అధికార పార్టీ నేతల స్వార్థానికి..పాలి‘టెక్నిక్‌’! | The condition of polytechnic colleges in srikakulam | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ నేతల స్వార్థానికి..పాలి‘టెక్నిక్‌’!

Published Sat, Jun 24 2017 11:25 AM | Last Updated on Tue, Sep 18 2018 7:45 PM

అధికార పార్టీ నేతల స్వార్థానికి..పాలి‘టెక్నిక్‌’! - Sakshi

అధికార పార్టీ నేతల స్వార్థానికి..పాలి‘టెక్నిక్‌’!

►  అరకొర ఏర్పాట్లతోనే కాలేజీ స్థల మార్పిడి!
►  సొంత లాభం చూసుకున్న టీడీపీ నాయకులు?
►  మంత్రి అచ్చెన్న హామీలిచ్చినా ఆచరణ శూన్యం
►   హాస్టల్‌ వసతి లేక విద్యార్థినుల ఇబ్బందులు
►  కాలేజీ ప్రాంగణంలో కొరవడిన రక్షణ ఏర్పాట్లు


టీడీపీ జిల్లా కార్యాలయానికి సొంత భవనం నిర్మించాలనేది నాయకుల ఆలోచన! ఇందుకోసం గతంలోనే కొనుగోలు చేసిన అరెకరం స్థలం అట్టే పెట్టుకొని జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం అంతా జల్లెడపట్టారు. కలెక్టరేట్‌కు వెళ్లే 80  అడుగుల రోడ్డులో అత్యంత ఖరీదైన రెండెకరాల ప్రభుత్వ స్థలం ఎంపిక చేశారు. పేదల ఇళ్ల నిర్మాణం కోసం గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సేకరించి ఉంచిన ఆ భూమినే 99 ఏళ్లకు నామమాత్ర లీజుతో దక్కించుకున్నారు!

టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌... పేరులో టెక్కలి ఉన్నా ఇప్పటివరకూ నిర్వహిస్తున్నది మాత్రం శ్రీకాకుళం పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలోనే! రూ.10 కోట్ల వరకూ ఖర్చు చేస్తే టెక్కలిలోనే చక్కని భవనాలు, ఆధునిక సౌకర్యాలు కల్పించవచ్చు! కానీ వారి ఆలోచన వేరు! టీడీపీ నాయకుల బంధువులు నందిగామ మండలంలో ఓ మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసి రెండేళ్లకే నిరాదరణకు గురై మూతవేసిన ఇంజినీరింగ్‌ కళాశాల భవనాలపై దృష్టిపెట్టారు. ఆ రూ.10 కోట్లు ప్రజాధనంతో కొనుగోలు చేశారు.

ఈ రెండు లావాదేవీలు జరిగింది ఈ మూడేళ్ల కాలంలోనే! కానీ దృక్కోణం భిన్నంగా ఉండటమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. అప్పుడప్పుడూ సమావేశాలు జరిగే పార్టీ కార్యాలయం కోసం జిల్లా కేంద్రంలో కీలకమైన ప్రాంతంలో స్థలం ఎంపిక చేసుకున్న వారే... కొన్ని వందల మంది విద్యార్థులు రోజూ విద్యా తపస్సు చేసుకునే పాలిటెక్నిక్‌ కళాశాల కోసం ఎక్కడో మారుమూల ఏ మాత్రం రక్షణలేని ప్రాంతంలో మూతపడిన ఇంజినీరింగ్‌ కళాశాల భవనాలను కొనిపడేశారు! 99 సంవత్సరాల పాటు తమ సౌకర్యం కోసం ఆలోచించిన అధికార పార్టీ నాయకులు... కొన్ని తరాల యువతరం భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో మాత్రం స్వీయ లబ్ధికే పెద్దపీట వేశారే తప్ప విద్యార్థుల శ్రేయస్సును పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం:
పాలిసెట్‌లో మంచి ర్యాంకు వచ్చి న చాలామంది విద్యార్థులు ఈసారి టెక్కలి పాలిటెక్నిక్‌ కళాశాలనే ఎంపిక చేసుకున్నారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలోని శ్రీకాకుళం పాలిటెక్నిక్‌ కళాశాల కన్నా ముందే ఇక్కడి సీట్లు భర్తీ అయిపోవడం విశేషం. టెక్కలి పాలిటెక్నిక్‌ కళాశాల అంటే అదేదో జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గ కేంద్రంలో ఉంటుందనే చాలామంది భ్రమపడ్డారు. కౌన్సెలింగ్‌లో జాయినింగ్‌ రిపోర్టు తీసుకొని టెక్కలి పట్టణంలో పాలిటెక్నిక్‌ కళాశాల ఎక్కడుందో వెతికీ వెతికీ వెనుదిరిగి వెళ్లినవారూ ఉన్నారు. చివరకు అది టెక్కలి నియోజకవర్గ కేంద్రంలో గాకుండా టెక్కలి నియోజకవర్గ పరిధిలోనే నందిగామ మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో, జాతీయ రహదారికి రెండు కిలోమీటర్ల అవతల కొండకు ఆనుకొని ఉన్న జీడిమామిడి తోటల మధ్య ఉందని తెలుసుకొని అవాక్కవుతున్నారు.

