‘అమ్మా నా తప్పు ఏమీ లేదు..’
‘అమ్మా నా తప్పు ఏమీ లేదు..’
Published Thu, Feb 9 2017 12:32 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM
భీమవరం టౌన్ : ‘నేను ఏమీ చేయలేదు. అమ్మా నా తప్పు ఏమీలేదు, నావల్ల ఎవరూ బాధపడటం ఇష్టం లేదు, ఈ సంఘటన వల్ల నీ పెళ్లి ఆగిపోతే నన్ను క్షమించు అన్నయ్య.. మీ డాడీ (పెదనాన్న శివాజీ) దగ్గరకు వెళ్లిపోతున్నా అంటూ’ పాలిటెక్నిక్ విద్యార్థిని సూసైడ్ నోట్‌రాసి భీమవరం పట్టణంలోని యనమదుర్రు డ్రెయిన్‌లో దూకింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బైపాస్ రోడ్డులోని యనమదుర్రు డ్రెయిన్ వంతెనపై మంగళవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఓ విద్యార్థిని నిలబడి ఉంది. అటుగా వెళుతున్న కొందరు ఎందుకు అక్కడ నిలబడ్డావని ఆరా తీయగా స్నేహితుల కోసమని సమాధానం రావడంతో వారు వెనుదిరిగి వెళుతుండగా ఎవరో కాలువలో దూకినట్టు శబ్ధం వచ్చింది. అంతకు ముందు ఆ విద్యార్థిని నిలుచున్న చోట పుస్తకాల బ్యాగ్, జోళ్లు, ఐడెంటీ కార్డుతోపాటు ఒక లెటర్ కనిపించాయి. ఐడెంటీ కార్డు ఆధారంగా విద్యార్థిని పట్టణంలోని ఒక విద్యాసంస్థలో పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.భాగ్యశ్రీలక్ష్మి (16)గా గుర్తించారు. సుంకరపద్దయ్య వీధి సమీపంలోని వానపల్లివారి వీధికి చెందిన మోపాటి గోపి కుమార్తెగా తెలుసుకుని సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక అధికారి ఎస్‌కే జాన్ అహ్మద్ ఆధ్వర్యంలో సిబ్బంది రెస్క్యూబోట్ సహాయంతో కాలువలో గాలింపు చర్య లు చేపట్టారు. ఇద్దరు ఈతగాళ్లను కుటుంబ సభ్యులు రప్పించి వెతికించారు. సాయంత్రం ఇంజిన్ బోటును రప్పించి కాలువలో గాలింపు చేపట్టారు. సూసైడ్ నోట్‌లో తన పెదనాన్న కుమారుడు అమర్‌ను ఉద్దేశించి, పెద్దలకు బై చెబుతూ, తన స్నేహితులు చాలా మంచివారని ప్రస్తావించింది. వారి పెంపుడు కుక్కపిల్ల టోనీకి కూడా బై చెబుతూ దానిని బాగా చూసుకోవాలని రాసి ఉంది. సంఘటనపై పోలీసులను వివరణ కోరగా దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, సమాచారం మేరకు విచారణ చేస్తున్నామని చెప్పారు. గత డిసెంబర్ 31న యువతి, యువకుడు ఇదే వంతెనపై నుంచి దూకి మృతిచెందిన విషయం మరువక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది.
Advertisement
Advertisement