతో కూడిన ప్రాజెక్టు వర్క్ ఆప్షన్ ఎంపిక చేస్తే విద్యార్థులు కళాశాలలోనే ఉండడంతోపాటు ప్రాజెక్టు పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు దండుకునే పన్నాగం పన్నుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ మేర కు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు కళాశాలల్లో విద్యార్థులతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోకుండానే నేరుగా కళాశాల యాజ మాన్యాలే ప్రాజెక్టు వైపు నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆరో సెమిస్టర్లో విద్యార్థులకు అన్యాయం జరగడంతోపాటు కళాశాలలకు కాసుల వర్షం కురవడం ఖాయమనే భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు కళాశాలలు ఆరు నెలల పారిశ్రామిక శిక్షణ వైపునకు మొగ్గుచూపగా పలు కళాశాలలు ప్రాజెక్టు పేరుతో డబ్బులు దండుకోవాలనే ఊగిసలాటలో నిర్ణయాన్ని బయట పెట్టడంలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నగరానికి సమీపంలో ఉన్న ఒక పాలిటెక్నిక్ యాజమాన్యం మాత్రం విద్యార్థులను నామమాత్రంగా సంప్రదించి మూడు సబ్జెక్టులతో కూడిన ఇన్‌హౌజ్ ప్రాజెక్టు వైపు మళ్లించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. సొంత అభిప్రాయానికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల ఆశలకు గండికొడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆరో సెమిస్టర్లో పాలిటెక్నిక్ విద్యార్థులకు రెండు దారులు ఆప్షన్లు కా కుండా ఏదో ఒకటే అధికారులే నిర్ణయించి నిబంధనలు రూపొందిస్తే బాగుంటుందని, రెండు దారులుండడంతో అయోమయానికి గురవుతున్నామని పలువురు విద్యార్థులు పెదవి విరుస్తున్నారు. ఎస్బీటీఈటీ అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాలిటెక్నిక్ ఆరో సెమిస్టర్లో అవలంబించే తీరుపై ప్రత్యేక నిఘాపెట్టి అక్రమాలకు పాల్పడడానికి ప్రయత్నిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
రేపు పాలీసెట్
♦ హాజరుకానున్న 1.31 లక్షల మంది ♦ ఏర్పాట్లు పూర్తి చేసిన ఎస్బీటీఈటీ ♦ నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 22న పాలీసెట్–2017 నిర్వహించేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షను నిర్వహించనుంది. పరీక్షకు హాజరయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,31,044 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 393 కేంద్రాల్లో పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు 52 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. విద్యార్థులను పరీక్ష హాల్లోకి గంట ముందునుంచే అనుమతిస్తామని, ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్బీటీఈటీ సూచించింది. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం అయ్యాక నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. సెల్‌ఫోన్, మొబైల్, క్యాలుక్యు లేటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించేది లేదని, విద్యార్థులు హెచ్‌బీ/2బీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్‌నర్, ఎగ్జామ్ ప్యాడ్ వెంట తెచ్చుకోవాలని సూచించింది. విద్యార్థులు తమ వెబ్సైట్ నుంచి (ఞౌlyఛ్ఛ్టి్టట.nజీఛి.జీn) హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఏమైనా సమస్యలు తలెత్తితే హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సంప్రదించాలని, హెల్ప్ డెస్క్ నంబర్లలోనూ (8499827774, 18005995577–టోల్‌ఫ్రీ, ఞౌlyఛ్ఛ్టి్టటఃజఝ్చజీl.ఛిౌఝ మెయిల్లో) సంప్రదించ వచ్చని వివరించింది. -
ఏప్రిల్‌లోనే పాలీసెట్!
