నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్‌బీటీఈటీ
► వచ్చే నెల పదో తేదీ వరకు దరఖాస్తులు.. 21న పరీక్ష
► మే 3న తుది ‘కీ’, ఫలితాలు
► అందుబాటులో ఉన్న సీట్లు 58,880
► 1.30 లక్షల వరకు దరఖాస్తులు రావొచ్చని అంచనా
సాక్షి, హైదరాబాద్: వివిధ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్-2016 పరీక్ష నోటిఫికేషన్‌ను రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి(ఎస్‌బీటీఈటీ) సోమవారం విడుదల చేసింది. మంగళవారం (8వ తేదీ) నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. గడువు తర్వాత జరిమానాతోగానీ, తాత్కాలిక పద్ధతిన గానీ దరఖాస్తులు తీసుకునే అవకాశం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన 278 పరీక్షా కేంద్రాల్లో ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలిసెట్ పరీక్ష జరుగుతుంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాలిసెట్ రాసేందుకు అర్హులు. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.330 కాగా.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.165. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 54 ప్రభుత్వ, 166 ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో మొత్తం 58,880 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పరీక్ష ముగిశాక రెండు రోజుల్లోగా ప్రాథమిక ‘కీ’ విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరిస్తామని ఎస్‌బీటీఈటీ కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. మే 3న తుది ‘కీ’తోపాటు ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. పాలిసెట్‌కు గతేడాది 1.03 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న ఈ పాలిటెక్నిక్ కోర్సులపై విస్తృత ప్రచారం నేపథ్యంలో ఈసారి 1.30 లక్షలకు పైగా దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
పాలిటెక్నిక్‌లలో హెల్ప్‌లైన్ కేంద్రాలు
అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకొనేందుకు, సూచనలు, సలహాల కోసం ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలతో పాటు ఎంపిక చేసిన పాలిటెక్నిక్‌లలో సహాయక (హెల్ప్‌లైన్) కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ సదుపాయమున్న వారు ఞౌడఛ్ఛ్ట్టిట.జీఛి.జీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాలిసెట్‌కు సంబంధించిన దరఖాస్తు నమూనా, ఇతర వివరాల బుక్‌లెట్ టఛ్ట్ఛ్ట.్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తు నమూనాలో కోరిన వివరాలను నింపి ఏపీ ఆన్‌లైన్, పాలిటెక్నిక్‌లలోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సమర్పించవచ్చు. మరేవైనా సందేహాలుంటే టోల్‌ఫ్రీ నంబర్ 1800 599 5577కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.