ఐదేళ్ల క్రితమే కాలేజీ మంజూరు
టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఐదేళ్ల క్రితమే మంజూరైంది. అయితే టెక్కలిలో తగిన భవనాలు లేకపోవడంతో శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలోనే ఇటీవలి వరకూ తరగతులు కొనసాగుతున్నాయి. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు చక్రం తిప్పి నందిగాం మండలం దేవుపురం పంచాయతీ పరిధిలోని తురకలకోట గ్రామం వద్దనున్న శివరామకృష్ణ ఇంజినీరింగ్‌ కళాశాల భవనాలను రూ. 9.88 కోట్ల ప్రజాధనంతో రాష్ట్ర ప్రభుత్వంతో కొనుగోలు చేయించారు. కేవలం రెండు బ్యాచ్‌లతోనే 2014 సంవత్సరంలో మూతపడిన ఈ కళాశాల యజమాని సాక్షాత్తూ జెడ్పీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి, టీడీపీ నాయకుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ) దంపతుల అల్లుడు. జిల్లాలోని అచ్చెన్న వర్గంలో బాబ్జీ దంపతులే ప్రధానమైన నేతలు. సరైన పరిశీలన లేకుండానే మంత్రి అచ్చెన్న 2015 నవంబర్‌ నెలలోనే ఆ భవనాలను కొనుగోలు చేసి ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించడం గమనార్హం.

రక్షణలేని భవనాలే ముద్దు  
సుమారు 11.78 ఎకరాల భూమిని సరస్వతి ఎడ్యుకేషనల్‌ సొసైటీ పేరుతో 2008 సంవత్సరంలో కొనుగోలు చేశారు. ఆ సమయంలో రైతులకు ఎకరాకు రూ. 2.5 లక్షల చొప్పున చెల్లించారు. ప్రస్తుత మార్కెట్‌ ధర రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఉంది. అంటే భూమి ముఖ విలువ రూ.50 లక్షలకు మించదు. ఇక్కడ నిర్మించిన శివరామకృష్ణ ఇంజినీరింగ్‌ కాలేజీ మూడు బ్లాక్‌ల విస్తీర్ణం (ప్లింత్‌ ఏరియా) 65 వేల చదరపు అడుగులు. అన్ని ఖర్చులూ, కళాశాల ఫర్నీచర్, ఇంజినీరింగ్‌ ల్యాబ్‌ పరికరాలు కలిపి లెక్కవేసినా మొత్తం విలువ రూ.5 కోట్లు మించదనే వాదనలు ఉన్నాయి. కానీ ఆ యాజమాన్యం రూ.9.88 కోట్లకే ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు కోసం విక్రయించేలా చొరవ తీసుకున్నామని టీడీపీ నాయకులు చెప్పుకోవడం గమనార్హం.  

అంతా భయం భయం...
శివరామకృష్ణ ఇంజినీరింగ్‌ కాలేజీ 2011, జనవరి 9న ప్రారంభమైంది. మారుమూల మౌలిక సౌకర్యాల్లేని పల్లె ప్రాంతంలో ఉండటంతో విద్యార్థులను ఆకట్టుకోలేకపోయింది. 137 మందితో తొలి బ్యాచ్‌ ప్రారంభమైంది. రెండో ఏడాది (2011–12) ప్రవేశాల సంఖ్య 47 మందికి పడిపోయింది. నిర్వహణ భారంతో కళాశాలను మూసేశారు. ఈ భవనాల్లోకి టెక్కలి పాలిటెక్నిక్‌ కళాశాలను శ్రీకాకుళం నుంచి తరలించారు. సివిల్, ఎలక్ట్రికల్‌ ద్వితీయ, తృతీయ సంవత్సరం బ్యాచ్‌లకు చెందిన 240 మందిని పంపించారు. వారికితోడు ఇటీవల కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొందినవారు కూడా జాయినింగ్‌ రిపోర్ట్‌లతో వస్తున్నారు.