ఇంగ్లిష్, సోషల్ సబ్జెక్టులపైనా ప్రశ్నలు సోషల్‌లో తెలంగాణ చరిత్రపై ప్రశ్నలు, వాటికి మార్కులు కసరత్తు చేస్తున్న సాంకేతిక విద్యా, శిక్షణ మండలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలీసెట్–2017 నుంచి వచ్చే ఏప్రిల్‌లోనే నిర్వహించేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కసరత్తు చేస్తోంది. దాంతోపాటు ఈసారి ప్రవేశ పరీక్షలో ఇంగ్లిష్, సోషల్ సబ్జెక్టులను ప్రవేశపెడుతోంది. ఇందుకు అవసరమైన చర్యలపై దృష్టి సారించింది. విద్యార్థులు పాలిటెక్నిక్ చదవాల్సింది ఇంగ్లిష్ మీడియంలోనే అయినందున ఇంగ్లిష్ భాషకు సంబంధించిన ప్రాథమిక అంశాలపైనా ప్రశ్నలు అడగాలని నిర్ణయించింది. దాంతోపాటు సోషల్ సబ్జెక్టును ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం, చరిత్రకు సంబంధించిన అంశాలపైనా ప్రశ్నలు అడగాలని నిర్ణయించింది. సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులకు రాష్ట్ర చరిత్రపైనా అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో వాటిపై ప్రశ్నలు అడిగేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే వీటికి ఎక్కువ మొత్తంగా మార్కులు ఇవ్వకుండా, కేవలం విద్యార్థుల అవగాహనను మాత్రమే పరీక్షించేలా ఉండాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇంగ్లిష్ భాషకు సంబంధించిన పరిజ్ఞానంపై 10 మార్కులు కలిగిన అంశాలను అడగనుంది. సోషల్‌లోనూ అంతే. 10 మార్కులకు సోషల్ సంబంధ ప్రశ్నలు అడిగేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు పాలీసెట్ పరీక్షలో ఈ అంశాలను అడగలేదు. 2017 పాలీసెట్‌లో మాత్రం వాటిపై ప్రశ్నలు ఉండనున్నాయి. వాటితోపాటు మరో 100 మార్కులు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీపై ప్రశ్నలు ఉంటాయి. గతంలో ఈ మూడు సబ్జెక్టుల్లోనే 120 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహించగా, ఇకపై ఆ మార్కులను తగ్గించారు. కేవలం 100 మార్కులకే ఆ మూడు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు ఉండనున్నాయి. ఇదీ పాలీసెట్ ప్రవేశ పరీక్ష స్వరూపం సబ్జెక్టు గతంలో మార్కులు ప్రస్తుత మార్కులు మ్యాథ్స్ 60 50 ఫిజిక్స్ 30 25 కెమిస్ట్రీ 30 25 ఇంగ్లిష్ – 10 సోషల్ – 10 -
నేటి నుంచి పాలిసెట్ దరఖాస్తులు
నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్బీటీఈటీ ► వచ్చే నెల పదో తేదీ వరకు దరఖాస్తులు.. 21న పరీక్ష ► మే 3న తుది ‘కీ’, ఫలితాలు ► అందుబాటులో ఉన్న సీట్లు 58,880 ► 1.30 లక్షల వరకు దరఖాస్తులు రావొచ్చని అంచనా సాక్షి, హైదరాబాద్: వివిధ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్-2016 పరీక్ష నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి(ఎస్బీటీఈటీ) సోమవారం విడుదల చేసింది. మంగళవారం (8వ తేదీ) నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. గడువు తర్వాత జరిమానాతోగానీ, తాత్కాలిక పద్ధతిన గానీ దరఖాస్తులు తీసుకునే అవకాశం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 278 పరీక్షా కేంద్రాల్లో ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలిసెట్ పరీక్ష జరుగుతుంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాలిసెట్ రాసేందుకు అర్హులు. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.330 కాగా.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.165. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 54 ప్రభుత్వ, 166 ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో మొత్తం 58,880 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పరీక్ష ముగిశాక రెండు రోజుల్లోగా ప్రాథమిక ‘కీ’ విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరిస్తామని ఎస్బీటీఈటీ కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. మే 3న తుది ‘కీ’తోపాటు ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. పాలిసెట్‌కు గతేడాది 1.03 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న ఈ పాలిటెక్నిక్ కోర్సులపై విస్తృత ప్రచారం నేపథ్యంలో ఈసారి 1.30 లక్షలకు పైగా దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పాలిటెక్నిక్‌లలో హెల్ప్‌లైన్ కేంద్రాలు అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకొనేందుకు, సూచనలు, సలహాల కోసం ఏపీ ఆన్లైన్ కేంద్రాలతో పాటు ఎంపిక చేసిన పాలిటెక్నిక్‌లలో సహాయక (హెల్ప్‌లైన్) కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ సదుపాయమున్న వారు ఞౌడఛ్ఛ్ట్టిట.జీఛి.జీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాలిసెట్‌కు సంబంధించిన దరఖాస్తు నమూనా, ఇతర వివరాల బుక్లెట్ టఛ్ట్ఛ్ట.్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు నమూనాలో కోరిన వివరాలను నింపి ఏపీ ఆన్లైన్, పాలిటెక్నిక్‌లలోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సమర్పించవచ్చు. మరేవైనా సందేహాలుంటే టోల్‌ఫ్రీ నంబర్ 1800 599 5577కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.