ఇంగ్లిష్, సోషల్ సబ్జెక్టులపైనా ప్రశ్నలు
సోషల్‌లో తెలంగాణ చరిత్రపై ప్రశ్నలు, వాటికి మార్కులు
కసరత్తు చేస్తున్న సాంకేతిక విద్యా, శిక్షణ మండలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలీసెట్–2017 నుంచి వచ్చే ఏప్రిల్‌లోనే నిర్వహించేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) కసరత్తు చేస్తోంది. దాంతోపాటు ఈసారి ప్రవేశ పరీక్షలో ఇంగ్లిష్, సోషల్ సబ్జెక్టులను ప్రవేశపెడుతోంది. ఇందుకు అవసరమైన చర్యలపై దృష్టి సారించింది. విద్యార్థులు పాలిటెక్నిక్ చదవాల్సింది ఇంగ్లిష్ మీడియంలోనే అయినందున ఇంగ్లిష్ భాషకు సంబంధించిన ప్రాథమిక అంశాలపైనా ప్రశ్నలు అడగాలని నిర్ణయించింది. దాంతోపాటు సోషల్ సబ్జెక్టును ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం, చరిత్రకు సంబంధించిన అంశాలపైనా ప్రశ్నలు అడగాలని నిర్ణయించింది. సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులకు రాష్ట్ర చరిత్రపైనా అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో వాటిపై ప్రశ్నలు అడిగేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే వీటికి ఎక్కువ మొత్తంగా మార్కులు ఇవ్వకుండా, కేవలం విద్యార్థుల అవగాహనను మాత్రమే పరీక్షించేలా ఉండాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇంగ్లిష్ భాషకు సంబంధించిన పరిజ్ఞానంపై 10 మార్కులు కలిగిన అంశాలను అడగనుంది. సోషల్‌లోనూ అంతే. 10 మార్కులకు సోషల్ సంబంధ ప్రశ్నలు అడిగేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు పాలీసెట్ పరీక్షలో ఈ అంశాలను అడగలేదు. 2017 పాలీసెట్‌లో మాత్రం వాటిపై ప్రశ్నలు ఉండనున్నాయి. వాటితోపాటు మరో 100 మార్కులు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీపై ప్రశ్నలు ఉంటాయి. గతంలో ఈ మూడు సబ్జెక్టుల్లోనే 120 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహించగా, ఇకపై ఆ మార్కులను తగ్గించారు. కేవలం 100 మార్కులకే ఆ మూడు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు ఉండనున్నాయి.
ఇదీ పాలీసెట్ ప్రవేశ పరీక్ష స్వరూపం
సబ్జెక్టు గతంలో మార్కులు ప్రస్తుత మార్కులు
మ్యాథ్స్ 60 50
ఫిజిక్స్ 30 25
కెమిస్ట్రీ 30 25
ఇంగ్లిష్ – 10
సోషల్ – 10
ఏప్రిల్‌లోనే పాలీసెట్!
Published Fri, Dec 16 2016 2:50 AM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM
Advertisement