వారికి బోధనకు కనీసం 14 మంది ఫ్యాకల్టీ ఉండాలి. ఇప్పటివరకూ రెగ్యులర్‌ ప్రాతిపదికన పోస్టులు మంజూరుకాలేదు. జిల్లాలోని మిగతా పాలిటెక్నిక్‌ కళాశాలల నుంచే డిప్యూటేషన్‌పై కొంతమందిని పంపించే అవకాశాలు ఉన్నాయి. లేదంటే కాంట్రాక్టు ఫ్యాకల్టీని నియమించుకోవాల్సిందే. తరగతి గదుల్లో ఫర్నిచర్‌ ఉన్నా ల్యాబ్‌ల్లో మాత్రం ఇంజినీరింగ్‌ పరికరాలు నామమాత్రంగానే ఉన్నాయి. విద్యార్థుల ప్రయోగ అవసరాలకు అవేమాత్రం సరిపోవు. ఇక వసతి విషయానికొస్తే హాస్టల్‌ సౌకర్యం ఏర్పాటు చేయలేదు.

టెక్కలి, పలాస పట్టణాలు దూరంగా ఉండటంతో పరిసర గ్రామాల్లోనే విద్యార్థులు అద్దె గదుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా అమ్మాయిలు తీవ్ర ఇబ్బం ది పడుతున్నారు. వారి రక్షణపై తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తమవుతున్నారు. అలాగే కళా శాల గ్రామ శివారు ప్రాంతంలో జీడితోటల మధ్య ఉన్నా ప్రహరీ లేకపోవడం, మైదానంలో తుప్పలు, పాము పుట్టలతో నిండి ఉండటంతో విద్యార్థులు హడలిపోతున్నారు.

ప్రజాధనం దుర్వినియోగమే
జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు జెడ్పీ చైర్‌పర్సన్‌ ధనలక్ష్మి అల్లుడికి ఆయాచిత లబ్ధి చేకూర్చడానికి చూస్తే ఆ కళాశాల వల్ల ప్రజాధనం దుర్విని యోగమే తప్ప విద్యార్థులకు ఏమాత్రం సౌకర్యంగా లేదు. ఆ రూ.10 కోట్లతో నందిగామ మండల కేంద్రంలోనే అత్యాధునిక వసతులతో మంచి కళాశాల భవనాలను నిర్మించే అవకాశం ఉండేది.- పేరాడ తిలక్, వైఎస్సార్‌సీపీ టెక్కలి

నియోజకవర్గ సమన్వయకర్త రాజకీయ స్వార్థమే తప్ప మేలు లేదు

టెక్కలి పేరుతో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను నందిగాం మండలంలో మూతపడిన ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ భవనాల్లోకి మార్పు వెనుక రాజకీయ నాయకుల స్వార్థమే ఉంది. ఈ ఏర్పాటు వల్ల విద్యార్థులకు అష్టకష్టాలు తప్ప వారికి ఎలాంటి ప్రయోజనం లేదు.  – అల్లంశెట్టి పెంటారావు, విద్యార్థిని తండ్రి, బొంతలకోడూరు

టీచింగ్‌ స్టాఫ్‌ను నియమించాలి
శ్రీకాకుళం నుంచి నంది గాం మండలంలోని తురకలపాడు వద్దకు కళాశాలను మార్చారు. కానీ ఇక్కడ పాఠాలు బోధించేందుకు ఫ్యాకల్టీ లేరు. ఒక్కో డిపార్టుమెంట్‌కు ఒక్కరు చొప్పు న ఇద్దరు మాత్రమే లెక్చరర్లు ఉన్నారు. కాలేజీ తరలించి రెండు వారాలైనా ఇప్పటివరకూ మౌలిక వసతుల కల్పన జరగలేదు. – బొత్తా హరికృష్ణ, విద్యార్థి, ట్రిపుల్‌ ఈ (థర్డ్‌ ఇయర్‌)

హాస్టల్‌ వసతి కల్పించాలి
సుదూర ప్రాంతాల నుం చి వస్తున్న మాకు ఈ మారుమూల ప్రాంతంలో ఎలాంటి సౌకర్యాలూ లేవు. అందరమూ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అత్యవసరంగా ఈ కళాశాల ప్రాంగణంలోనే హాస్టల్‌ వసతి కల్పించాలి. – యు.రాజా భానుప్రతాప్, విద్యార్థి, సివిల్‌ (థర్డ్‌ ఇయర్‌)

అమ్మాయిలు కాలేజీకి వెళ్లే పరిస్థితి లేదు..
జాతీయ రహదారి నుంచి ఇరుకు మార్గంలో తోటల మధ్య నుంచి  రెండు కిలోమీటర్ల దూ రం నడిచి కాలేజీకి చేరుకోవాలంటే అమ్మాయిలకు  చాలా కష్టంగా ఉంటోంది. ఆటోలు కూడా రావు. రక్షణ దృష్ట్యా ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.  – అడ్డ అఖిల, విద్యార్థిని, సివిల్‌ (సెకెండ్‌ ఇయర్‌)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement